• facebook
  • whatsapp
  • telegram

దేశంలో నల్లధనం ఆటకట్టిందా?

గతంలో పెద్ద నోట్ల రద్దు దేశంలో భారీ సంచలనం సృష్టించింది. ఆర్థిక వ్యవస్థతోపాటు అందరి జీవితాలపై పెను ప్రభావమే చూపింది. నోట్ల రద్దు నిర్ణయంతో సమకూరిన లాభనష్టాలు ఇప్పటికీ చర్చనీయాంశమే. తాజాగా రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ నిర్ణయం వెలువడింది. ఈసారి ఎలాంటి ప్రభావం ఉండబోతోందన్నది ఆసక్తికరం!

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) రూ.2000 విలువైన కరెన్సీ నోట్లను వాపసు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ‘క్లీన్‌ నోట్‌’ విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన మీదట   ఆర్‌బీఐ రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టింది. తరవాత 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఇతర విలువల్లో కరెన్సీ నోట్లు సులువుగా అందుబాటులో ఉన్నందువల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. 2016-17లో సంఖ్యాపరంగా 354.29 కోట్ల రూ.2000 కరెన్సీ  నోట్లను ముద్రించిన రిజర్వు బ్యాంకు- 2017-18లో 11.15 కోట్ల నోట్లను మాత్రమే అచ్చువేసింది. 2018-19లో కేవలం 4.66 కోట్ల నోట్లను చలామణీకి అందించింది. జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2016లో 2,272 నకిలీ రెండువేల రూపాయల   నోట్లను పట్టుకున్నారు. 2020లో వాటి సంఖ్య 2,44,834కు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం 2022లో పార్లమెంటుకు తెలిపింది. ఇది కరెన్సీ నోట్ల సంఖ్యకు సంబంధించినది కాగా, విలువ విషయానికి వస్తే 2018 మార్చి 31న రూ.6.73లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు చలామణీలో ఉన్నాయి. 2023 మార్చి 31న వాటి విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. ఇది మొత్తం చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లలో 10.8 శాతానికి సమానం.

కరెన్సీ వినియోగానికే మొగ్గు

పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశంలో రూ.3-4లక్షల కోట్ల నల్లధనాన్ని రూపుమాపవచ్చని కేంద్ర ప్రభుత్వం తలపోసింది. కానీ, రద్దయిన ధనంలో   99.3 శాతం డబ్బు తిరిగి వచ్చిందని ఆర్‌బీఐ వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు ఘోర వైఫల్యమని ప్రతిపక్షాలు, అది తొందరపాటు నిర్ణయమని ఆర్థికవేత్తలు విమర్శించారు. నల్లధనమంతా కరెన్సీ రూపంలో ఉంటుందనే అపోహే ఈ వైఫల్యానికి కారణం. మొత్తం నల్లధనంలో అయిదు శాతమే కరెన్సీ రూపంలో ఉంటుంది. అందుకే పెద్ద నోట్ల రద్దును తానెన్నడూ సమర్థించలేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నల్లధనం సృష్టిని ఆపలేకపోయింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే, దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన మాట నిజం. కానీ, ప్రజలు ఇప్పటికీ కరెన్సీ వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. అందుకే 2014లో రూ.13 లక్షల కోట్లుగా ఉన్న నగదు చలామణీ 2022 మార్చికల్లా రూ.31.33 లక్షల కోట్లకు పెరిగిందని ప్రభుత్వం లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చింది. ఆర్‌బీఐ కూడా 2016లో రూ.16.4 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణీలో ఉండగా 2021లో అది రూ.29.17 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించింది. కాబట్టి పెద్ద నోట్లను రద్దు చేసినా చేయకున్నా నగదు రహిత లావాదేవీలు ఎంతో కొంత పెరిగి ఉండేవని స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ఆర్థిక వ్యవస్థలో నల్లధనం ప్రక్షాళనకు ఉద్దేశించిన విధానం కాస్తా కరెన్సీ నోట్లను వాపసు తీసుకునే ప్రక్రియగా మారిపోయింది. కేవలం కరెన్సీ నోట్ల రద్దుతోనే నల్లధనం నిర్మూలన సాధ్యంకాదని స్పష్టమవుతోంది.

పార్టీల ఆదాయం

దేశంలోని రెండు ప్రధాన పార్టీల వల్లే నల్లధనం ఉత్పన్నమవుతోందని 2012లో ఎంసీ జోషీ కమిటీ నివేదిక పేర్కొంది. పదేళ్ల క్రితం ఈ రెండు పార్టీలు రూ.10,000 కోట్లు, రూ.15,000 కోట్ల చొప్పున ఎన్నికల్లో ఖర్చు పెట్టాయి. అప్పటికీ ఇప్పటికీ ఈ వ్యయం ఎన్నో రెట్లు పెరిగిపోయి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి నేరచరితులైన సంపన్నులు పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికవడంలో ఆశ్చర్యమేముంది? 2021-22లో భాజపాకు రూ.1,917 కోట్ల విరాళాలు అందాయని ఎన్నికల సంఘం అధికార గణాంకాలు వెల్లడించాయి. ఇది మిగతా అన్ని పార్టీలన్నింటికీ అందిన విరాళాలకన్నా ఎక్కువ. 2016-17 నుంచి ఏటా భాజపాకే ఎక్కువ ఆదాయం కనిపిస్తోంది. అప్పట్లో భాజపా వార్షిక ఆదాయం రూ.570 కోట్లు. తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.   2021-22లో ప్రాంతీయ పార్టీలలో ఆదాయపరంగా డీఎంకే, బీజేడీ, బీఆర్‌ఎస్‌లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. ఇక అభ్యర్థుల ఎన్నికల వ్యయం గురించి అధికారిక గణాంకాలు లేవు. దాతల వివరాలను గుప్తంగా ఉంచుతూ 2018లో తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, కార్పొరేట్లకు తప్ప మరెవరికీ మేలు చేయదనే విమర్శలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకంలో పారదర్శకత లేదని ఎన్నికల సంఘమూ తప్పుపట్టింది. అవినీతి   పరులైన రాజకీయ నాయకులు, ఉద్యోగి-అధికారగణం, బడా వ్యాపార సంస్థల మధ్య అపవిత్ర పొత్తును ఛేదించనంతకాలం దేశంలో నల్లధనం వర్ధిల్లుతూనే ఉంటుంది.

కోసుకుపోతున్న అభివృద్ధి రేటు

ఆర్థిక వ్యవస్థలో నల్లధనం పరిమాణం గణనీయంగా ఉంటోంది. 2016-17లో భారత జీడీపీ రూ.152 లక్షల కోట్లు. నల్లధనం పరిమాణం అందులో 62శాతం (సుమారు రూ.93 లక్షల కోట్లు) అని ఆర్థికవేత్త అరుణ్‌ కుమార్‌ అంచనా. ఈ మొత్తం వ్యవసాయం, పరిశ్రమల ద్వారా లభించే ఆదాయంకన్నా కేంద్రం, రాష్ట్రాల మొత్తం వ్యయంకన్నా ఎక్కువే! 1970ల నుంచి నల్లధనం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు ఏటా అయిదు శాతం మేర కోసుకుపోతోందని అరుణ్‌ కుమార్‌ అంచనా. 11,000 డాలర్లుగా ఉండాల్సిన భారతీయుల తలసరి ఆదాయం నల్లధనం కారణంగా 1500 డాలర్ల దగ్గరే ఆగిపోతోందన్నది ఆయన విశ్లేషణ.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రానున్నది.. ఏఐ శకం!

‣ సమాఖ్య విధానమే శ్రీరామరక్ష

‣ వ్యర్థాల నిర్వహణలో సమస్యల మేట

‣ జీవ వైవిధ్యంతోనే సుస్థిర అభివృద్ధి

‣ డిజిటల్‌ సాగుతో లాభాల పంట

‣ జీఎస్టీ ఎగవేతకు కళ్ళెం

‣ ప్రపంచ సవాళ్లకు జీ7 పరిష్కారాలు

Posted Date: 07-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం