• facebook
  • whatsapp
  • telegram

ఆస్ట్రేలియా గణతంత్ర మార్గం

రాచరికానికి త్వరలోనే వీడ్కోలు!

వరసగా తొమ్మిదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్‌ సంకీర్ణాన్ని ఓడించి ఇటీవలే ఆస్ట్రేలియా ప్రధాని పీఠాన్ని లేబర్‌ పార్టీ నేత ఆంటొనీ ఆల్బనీస్‌ అధిరోహించారు. తమ దేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చే దిశగా ఆయన కీలక ముందడుగు వేశారు. తన కేబినెట్‌లో ప్రత్యేకంగా గణతంత్ర సహాయ మంత్రిని నియమించారు. ఆస్ట్రేలియా స్వతంత్ర దేశమే అయినా ఇప్పటికీ ఆ దేశాధినేత (హెడ్‌ ఆఫ్‌ ది స్టేట్‌)గా బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కొనసాగుతున్నారు. ఆమెను ఆ పదవి నుంచి తొలగించి, కంగారూల దేశాన్ని పూర్తిస్థాయిలో గణతంత్ర రాజ్యంగా అవతరింపజేయాలన్న డిమాండ్లు కొంతకాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ‘క్వాడ్‌’లో కీలక సభ్య దేశమైన ఆస్ట్రేలియాలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ప్రస్తుతం 54 కామన్‌వెల్త్‌ దేశాలున్నాయి. అవన్నీ ఒకప్పుడు బ్రిటిష్‌ పాలనలో ఉన్నవే. ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు ఈ దేశాల్లోనే నివసిస్తోంది. వాటిలో భారత్‌ సహా అనేక దేశాలు ఏళ్ల క్రితమే పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. మరికొన్ని మాత్రం స్వాతంత్య్రాన్ని సాధించుకున్నా, బ్రిటిష్‌ రాచరికం నుంచి పూర్తిగా బయటపడలేదు. ఆస్ట్రేలియాతోపాటు న్యూజిలాండ్‌, కెనడా, జమైకా వంటి 14 దేశాలకు ఇప్పటికీ క్వీన్‌ ఎలిజబెత్‌-2 దేశాధినేతగా కొనసాగుతున్నారు. కరీబియన్‌ దేశమైన బార్బడోస్‌ గతేడాది బ్రిటిష్‌ రాజరికంతో సంబంధాలను తెంచుకొంది. బహమాస్‌, జమైకా, గ్రెనడా, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా వంటి మరో ఆరు కరీబియన్‌ దేశాలూ దేశాధినేత పీఠం నుంచి ఎలిజబెత్‌-2ను తప్పించేందుకు యోచిస్తున్నట్లు కథనాలు వినిస్తున్నాయి.

ఆస్ట్రేలియాను గణతంత్ర దేశంగా మార్చేందుకు 1993, 1999లలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. రెండుసార్లూ అధికశాతం ప్రజలు బ్రిటన్‌ రాజ కుటుంబ అధికారానికే మొగ్గు చూపారు. దానివల్ల అప్పట్లో మూలన పడిన గణతంత్ర రాజ్య డిమాండు కొన్నాళ్లుగా ఊపందుకొంది. ఎన్నికల ప్రధానాంశాల్లో ఒకటిగా అది నిలుస్తూ వస్తోంది. ఇటీవలి ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో ఎలిజబెత్‌-2 తరవాత ఛార్లెస్‌ రాకుమారుడు తమ రాజు కావడానికి 53శాతం ఆస్ట్రేలియన్లు మద్దతు పలకలేదు. వాస్తవానికి ఆల్బనీస్‌ కంటే ముందు పలువురు లేబర్‌ పార్టీ నేతలు ఆస్ట్రేలియాను గణతంత్ర దేశంగా మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వారి స్థాయిలో ఆల్బనీస్‌ ఇటీవలి ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. అయినా సహాయమంత్రి నియామకంతో తన ఉద్దేశాన్ని ఆయన స్పష్టంగా చెప్పినట్లయింది.

స్వదేశీయుడే దేశాధినేతగా ఉండాలన్నది ఆస్ట్రేలియాలో గణతంత్ర దేశ మద్దతుదారుల ప్రధాన ఆకాంక్ష. అందుకే రాణిని దేశాధినేత పదవినుంచి తప్పించాలని డిమాండు చేస్తున్నారు. అప్పుడే పూర్తిస్థాయి సార్వభౌమత్వం దక్కుతుందని వారు వాదిస్తున్నారు. వాస్తవానికి దేశాధినేత స్థానంలో ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా రోజువారీ కార్యకలాపాల్లో బ్రిటన్‌ రాణి జోక్యం చేసుకోరు. ప్రధానమంత్రి సలహా మేరకు తన ప్రతినిధిగా దేశానికి గవర్నర్‌ జనరల్‌ను ఆమె నియమిస్తారు. దశాబ్దాలుగా గవర్నర్‌ జనరల్‌ పదవిలో ఆస్ట్రేలియా వ్యక్తులే కొనసాగుతున్నారు. అందువల్ల గవర్నర్‌ జనరల్‌ నియామకంతో ఆస్ట్రేలియాకు సార్వభౌమత్వం తిరిగి వస్తున్నట్లేనని మరికొందరు చెబుతున్నారు. అయితే అవసరమైన సందర్భాల్లో దేశ వ్యవహారాలను రాణికి గవర్నర్‌ జనరల్‌ నివేదించాల్సి ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆస్ట్రేలియన్ల కోసమే ఆలోచించే వ్యక్తి దేశాధినేతగా ఉండాలని పట్టుపడుతున్నారు. దేశాధినేత ఎన్నిక విధానంపై అభిప్రాయ భేదాలు ఉండటంవల్లనే 1999 నాటి ప్రజాభిప్రాయ సేకరణలో అధిక శాతం ప్రజలు బ్రిటన్‌ రాచరికానికే మొగ్గుచూపారని విశ్లేషకులు చెబుతుంటారు. దేశాధినేత పీఠం ఫెడరల్‌ పార్లమెంటు ఎంపికచేసే వ్యక్తికి దక్కాలని కొందరు, ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని మరికొందరు అప్పట్లో వాదించుకోవడం కొంత గందరగోళాన్ని సృష్టించింది. నాటి వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకొని, గణతంత్రంగా ఆస్ట్రేలియా అవతరణను పర్యవేక్షించేందుకే ప్రత్యేక సహాయమంత్రిని ఆల్బనీస్‌ నియమించారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటిష్‌ రాచరికం మూలాలను కాన్‌బెర్రా పూర్తిగా వదిలించుకోవడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. తండ్రి కింగ్‌ జార్జ్‌-6 మరణంతో 1952లో ఎలిజబెత్‌-2 రాణిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె అధికార పీఠమెక్కి 70 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రస్తుతం ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆల్బనీస్‌ చర్య సరికాదని బ్రిటిష్‌ అనుకూలవాదులు ఆక్షేపిస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణద్వారా రాచరిక వాసనల నుంచి ఆస్ట్రేలియాను ఆల్బనీస్‌ పూర్తిగా బయటకు తీసుకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

- శ్రీయాన్
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సవాళ్లు అధిగమిస్తేనే సమ్మిళిత అభివృద్ధి

‣ బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

‣ ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

‣ రైతుకు ద్రవ్యోల్బణం సెగ

‣ కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

‣ పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

Posted Date: 07-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం