• facebook
  • whatsapp
  • telegram

జీఎస్టీ ఎగవేతకు కళ్ళెం

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత 2022-23లో లక్ష కోట్ల రూపాయలకు పైబడింది. ఈ క్రమంలో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను గుర్తించి, అక్రమార్కులను పట్టుకొనేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఎగవేసిన పన్ను మొత్తం వినియోగదారుల నుంచి వసూలు చేసినదే. కాబట్టి, పన్ను ఎగవేతను నిరోధించడం ప్రభుత్వానికి, వినియోగదారులకు మేలు చేస్తుంది. జీఎస్టీ మండలి 50వ సమావేశం వచ్చే నెలలో జరగనుంది. అందులో పన్ను రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులు కోటికిపైగానే ఉన్నారు. వీరు ప్రజలకు తామందించే వస్తుసేవలపై జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి కడతారు. ఈ క్రమంలో వ్యాపారులు తాము కట్టాల్సిన జీఎస్టీని మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారా, లేదా అధికంగా గుంజి తమ సొంతం చేసుకుంటున్నారా అనేది ప్రశ్న. కొంతమంది వ్యాపారులు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ను తప్పుగా క్లెయిమ్‌ చేయడం, వస్తువుల విలువను సరిగ్గా చూపకపోవడం, అమ్మకాలను తగ్గించి చూపడం, పన్నురేట్లను సక్రమంగా అమలు చేయకపోవడం, నకిలీ బిల్లులు సృష్టించడం లాంటి పద్ధతుల ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు తప్పులు చేయడానికి జీఎస్టీ చట్టంలోని సంక్లిష్టత కూడా ఒక ముఖ్య కారణం. చట్టప్రకారం తాము చెల్లించాల్సిన పన్ను మదింపువేయడం సామాన్య వ్యాపారులకు కష్టం. సంక్లిష్ట పన్ను నిర్మాణం, రకరకాల పన్ను శాతాలు, మినహాయింపులు, వాటికి నిబంధనలు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్లెయిమ్‌ చేసుకోవడానికి విధించిన అనేక నిబంధనలు, పన్ను చెల్లింపుదారుల వర్గీకరణ, వారు చెల్లించాల్సిన పన్నుల్లో వ్యత్యాసాలు, కొనుగోలు దారులకు ఇవ్వాల్సిన బిల్లుల్లో తేడాలు వంటివి వ్యాపారుల పన్ను చెల్లింపులను కఠినతరం చేస్తున్నాయి. వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి కట్టడంలో వ్యాపారులు తడబడుతున్నారు. కొంతమంది వ్యాపారులు మాత్రం అధిక లాభాపేక్షతో పన్నులు ఎగవేయడం, వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేసి, తమ పద్దులో జమ వేసుకోవడం జరుగుతోంది.

నిబంధనలు ఇలా..

వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటానికి జీఎస్టీ చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పెద్ద వ్యాపారులు వినియోగదారులకు ఇచ్చే ఇన్వాయిస్‌లలో వస్తుసేవలపై విధించే పన్ను శాతాలను, చెల్లించాల్సిన మొత్తం పన్నును ప్రత్యేకంగా చూపాలి. ఏ వ్యాపారీ జీఎస్టీ నుంచి మినహాయించిన వస్తుసేవలపై పన్ను వసూలు చేయకూడదు. చెల్లించాల్సిన పన్నుకంటే అధికంగా వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదు. సంబంధిత జీఎస్టీ అధికారి ఎవరైనా వ్యాపారి అధిక పన్ను వసూలు చేసినట్లు గుర్తిస్తే, ఉత్తర్వులు జారీ చేసి ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి జమచేసి, అందులో కట్టాల్సిన పన్నుకంటే అధికంగా ఉన్న మొత్తాన్ని, వినియోగదారుడికి, లేకపోతే వినియోగదారుల సంక్షేమ నిధికి బదిలీ చేయాలి. ప్రభుత్వం వస్తుసేవలపై పన్ను తగ్గించినా, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ ప్రయోజనం ఇచ్చినా, వ్యాపారులు ఆ మేరకు ధరలు తగ్గించాలి. పన్ను తగ్గింపు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ ప్రయోజనాలను వినియోగదారులకు చేరవేయాలి. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకోవడానికి జాతీయస్థాయిలో ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ రాష్ట్రాల్లోని కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆయా కేసులను పరిశీలిస్తుంది. రుజువైన కేసుల్లో వ్యాపారి అక్రమంగా పొందిన లాభాన్ని వినియోగదారులకు లేదా వినియోగదారుల సంక్షేమనిధికి జమచేసేలా ఉత్తర్వులు ఇస్తుంది. ఈ ప్రాధికార సంస్థ 2022 నవంబరు నాటికి మూడు వందలకు పైగా కేసుల్లో వందల కోట్ల రూపాయలు సంక్షేమనిధికి జమయ్యేలా చర్యలు తీసుకుంది. 2022 డిసెంబరు నుంచి ప్రాధికార సంస్థ నిర్వహించాల్సిన విధులను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకు బదిలీ చేశారు. ఎవరైనా వ్యాపారి ఎక్కువ పన్ను చెల్లిస్తే, దాన్ని వ్యాపారికి ప్రత్యేక కేసుల్లో తప్ప తిరిగి చెల్లించరు. అధికంగా చెల్లించిన పన్నును వినియోగదారుల సంక్షేమ నిధికి బదిలీ చేస్తారు. పరోక్ష పన్నులు వినియోగదారుల నుంచి వసూలు చేయలేదని వ్యాపారి నిరూపించాలి. లేనిపక్షంలో వినియోగదారుల నుంచి వసూలు చేసినట్లుగానే పరిగణిస్తారు.

వినియోగదారుల ప్రయోజనాలు

అధిక పన్ను వసూళ్ల నిరోధానికి ఉద్దేశించిన చట్ట నిబంధనలతో వినియోగదారులకు ఎంతమేర మేలు కలుగుతోందన్నది ముఖ్యం. వినియోగదారుల సంక్షేమ నిధికి బదిలీ చేసిన మొత్తాలను ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలకు ఉపయోగించడం మంచిది. అయితే, దానికి వినియోగదారుల నుంచి అన్యాయంగా వసూలు చేసిన పన్నుల డబ్బును ఉపయోగించడం అభ్యంతరకరం. చట్టవిరుద్ధంగా వసూలు చేసిన పన్ను సొమ్మును సంబంధిత వినియోగదారులకే తిరిగివ్వడం సముచితం. ఇదే విషయం చట్టంలో సైతం పేర్కొన్నా, ఆ సమాచారం వినియోగదారులకు తెలిసే అవకాశం తక్కువ. అలాంటి సొమ్ము తిరిగి పొందడానికి వినియోగదారులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. దీంతో ఇలాంటి నిబంధనలు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటానికి ఉద్దేశించినట్లుగా కనిపించడం లేదు. అందుకని, అన్యాయంగా చేపట్టిన పన్ను వసూళ్లను వినియోగదారులకు తిరిగి చెల్లించే విషయంలో ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. అవసరమైతే చట్టంలో, నిబంధనల్లో మార్పులు చేయాలి. వ్యాపారులు చట్టవిరుద్ధంగా వసూళ్లకు పాల్పడినట్లు రుజువైతే, ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. వ్యాపారి నుంచి కొనుగోళ్లు జరిపిన వినియోగదారులకు సైతం ఆ విషయం తెలిసేలా చర్యలు తీసుకోవాలి. వినియోగదారులు పన్ను వాపసు కోసం చేసుకొనే దరఖాస్తుల్ని సరళీకరించాలి. దరఖాస్తు విషయంలో ప్రభుత్వం వినియోగదారుడికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించాలి. జీఎస్టీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న వినియోగదారుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలి. వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయి నిబంధనల మేరకేనని, చట్ట విరుద్ధంగా వసూళ్లు జరిగితే తిరిగి చెల్లిస్తామనే నమ్మకం కలిగించాలి.

మరిన్ని చర్యలు

ముందుగా జీఎస్టీ చట్టాన్ని సరళీకృతం చేయాలి. సరళమైన పన్ను నిర్మాణం, సులభతర పన్ను మదింపు ప్రక్రియ వంటివి వ్యాపారులు తప్పులకు పాల్పడకుండా నిరోధిస్తాయి. పన్ను ఎగవేతను నివారించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. డిజిటల్‌ లావాదేవీలు పెంచడానికి మరింత చొరవ చూపాలి. నగదు లావాదేవీల్ని వీలైనంతగా తగ్గించాలి. వ్యాపారాలు, అమ్మకాలు, కొనుగోళ్లలో నగదు వాడినంతమేర పారదర్శకత లోపిస్తుంది. పన్ను ఎగవేతకు ఆస్కారం కలుగుతుంది. నగదు వినియోగం తగ్గిస్తే వినియోగదారులకు, ప్రభుత్వానికి, నిజాయతీగా వ్యాపారం చేసే వ్యాపారులకూ మేలు కలుగుతుంది.

- డి.వెంకటేశ్వరరావు

(సంయుక్త కమిషనర్‌ (విశ్రాంత), వాణిజ్య పన్నులశాఖ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రపంచ సవాళ్లకు జీ7 పరిష్కారాలు

‣ ఉన్నత విద్యకు ఆర్థిక ఊతం

‣ భారత్‌ జోడు గుర్రాల సవారీ

‣ రక్షణ స్వావలంబనకు ప్రైవేటు బాసట

‣ సాంకేతిక తోడ్పాటుతో.. ప్రయాణం భద్రం

Posted Date: 24-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం