• facebook
  • whatsapp
  • telegram

ఆసియాన్‌తో వ్యూహాత్మక బంధం

భారత్‌ పెద్దన్న పాత్ర పోషించనుందా?

 

 

అమెరికా, చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తరహా పరిస్థితులు కొనసాగుతున్నవేళ దిల్లీ వేదికగా ఇటీవల జరిగిన ఇండియా-ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల ప్రత్యేక సమావేశం అందరి దృష్టినీ ఆకర్షించింది. భౌగోళిక రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సమన్వయ సహకారాలను మరింతగా పెంపొందించుకోవాలని ఇరుపక్షాలు అందులో తీర్మానించుకున్నాయి. ఉగ్రవాదంపై పోరు, అవినీతి నిరోధకత, విద్య సహా అన్ని రంగాల్లో ఉభయతారక విధానాలతో ముందుకెళ్ళాలని నిశ్చయించుకున్నాయి. వాషింగ్టన్‌, బీజింగ్‌ మధ్య ఆధిపత్య పోరులో తాము సమిధలుగా మారకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. తాజా సదస్సులో సమాలోచనలు జరిగిన తీరుతోపాటు సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ వంటి నేతలు చేసిన పలు వ్యాఖ్యలు ఆసియాన్‌తో ఇండియా బంధం సమీప భవిష్యత్తులో మరింత బలోపేతమవుతుందన్న సంకేతాలిచ్చాయి. ప్రాంతీయంగా దిల్లీ పెద్దన్న పాత్ర పోషించాలన్న ఆసియాన్‌ దేశాల ఆకాంక్షను అవి సుస్పష్టం చేశాయి. భారత్‌, ఆసియాన్‌ మధ్య బంధం కేవలం ఈ 30 ఏళ్ల నాటిదే కాదని, వేల సంవత్సరాలుగా ఆసియాన్‌ దేశాలకు ఇండియాతో సాంస్కృతిక, నాగరిక సంబంధాలు ఉన్నాయని బాలకృష్ణన్‌ తాజా సదస్సులో స్పష్టంచేశారు. హిందూత్వం, బౌద్ధం, ఇస్లాం వంటి మతాలు ఇండియా నుంచే ఆగ్నేయాసియాకు విస్తరించాయని వ్యాఖ్యానించారు.

 

అనుమానాలు పటాపంచలు

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సీఈపీ)ను చైనా నేతృత్వంలోని ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌గా విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియాన్‌ మాత్రం అది తమ ఆధ్వర్యంలోని యంత్రాంగమని భావిస్తోంది. ఆర్‌సీఈపీ నుంచి ఇండియా 2019లో తప్పుకోవడం ఆసియాన్‌ దేశాలకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. మరోవైపు- క్వాడ్‌లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దిల్లీ- వాణిజ్యం, సరఫరా గొలుసులు, శుద్ధ ఇంధనం, అవినీతి నిరోధకత వంటివి మూలస్తంభాలుగా ఇటీవల అమెరికా నేతృత్వంలో కొత్తగా అవతరించిన ఇండో పసిఫిక్‌ ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌ (ఐపీఈఎఫ్‌)లో చేరింది. ఆసియాన్‌తో బంధానికి ఇండియా ప్రాధాన్యం తగ్గించిందన్న అనుమానాలు తలెత్తడానికి ఈ పరిణామాలన్నీ దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజా దిల్లీ సదస్సు- ఆసియాన్‌ దేశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడంలో, వాటితో ఆర్థిక వాణిజ్య సంబంధాలు నెరపడంలో భారత్‌ వైఖరిలో మార్పేమీ ఉండబోదని చాటిచెప్పింది.

 

సంయుక్త జీడీపీని భారీగా పెంచుకునేందుకు చేతులు కలపాలని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరపరచుకోవాలని సదస్సులో ఉభయపక్షాలు నిర్ణయించుకున్నాయి. వ్యాపారం, డిజిటల్‌, హరిత ఇంధనం, కమ్యూనికేషన్‌ అనుసంధానం, విద్య, రక్షణ, టీకాల ఉత్పత్తి తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని తీర్మానించుకున్నాయి. ఉగ్రవాదం, మతపరమైన తీవ్రవాదం నిరోధానికి ఐక్యంగా కృషి చేయాలని సంకల్పించాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సమన్వయ సహకారాల పెంపునకు నూతన విధానాలను రూపొందించుకోవాలని అంగీకరించాయి. అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరుతో తమకు పొంచి ఉన్న నష్టాలపై సమావేశంలో చర్చించాయి. ఇలాంటి పరిణామాలకు అడ్డుకట్ట పడకపోతే ఆసియాన్‌ దేశాల అభివృద్ధికి దశాబ్దాలుగా ఆధారభూతాలుగా నిలుస్తున్న శాంతి, సుస్థిరతలకు విఘాతం కలుగుతుందంటూ బాలకృష్ణన్‌ చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. మయన్మార్‌లో సైన్యం పాలన పగ్గాలు చేపట్టడంతో ఆ దేశానికి సమావేశంలో అవకాశం దక్కలేదు.

 

డ్రాగన్‌పై ఆధారపడటం తగ్గించాలి

‘తూర్పు దిశగా కార్యాచరణ’ విధానంలో భాగంగా ఆసియాన్‌కు ఇండియా పెద్దపీట వేస్తున్నా, ఈ విషయంలో చైనా మరింత ముందుంది. 2003లో ఆసియాన్‌తో బీజింగ్‌ సహకార ఒడంబడికను కుదుర్చుకున్నప్పటి నుంచి సంబంధాలు బలోపేతమయ్యాయి. చైనా, ఆసియాన్‌ వార్షిక వాణిజ్య బంధం విలువ దాదాపు 50వేల కోట్ల డాలర్లు. ఆసియాన్‌లోని దేశాల మొత్తం వాణిజ్య కార్యకలాపాల్లో అయిదింట ఒక వంతు డ్రాగన్‌తోనే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే దక్షిణ చైనా సముద్రం విషయంలో డ్రాగన్‌తో ఆసియాన్‌ దేశాలకు ప్రాదేశిక వివాదాలున్నాయి. దిల్లీ సదస్సులో దక్షిణ చైనా సముద్రం సంబంధిత అంశాలపైనా చర్చ జరిగింది. మరోవైపు- కొవిడ్‌ కారణంగా థాయ్‌లాండ్‌, కంబోడియా, ఫిలిప్పీన్స్‌ వంటి ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు గత రెండున్నరేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా పర్యాటకులపై అతిగా ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికీ చైనాలో లాక్‌డౌన్‌లు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత పర్యాటకులే ఆగ్నేయాసియా దేశాలకు వరంగా మారుతున్నారు. ఇవన్నీ ఆసియాన్‌తో బంధాన్ని మరింత పదిలం చేసుకోవడంలో ఇండియాకు కలిసివచ్చే అంశాలు. ఆర్థికంగా ఇప్పటికిప్పుడు చైనాకు దీటుగా లేకపోయినా... ప్రజాస్వామ్య విలువలు పాటించే తమలాంటి దేశంతో సంబంధాలు దీర్ఘకాలంలో శ్రేయోదాయకమని ఆగ్నేయాసియా దేశాలు గుర్తెరిగేలా చేయాలి. వాటి ఆర్థిక, భద్రతాపరమైన అవసరాలను తీర్చగల సత్తా భారత్‌కు ఉందన్న భరోసా కల్పించాలి. జిబౌటిలో చైనా ఇప్పటికే సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కంబోడియాలోనూ స్థావరాన్ని నిర్మించుకుంటోంది. దక్షిణ చైనా సముద్ర దీవుల్లో బలగాలను మోహరిస్తోంది. ఈ పరిణామాలపై ఇండియా అప్రమత్తంకావాలి. ఆసియాన్‌ దేశాలతో సైనిక సంబంధాల్ని మెరుగుపరచుకోవాలి. ఇండియాను ఆసియాన్‌కు ‘వ్యూహాత్మక భాగస్వామి’ నుంచి ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ స్థాయికి ఉన్నతీకరించాలన్న ప్రతిపాదనను కొన్ని సభ్యదేశాలు ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నాయి. వాటి వైఖరి మారేలా భారత్‌ చర్యలు తీసుకోవాలి. ప్రాంతీయంగా పెద్దన్న పాత్ర పోషించాలి. వాణిజ్యం కోసం ఆసియాన్‌ దేశాలు డ్రాగన్‌పై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు కృషి చేయాలి. అమెరికా-చైనా మధ్య ఆధిపత్య పోరులో ఆసియాన్‌ ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిరక్షించాలి. తద్వారా ప్రాంతీయంగా మరింత అగ్రశక్తిగా ఎదగాలి.

 

పురోగమన బాటలో...

ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్‌)లో బ్రునై, కంబోడియా, ఇండొనేసియా, లావోస్‌, మలేసియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం సభ్యదేశాలు.

భారత జనసంఖ్యలో ఆసియాన్‌ జనాభా దాదాపు సగం. కానీ ఆసియాన్‌ దేశాల సంయుక్త జీడీపీ ఇంచుమించు ఇండియా జీడీపీకి సమానం. భారత ఎగుమతుల్లో 11శాతానికి పైగా వాటా ఆసియాన్‌ దేశాలదే.

భారత్‌ ఆసియాన్‌ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రవాణా వంటి రంగాల్లో సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఆసియాన్‌తో ప్రాంతీయ భాగస్వామిగా మొదలైన భారత బంధం 2002లో శిఖరాగ్ర స్థాయికి ఎదిగింది. ఆసియాన్‌కు ఇండియా 2012లో వ్యూహాత్మక భాగస్వామిగా అవతరించింది.

 

- మండ నవీన్‌కుమార్‌గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?

‣ కంప్యూటర్‌ సైన్స్‌కే జై!

‣ కోల్‌ ఇండియాలో కొలువులు

‣ సుప్రీంకోర్టులో జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

Posted Date: 24-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం