• facebook
  • whatsapp
  • telegram

నాయకత్వానికి కొవిడ్‌ సెగ

మలేసియాలో రాజకీయ అస్థిరత

ఆగ్నేయ ఆసియాలోని మలేసియా రాజకీయ అస్థిరత దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి కరోనా వైరస్‌ వ్యాప్తి ఆజ్యం పోస్తోంది. జాతీయ కూటమి తరఫున ముహిద్దీన్‌ యాసిన్‌ 2020 మార్చిలో మలేసియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు యునైటెడ్‌ మలయాస్‌ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ (యూఎంఎన్‌ఓ) మద్దతు ప్రకటించింది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ ప్రభుత్వం తుమ్మితే ఊడే ముక్కులాగే ఉంది. పదవిని కాపాడుకోవడానికి ఏకంగా 70 మందికి కేబినెట్‌లో స్థానం కల్పించి ముహుద్దీన్‌ విమర్శల పాలయ్యారు. కేవలం రెండు ఓట్ల ఆధిక్యంతో బడ్జెట్‌ను ఆమోదించుకోగలిగారు. యూఎంఎన్‌ఓ నేతల అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చి ముహిద్దీన్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గతేడాది సెప్టెంబర్‌ నుంచి పలుమార్లు మద్దుతు ఉపసంహరిస్తున్నట్లు యూఎంఎన్‌ఓ బెదిరింపులకు దిగింది. జులైలో మద్దతును ఉపసంహరించుకొంది. దీంతో మలేసియా రాజు సుల్తాన్‌ అబ్దుల్లా ఉప ప్రధాని ఇస్మాయిల్‌సబ్రీ యాకూబ్‌కు దేశ పాలనా పగ్గాలు అప్పగించారు. దేశ పరిస్థితులను చూస్తుంటే యాకూబ్‌ పాలన ఎన్నాళ్లు సజావుగా సాగుతుందో ఎవరూ చెప్పగల పరిస్థితి లేదు. 

మలేసియాలో కొవిడ్‌ వ్యాప్తిలో ముహిద్దీన్‌ ప్రభుత్వ పాత్ర చాలా ఉంది. అధికారం చేపట్టాక కఠిన లాక్‌డౌన్‌తో 2020 జులై నాటికి కేసుల సంఖ్యను సున్నాకు చేర్చారు. స్వపక్ష నాయకులే సాబాహ్‌ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఉద్యమానికి దిగారు. ఫలితంగా వైరస్‌ మరోసారి దేశవ్యాప్తంగా పాకింది. దీంతో ముహిద్దీన్‌ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో కఠిన లాక్‌డౌన్‌ విధించింది. అయినా కేసుల సంఖ్య తగ్గకపోగా, విపరీతంగా పెరిగింది. నెలల తరబడి వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాలు మూతపడటంతో విసిగిపోయిన ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలకు దిగారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గిన ముహిద్దీన్‌ తన ప్రభుత్వం మద్దతు కోల్పోయిందని ప్రకటించారు. అప్పటికే దేశంలో పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకొంది. దాదాపు 52శాతానికి పైగా ప్రజలు రెండు డోసుల టీకాలు పూర్తి చేసుకొన్నా, మలేసియాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 20 రోజులుగా అక్కడ రోజువారీగా 20వేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. 3.27 కోట్ల జనాభా ఉన్న మలేసియాలో ఇప్పటిదాకా 16 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడగా, 22వేల మందికి పైగా కన్నుమూశారు.

ముహిద్దీన్‌ యాసిన్‌కు ఎదురైన సవాళ్లనే ఇస్మాయిల్‌ సైతం ఎదుర్కోనున్నారు. 114 మంది సభ్యుల మద్దతుతో స్వల్ప మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన ఆయన మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం పెనుసవాలే. 2018 ఎన్నికల్లో దేశంలో సగం మందికి పైగా వ్యతిరేకించిన యూఎంఎన్‌ఓతో కలిసి పనిచేయడాన్ని మిగిలిన పార్టీలు ఇబ్బందికరంగా భావించే ప్రమాదం ఉంది. దీంతో ఇస్మాయిల్‌- పార్టీలకు అతీతంగా కరోనాపై పోరులో నాయకులు ఏకతాటిపైకి రావాలని పిలుపిచ్చారు. రాజకీయ సుస్థిరత కోసం ఇస్మాయిల్‌ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఆయన ముహిద్దీన్‌ యాసిన్‌ హయాంలోని పలువురు మంత్రులను తన కేబినెట్‌లో కొనసాగిస్తున్నారు. గత కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్న జాఫ్రుల్‌ అజీజ్‌ను కదిలించలేదు. గతంలో శాస్త్రసాంకేతిక మంత్రిగా వ్యవహరిస్తూనే టీకాల కార్యక్రమాన్ని చూసిన ఖైరీ జమాలుద్దీన్‌కు ఆరోగ్య శాఖ పగ్గాలను అప్పజెప్పారు. అదే సమయంలో గత ఆరోగ్యశాఖ మంత్రి అధమ్‌ బాబాకు ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక శాఖను కేటాయించారు. ఈ మంత్రివర్గం కొత్త సీసాలో పాత నీరు పోసినట్లుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2019లో అప్పటి మలేసియా ప్రధాని మహతీర్‌ మహమ్మద్‌ ఇండియాకు సంబంధించి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), కశ్మీర్‌ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తరవాత కొన్ని నెలల్లోనే ఆయన పదవిని కోల్పోయారు. ముహిద్దీన్‌ యాసిన్‌ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసి కొంత విజయవంతమయ్యారు. తాజాగా మలేసియా వాయుసేన మన తేజస్‌ యుద్ధ విమానంపై ఆసక్తి చూపుతోంది. కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన ఇస్మాయిల్‌ భారత్‌ విషయంలో ఎటువంటి వైఖరి అనుసరిస్తారో వేచి చూడాల్సిందే.

- పి.కిరణ్‌
 

Posted Date: 31-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం