• facebook
  • whatsapp
  • telegram

నేపాల్‌ చెలిమితో డ్రాగన్‌కు ముకుతాడు

నేపాల్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేవ్‌బా నేతృత్వంలోని పాలక కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. దిల్లీ అనుకూలవాదిగా పేరున్న దేవ్‌బా ప్రధానిగా కొనసాగనున్నారు. ప్రాంతీయంగా చైనా ప్రాబల్యానికి ముకుతాడు వేయాలని భావిస్తున్న ఇండియా, అమెరికాలకు ఇది కలిసివచ్చే పరిణామమే!

హిమాలయ దేశం నేపాల్‌లో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తాజా సార్వత్రిక ఎన్నికలతో తెరపడింది. ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో వెల్లడి కాకున్నా, తాజా ఎన్నికల్లో ప్రధాని దేవ్‌బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ నాయకత్వంలోని సీపీఎన్‌-మావోయిస్టు సెంటర్‌ సహా మరో మూడు పార్టీలతో కలిసి దేవ్‌బా ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించనున్నారు. మరోసారి పాలనా పగ్గాలను చేపట్టాలన్న మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి (సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ) ఆశలపై ఈ ఎన్నికలు నీళ్లు చల్లాయి. నేపాల్‌తో శతాబ్దాలుగా ఉన్న సన్నిహిత సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక బంధాలను ఇండియా మరింత పరిపుష్టంగా మార్చుకునేందుకు ఇది సరైన తరుణంగా భావించవచ్చు.

వివాదాల ఓలి

భూపరివేష్ఠిత దేశమైన నేపాల్‌తో ఇండియా దాదాపు 1,850 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. అక్కడ పోలీసుల పహరా అంతంత మాత్రమే. రెండు వైపులా సరకు రవాణా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇరు దేశాల మధ్య మానవ ప్రయాణాలకు పాస్‌పోర్టు, నివాస ధ్రువీకరణ అవసరం లేదు. భారతీయులు నేపాలీలను, ఆ దేశస్థులు మనవాళ్లను వివాహం చేసుకోవడం సర్వసాధారణం. అందుకే ఇరు దేశాల బంధాన్ని రోటీ-బేటీ సంబంధంగా అభివర్ణిస్తుంటారు. పైగా భారత సైన్యం నేపాలీ పౌరులను గోర్ఖా రెజిమెంట్లలో సైనికులుగా నియమించుకుంటుంది. వాణిజ్య కార్యకలాపాల కోసం చాలా ఏళ్లపాటు భారత్‌పైనే కాఠ్‌మాండూ ఆధారపడింది. ‘పొరుగుకు తొలి ప్రాధాన్యం’ పేరుతో దిల్లీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంలోనూ వ్యూహాత్మకంగా నేపాల్‌ చాలా ముఖ్యమైన దేశం. అందుకు తగ్గట్టే ఇరుదేశాల మధ్య దీర్ఘకాలికంగా సత్సంబంధాలున్నాయి. అయితే, ఓలి 2015లో ప్రధాని పీఠాన్ని దక్కించుకున్న తరవాత బీజింగ్‌తో సన్నిహితంగా మెలగుతూ దిల్లీని దూరం పెట్టారు. 2017 ఎన్నికల్లో చైనా అండతో భారత్‌ వ్యతిరేక ప్రచారంతోనే ఆయన ఎన్నికల్లో గెలిచారు. రాజ్యాంగంలో సమాన హక్కులు కోరుతూ మాధేశీలు పెద్దయెత్తున చేపట్టిన ఆందోళనలకు దిల్లీ మద్దతిచ్చిందని, తమ దేశ అంతర్గత రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుంటోందని అప్పట్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఆపై భారత్‌తో సరిహద్దు వివాదాలు నెలకొన్న కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాధురా భూభాగాలను తమ దేశ పటంలో చేర్చేందుకు పార్లమెంటు అంగీకారం తెలిపేలా ఒత్తిడి చేశారు. కొవిడ్‌ విషయంలోనూ ఇండియాపై ఓలి అనుచిత ఆరోపణలు చేశారు. కరోనాను భారతీయ వైరస్‌గా వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాఠ్‌మాండూతో బీజింగ్‌ స్నేహం బాగా పెరిగింది. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ)లో కాఠ్‌మాండూ అయిదేళ్ల కిందట చేరింది. ఆ తరవాత పలు ప్రాజెక్టుల రూపంలో నేపాల్‌లో బీజింగ్‌ భారీగా నిధులు గుమ్మరించడం ప్రారంభించింది. ఈ పరిణామాలతో ఇండియా-నేపాల్‌ సంబంధాలు సందిగ్ధంలో పడ్డాయి.

నిరుడు మే నెలలో ఓలి ప్రతినిధుల సభ విశ్వాసాన్ని కోల్పోవడంతో దేవ్‌బా నేపాల్‌ ప్రధానిగా అయిదోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో దిల్లీ-కాఠ్‌మాండూ సంబంధాలు కాస్త గాడినపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన మన దేశంలో పర్యటించారు. ఆ తరవాతి నెలలోనే ప్రధాని మోదీ నేపాల్‌ పర్యటనకు వెళ్ళారు. ఆ సమయంలో సాంస్కృతిక, విద్యారంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు ఆరు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరోవైపు- అమెరికా ప్రతిపాదించిన ‘మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌ (ఎంసీసీ)’ ద్వారా నేపాల్‌ 50 కోట్ల డాలర్ల అభివృద్ధి గ్రాంటును పొందేందుకు వీలున్నా, ఓలి ప్రధానిగా ఉన్నన్నాళ్లూ దాన్ని స్వీకరించేందుకు ముందుకు రాలేదు. ఆ గ్రాంటును పొందేందుకు దేవ్‌బా పార్లమెంటుతో ఆమోదముద్ర వేయించారు.

భద్రతకు ముప్పు

టిబెట్‌తో నేపాల్‌ సరిహద్దును పంచుకుంటున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా బీజింగ్‌కు కాఠ్‌మాండూ చాలా కీలకం. నేపాల్‌లో డ్రాగన్‌ ప్రాబల్యం పెరిగితే భారత్‌కు భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయి. నేపాల్‌ సరిహద్దుల్లో భద్రతాబలగాలు అధికంగా లేకపోవడాన్ని ఈశాన్య భారత్‌లోని తిరుగుబాటు దళాలు తమకు అనుకూలంగా మలచుకొనే ముప్పు ఉంది. ఇండియాలోకి నకిలీ కరెన్సీతోపాటు ముష్కర మూకలను పంపించేందుకు వాటికి అవకాశం లభిస్తుంది. ఈ తరుణంలో కాఠ్‌మాండూ సహకారం ఇండియాకు అవసరం. మోదీ సర్కారు దేవ్‌బా నేతృత్వంలోని నూతన ప్రభుత్వంతో సన్నిహితంగా మెలగాలి. గతంలో నిర్దేశించుకున్న తరహాలో జలవిద్యుత్‌, రవాణా, మౌలిక వసతులు తదితర రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్ళాలి. నేపాల్‌ అభివృద్ధికి చేయూతనందిస్తూ, డ్రాగన్‌ విస్తరణ వాదానికి అడ్డుకట్ట వేయాలి.

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అటవీ నేరాలకేదీ అడ్డుకట్ట?

‣ ఈశాన్యంలో సరిహద్దుల నెగళ్లు

‣ వర్ధమాన వాణి... విశ్వశ్రేయ శ్రేణి!

‣ ఉద్గారాల పేరిట సేద్యంపై దాడి!

‣ సమాచార బిల్లు సమగ్రమేనా?

‣ ఇస్రో గఘన యాత్ర

‣ రాజకీయ చట్రంలో రాజ్యాంగ సంస్థలు

Posted Date: 03-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం