• facebook
  • whatsapp
  • telegram

విచ్చలవిడిగా ఆయుధ సరఫరా

విశ్వశాంతికి పెనుముప్పు

ప్రపంచవ్యాప్తంగా ఏటా 1,200 కోట్ల తుపాకీ గుళ్లు ఉత్పత్తి అవుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ నిగ్గు తేల్చింది. ఈ మందుగుండు సామగ్రి మొత్తం ప్రపంచ జనాభాను రెండుసార్లు కడతేర్చడానికి సరిపోతుంది. ఐక్యరాజ్య సమితి ఏటా సెప్టెంబరు 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు అడ్డూ అదుపూ లేని ఆయుధ ఉత్పత్తి, పెచ్చరిల్లుతున్న భౌగోళిక ఆయుధ వాణిజ్యాల కారణంగా ప్రపంచశాంతి నేడు దట్టంగా పరచుకున్న తుపాకీ నీడలో బితుకుబితుకుమంటోంది. రెండోప్రపంచ యుద్ధానంతరం దాదాపు   నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రపంచ శాంతికి పెను సవాలుగా నిలిచిన అంశం- అగ్రరాజ్యాల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం. 1946లో మొదలైన ప్రచ్ఛన్నయుద్ధం 1990వ దశకంలో సోవియట్‌ యూనియన్‌ అంతర్ధానమయ్యే దాకా కొనసాగి- విశ్వవ్యాప్తంగా ఆయుధ పోటీకి, తద్వారా అంతులేని అశాంతికి కారణమైంది.

అమెరికాదే ప్రధాన పాత్ర

ప్రచ్ఛన్న యుద్ధం ముగియడం ప్రపంచశాంతికి దోహదం చేస్తుందన్న ఆశల్ని వమ్ము చేస్తూ నాటి అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు నేడు ఆయుధ విక్రేతలుగా కొత్త అవతారమెత్తి లాభాలు దండుకుంటున్నాయి. ఈ రెండు దేశాలూ సగానికి పైగా ప్రపంచ ఆయుధ ఎగుమతులకు బాధ్యత వహిస్తున్నట్లు స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) పేర్కొంటోంది. మొత్తం 65 దేశాలు ఆయుధాలు ఎగుమతి చేస్తున్నాయని సిప్రి గుర్తించింది. ప్రపంచ ఎగుమతుల్లో 37శాతం వాటాతో అమెరికా అగ్రభాగాన నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యున్నత ఆయుధ కంపెనీల్లో 38 అమెరికాలోనే ఉన్నాయి. దాదాపు 20శాతం ఆయుధ ఎగుమతుల వాటాతో రష్యా రెండో స్థానంలో ఉంది. ఫ్రాన్స్‌, జర్మనీ, చైనాలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన ఇరవై రక్షణ సంస్థల్లో పదకొండు అమెరికాకు చెందినవే. అగ్రరాజ్యానికి చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ, బోయింగ్‌, రేతియాన్‌, నార్త్‌రాప్‌ గ్రమన్‌ కార్పొరేషన్‌, జనరల్‌ డైనమిక్స్‌ కార్పొరేషన్‌, యునైటెడ్‌ టెక్నాలజీస్‌ తదితర సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాల ద్వారా ప్రపంచంలోనే ఉన్నతశ్రేణి ఆదాయ సంస్థలుగా అవతరించాయి. అఫ్గాన్‌ యుద్ధ కాలంలో అమెరికా ఆయుధ కంపెనీలు విపరీతంగా లాభాలు ఆర్జించాయి. 2001లో అమెరికా అఫ్గానిస్థాన్‌పై దాడి చేసేనాటికి కొన్ని అమెరికన్‌ రక్షణ ఉత్పత్తుల కంపెనీల్లో 10 వేల డాలర్లు మదుపు చేసి ఉంటే ఆ మొత్తం ఈ నాటికి లక్ష డాలర్లయ్యేదని ఒక అంతర్జాతీయ పత్రిక విశ్లేషించింది.

భారీ మారణాయుధాల వాణిజ్యం ఒక ఎత్తు, గుట్టుగా సాగే సంప్రదాయ ఆయుధాల అక్రమ వ్యాపారం మరో ఎత్తు. అక్రమాయుధ బేహారులతో చేతులు కలిపిన దేశాలుగా అమెరికా, రష్యా, చైనాలు అపకీర్తిని మూటగట్టుకున్నాయి. ఇరాన్‌, సౌదీ అరేబియా వంటి దేశాలు వివిధ దేశాల్లో తామెంచుకున్న సాయుధ ఉగ్ర మూకలకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని ఆరోపణలున్నాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌, మెక్సికో, చిలీ తదితర ల్యాటిన్‌ అమెరికా దేశాల్లో చిన్న ఆయుధాల ఉత్పత్తిదారులు సాయుధ నేరగాళ్ల సాయంతో తమ వ్యాపారాన్ని విశృంఖలంగా సాగిస్తున్నారు. తూర్పు ఐరోపా దేశాలు సోవియట్‌ కాలంనాటి మారణాయుధాల విక్రయస్థలాలుగా ప్రసిద్ధమయ్యాయి.

జోరుగా నిధుల కేటాయింపులు

శాంతి కావాలంటే యుద్ధం చేయాల్సిందేనన్న అభిప్రాయం బలపడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో- ఆయుధ సమీకరణ వినా భద్రతకు మార్గాంతరం లేదన్న భావనా ప్రబలింది. ఫలితంగా ప్రభుత్వాలు ఆయుధ కొనుగోళ్లకు కేటాయించాల్సిన మొత్తం క్రమంగా పెరిగిపోతోంది. అభివృద్ధి, పేదరిక నిర్మూలన కుంటువడుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి, సోవియట్‌ రష్యా నాయకత్వంలోని వార్సా కూటమి పోటాపోటీగా తమ రక్షణ వ్యయాల్ని పెంచుకున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం అంతం కావడంతో అనేక దేశాల రక్షణ వ్యయం తగ్గుముఖం పట్టింది. కానీ, ఆ సంబరం ఎంతోకాలం సాగలేదు. 2001 సెప్టెంబరు 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన తీవ్రవాద దాడి ప్రపంచ ఆయుధపోటీకి మరోసారి రెక్కలు తొడిగింది. ఆయుధ వ్యాపారానికి సంబంధించిన ఏటీటీ (ఆర్మ్స్‌ ట్రేడ్‌ ట్రీటీ) 2013 నాటికి అమలులోకి వచ్చింది. ఐరాస సర్వసభ్య సమావేశం 2013 ఏప్రిల్‌లో ఏటీటీకి ఆమోదం తెలిపింది. ప్రపంచ దేశాలు పరస్పర సహకారంతో ఆయుధ నియంత్రణకు పాటుపడాలని ఈ ఒడంబడిక సారాంశం. అయితే అతిపెద్ద ఆయుధ విక్రేతలైన అమెరికా, రష్యా వంటి దేశాలు ఈ ఒడంబడికపై సంతకాలు చేయకుండా తమ ఆయుధ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నాయన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఫలితంగా నవ్య యుద్ధరీతుల్లో వాడే గైడెడ్‌ బాంబులు, మోర్టార్లు, క్షిపణులు వగైరా ఆధునిక ఆయుధాలు సంఘర్షణతో ఏమాత్రం సంబంధంలేని సామాజిక ఆస్తులైన ఆస్పత్రుల్ని, మార్కెట్‌ స్థలాలను, సామాన్యుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. బాధ్యతారహితంగా సాగుతున్న అంతర్జాతీయ ఆయుధ వ్యాపారాలు వర్ధమాన ప్రపంచంలో నిర్భాగ్యుల బతుకులను  బుగ్గిపాలు చేస్తున్నాయి.

అగ్రరాజ్యం నుంచి కశ్మీర్‌కు...

స్వతహాగా ఆర్థికంగా, సాంకేతికంగా వెనకబడి విఫలరాజ్యంగా పేరుమోసిన పాకిస్థాన్‌- కశ్మీర్‌ తీవ్రవాదులకు ఆయుధాలెలా సరఫరా చేయగలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం సైతం అలనాటి అగ్రరాజ్యాలైన సోవియట్‌ యూనియన్‌, అమెరికాల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధ ఘటనా క్రమంలో దాగిఉంది. 1978 ఏప్రిల్‌లో నూర్‌ ముహమ్మద్‌ తారకి నాయకత్వంలో కమ్యూనిస్టులు అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకొని సమూల రాజకీయ, సాంస్కృతిక ప్రక్షాళనకు తెరతీశారు. ఆ చర్యలు ముజాహిదీన్ల తిరుగుబాటుకు బాటలు పరచాయి. తదనంతర పరిణామాల్లో సోవియట్‌ సేనలు 1979లో అఫ్గానిస్థాన్‌లోకి చొచ్చుకువచ్చి తమకు అనుకూలుడైన బబ్రక్‌ కర్మల్‌ను అధ్యక్షుడిగా నియమించాయి. అందుకు స్పందనగా అమెరికా ‘ఆపరేషన్‌ సైక్లోన్‌’ పేరుతో ముజాహిదీన్లకు ఆయుధాలు సరఫరా చేయడం ప్రారంభించింది. సరఫరా అయ్యే ఆయుధాల పరిమాణం 1983లో 10 వేల టన్నుల స్థాయి నుంచి 1987 నాటికి 65 వేల టన్నులకు చేరింది. బ్రిటన్‌లో రూపొందిన ఆధునిక లీ ఎన్‌ఫీల్డ్‌ రైఫిళ్లతో పాటు, కలష్నికొవ్‌ తుపాకులు, ఎఫ్‌ఐఎం స్ట్రింగర్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణులవంటి ఆయుధాలూ ముజాహిదీన్లకు అందాయి. ఆయుధ సరఫరా 1992 వరకు కొనసాగింది. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ- ఆయుధాలను పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చేరవేసి చేతులు దులుపుకొనేది. ఐఎస్‌ఐ ఈ అయుధాల్లో కొంతభాగం బహిరంగ ఆయుధ విపణిలో అమ్ముకోవడంతోపాటు కశ్మీర్‌లో, పంజాబ్‌లో తాను పెంచి పోషించిన తీవ్రవాదులకూ అందించేదని అమెరికా మానవహక్కుల సంస్థ ‘హ్యూమన్‌రైట్స్‌ వాచ్‌ ఆర్మ్స్‌ ప్రాజెక్ట్‌’ తన   నివేదికలో పేర్కొంది.

- ఎన్‌.ఎమ్‌.ముకరమ్‌
 

Posted Date: 22-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం