• facebook
  • whatsapp
  • telegram

బలపడుతున్న ద్వైపాక్షిక బంధం

వియత్నాం-భారత్‌ కీలక ఒప్పందాలు

 

 

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ క్రమంగా బలం పెంచుకొనే పనిలో పడింది. దక్షిణ చైనా సముద్రంలోని కీలక దేశాలతో దౌత్య, రాజకీయ సంబంధాలు పటిష్ఠపరచుకుంటోంది. దీనిలో భాగంగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇటీవల మూడు రోజులపాటు వియత్నామ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాలు భవిష్యత్తులో ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా పలు కీలక ఒప్పందాలు చేసుకొన్నాయి. ఇండియా-వియత్నాం రక్షణ భాగస్వామ్యంపై సంయుక్త దార్శనిక ప్రకటనను విడుదల చేశాయి. చైనా సాయంతో కంబోడియాలో నౌకాదళ స్థావరం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న సమయంలోనే రాజ్‌నాథ్‌ వియత్నాం పర్యటన సాగడం విశేషం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో డ్రాగన్‌ను కట్టడి చేయడానికి హనోయ్‌-క్వాడ్‌ కూటమితో కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

 

సుదీర్ఘ స్నేహగీతం

భారత్‌, వియత్నామ్‌ల దౌత్య బంధానికి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1972లో ఉత్తర వియత్నామ్‌తో దౌత్య సంబంధాల ఏర్పాటుతో మొదలైన మైత్రి స్థిరంగా బలపడుతూ వస్తోంది. 1990వ దశకంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’కి జీవం పోయడంతో హనోయ్‌తో సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. 2000లో నాటి భారత రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ హనోయ్‌లో పర్యటించి 15 అంశాలతో కూడిన ‘రక్షణ తోడ్పాటు ఒప్పందం’ చేసుకొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో సంయుక్తంగా సముద్ర దొంగల కట్టడికి కృషి చేయడం, వియత్నాం సాయంతో భారత సైన్యం కీకారణ్యాల్లో, గెరిల్లా యుద్ధతంత్రాల్లో శిక్షణ పొందడం, ఆ దేశ నౌకాదళానికి యుద్ధ, గస్తీ నౌకల మరమ్మతులు, ఉన్నతీకరణ, తయారీ వంటి అంశాల్లో సహాయం చేయడం వంటివి ఉన్నాయి. ఆ దేశ వైమానిక సేనలోని మిగ్‌ విమానాల మరమ్మతులకు సహకరించడం, కీలకమైన నిఘా సమాచార మార్పిడి వంటి అంశాలూ అందులో ఉన్నాయి. 2009లో రక్షణ రంగంలో సహకారంపై ఇరుదేశాల పరస్పర అవగాహన ఒప్పందం కీలకమైన మైలురాయి. నాటి నుంచి భారత యుద్ధ నౌకలు తరచూ ఆ దేశ నౌకాశ్రయాలకు వెళ్లి వచ్చాయి. 2016లో వియత్నాం యుద్ధనౌక మనదేశానికి వచ్చింది. మరోపక్క పౌర, రాజకీయ, వాణిజ్య సంబంధాలను కూడా న్యూదిల్లీ-హనోయ్‌లు బలోపేతం చేసుకొంటున్నాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం పెద్దయెత్తున పెరిగింది. ఓఎన్‌జీసీ విదేశ్‌, టాటా, విప్రో వంటి పలు దిగ్గజ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. గత నెల 30వ తేదీన ఇరు దేశాల మధ్య 12వ విడత రాజకీయ సంప్రదింపులు, తొమ్మిదో విడత వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు. ఇండో-పసిఫిక్‌ వ్యూహం బలపడుతున్న వేళ దక్షిణ చైనా సముద్రంలో భారత్‌కు ఓ బలమైన మిత్రుడిగా ఉండదగిన దేశం వియత్నాం. 1979లో డ్రాగన్‌ దూకుడుకు హనోయ్‌ గట్టిగా బదులిచ్చింది. తరవాత ఆ దేశాల మధ్య మొదలైన ద్వీపాల వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. మయన్మార్‌లోని యాంగూన్‌ ఓడరేవుపై పట్టు పెంచుకొని బంగాళాఖాతంలోకి చొచ్చుకు రావాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ డ్రాగన్‌ ఆధిపత్యాన్ని నిలువరించేందుకు  వియత్నాంకు చెందిన కామ్‌ రాన్‌ బే నౌకాశ్రయంలో భారత్‌ నౌకాదళ కదలికలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. రక్షణ మంత్రి తాజా పర్యటనలో కుదుర్చుకొన్న ఒప్పందం ఆ దిశగా బాటలు వేస్తుంది.

 

మరింత మెరుగుపడే అవకాశాలు

ఇరుదేశాలు సిబ్బంది, రవాణా, సదుపాయాల్లో పరస్పరం సహకరించుకొనేలా ఓ అవగాహన ఒప్పందం చేసుకొన్నాయి. భారత్‌ గతంలో ఇటువంటి ఒప్పందాలను అమెరికా, సింగపూర్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతో చేసుకొంది. ఏ దేశంతోనైనా హనోయ్‌ ఇటువంటి ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. ‘ఇరు దేశాల రక్షణ దళాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన సమయం ఇది’ అని పేర్కొన్న సంయుక్త ప్రకటన వాస్తవిక పరిస్థితికి అద్దం పట్టింది. ఈ ఒప్పందంతో భారత నౌకలకు- ఇంధనం, మరమ్మతులు వంటి అవసరాల కోసం వియత్నాం స్థావరాలను వాడుకొనే అవకాశం లభించనుంది. దీనితోపాటు, 2016లో ప్రధాని మోదీ వియత్నాం పర్యటనలో భాగంగా ప్రకటించిన అంశాలకు తుదిరూపు ఇచ్చేందుకు ఏకాభిప్రాయానికి రావడం శుభపరిణామం. రానున్న రోజుల్లో హనోయ్‌కు బ్రహ్మోస్‌ క్షిపణుల విక్రయానికి ఇది మార్గం సుగమం చేయవచ్చు. దీర్ఘకాలంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ప్రభావం పెరగడం వియత్నాం ప్రయోజనాలకు ఉపయుక్తంగానే ఉంటుంది. ఇప్పటికే ‘ఇండో-పసిఫిక్‌ ఆర్థిక చట్రం’లో హనోయ్‌ భాగస్వామి కావడంతో భవిష్యత్తులో న్యూదిల్లీతో సంబంధాలు మరింత మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి. ఇరు దేశాల ప్రధాన ప్రత్యర్థి డ్రాగనే. రక్షణ పరంగా ఉమ్మడి లక్ష్యాలపై సమష్టిగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఒనగూడే అవకాశం ఉంది.

 

- ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రైతు ఆదాయం రెట్టింపయ్యేదెన్నడు?

‣ పర్యావరణ సూచీలో అట్టడుగున భారత్‌

‣ రాజ్యాంగ బద్ధతే ప్రామాణికం

‣ సహ్యాద్రి... జీవవైవిధ్యానికి పెన్నిధి!

‣ సముద్రాలకు ప్లాస్టిక్‌ గండం

‣ అంతరిక్షంలో ఆధిపత్య పోరు

‣ పంటలకు భానుడి సెగ

Posted Date: 17-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం