• facebook
  • whatsapp
  • telegram

తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట

రక్త క్రీడ నియంత్రణలో అమెరికా

అమెరికాలో ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటిదాకా తుపాకీ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలసంఖ్యలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోగా, అందులో కొన్ని పాఠశాల ప్రాంగణాల్లోనూ సంభవించాయి. అయినా, అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) తుపాకుల విచ్చలవిడి క్రయవిక్రయాలను నిషేధించడానికి ససేమిరా అంటూ వస్తోంది. ప్రతి పౌరుడికి తుపాకీని కలిగి ఉండే హక్కును రెండో రాజ్యాంగ సవరణ కట్టబెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. తుపాకులను నిషేధించడం తమ ప్రాథమిక హక్కులకు భంగకరమని వాదించే ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉండటం, వారిలో అత్యధికులు ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు కావడం పాలక డెమోక్రాట్ల చేతులను కట్టేస్తోంది. అయితే, మే నెలలో న్యూయార్క్‌లో ఒక సూపర్‌ మార్కెట్‌లో తుపాకీ చేతపట్టిన శ్వేత జాత్యహంకారి జరిపిన కాల్పుల్లో నల్లజాతీయులు మరణించడం, టెక్సస్‌ రాష్ట్రంలోని ఒక పాఠశాలలో టీనేజర్‌ జరిపిన కాల్పుల్లో 31 మంది హతమవడం అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. కాల్పులకు తెగబడ్డ దుండగులిద్దరూ 18 ఏళ్ల వయసులో ఉన్నవారే. ఈసారి తుపాకులపై జనంలో ఆగ్రహం పెల్లుబకడం చూసి ప్రతిపక్ష రిపబ్లికన్లూ తుపాకుల నియంత్రణకు దిగివచ్చారు.

కాల్పుల మోత

అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల్లో కొందరు రిపబ్లికన్లు తమ ప్రత్యర్థులైన డెమోక్రాట్లతో చేతులు కలపడంతో తుపాకుల నియంత్రణ బిల్లు ఆమోదం పొందగలిగింది. అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకంతో అది చట్ట రూపం  దాల్చింది. న్యూయార్క్‌, టెక్సస్‌లలో కాల్పులు జరిపినది 18 ఏళ్ల వయసువారే కావడంతో ఇక నుంచి 18 నుంచి 20 ఏళ్ల వయసులో తుపాకులు కొనదలచేవారి నేర రికార్డులను తనిఖీ చేసే గడువును మూడు రోజుల నుంచి 10 రోజులకు బిల్లు పెంచింది. ప్రమాదకరమైన వ్యక్తుల నుంచి తాత్కాలికంగా తుపాకులు స్వాధీనం చేసుకోవడానికీ రాష్ట్రాలకు అది అధికారం కల్పిస్తోంది. ప్రపంచంలో అమెరికన్‌ పౌరుల వద్ద ఉన్నన్ని తుపాకులు మరే దేశ పౌరులకూ లేవు. రెండో రాజ్యాంగ సవరణ పుణ్యమా అని సంక్రమించిన తుపాకీ ధారణ హక్కు పౌరులకు ప్రాణాంతకంగా పరిణమించింది. అమెరికా స్వాతంత్య్ర సంగ్రామం నాటి నుంచి ఇంతవరకు జరిగిన యుద్ధాలన్నింటిలో మరణించిన అమెరికన్లకన్నా గడచిన అయిదు దశాబ్దాలలో స్వదేశంలో తుపాకీ కాల్పులకు హతులైన అమెరికన్లే ఎక్కువ. కరోనా మహమ్మారి కాలంలో తుపాకీ కాల్పుల మోత మరీ ఎక్కువైంది. 2019-20 మధ్యకాలంలో కాల్పుల్లో మరణించిన బాలలు, టీనేజర్ల సంఖ్య గతంకన్నా 29.5 శాతం ఎక్కువ. ఈ కాలంలో తుపాకుల కొనుగోళ్లు 64 శాతం పెరిగాయి. అమెరికాలో 2021లో రైఫిళ్లు, పిస్తోళ్ల వంటి చిన్న ఆయుధాల మార్కెట్‌ పరిమాణం 370 కోట్ల డాలర్లు. అంతర్జాతీయ చిన్న ఆయుధాల విపణిలో అమెరికా వాటా 43.28శాతం. ఆ దేశంలో 46శాతం పౌరుల చేతుల్లో రివాల్వర్లు, రైఫిళ్లు ఉన్నాయి. అమెరికాలోని భారతీయులు, భారత సంతతి ప్రజలు మొదటి నుంచీ తుపాకులకు వ్యతిరేకమే. వారిలో అత్యధికులు విద్యావంతులు, వృత్తి నిపుణులే. భారతీయులు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో నివసిస్తారు కాబట్టి అక్కడ తుపాకీ కాల్పుల ఘటనలు పెరగడం ఆందోళనకర పరిణామంగా భావిస్తారు. అయితే ప్రవాసులు కావడంతో అమెరికన్‌ పౌరుల మాదిరిగా తుపాకులకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో తమదైన వాణిని గట్టిగా వినిపించలేకపోతున్నారు. కాంగ్రెస్‌ తుపాకుల నియంత్రణ బిల్లును ఆమోదించడాన్ని వారు స్వాగతించారు. మరోవైపు, ప్రజల తుపాకీ హక్కుల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

కీలక పరిణామం

తుపాకీ కాల్పుల్లో మరణించేవారి సంఖ్యా ఏటా పెరుగుతున్నా తుపాకులను నిషేధించలేకపోవడానికి కారణాలు అనేకం. వాటిలో రాజ్యాంగం, రాజకీయ విభేదాలు ముఖ్యమైనవి. ఇంకా జాతి, గ్రామీణ-పట్టణ అంతరాలు, తుపాకీ ఉత్పత్తి, అమ్మకందారుల పైరవీలు మారణాయుధాల కట్టడికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. దండిగా నిధులున్న నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏ) ‘చంపేది తుపాకులు కాదు, మనుషులే’ అని నినదిస్తూ తుపాకుల నిషేధానికి అడ్డుపడుతూ ఉంటుంది. కాంగ్రెస్‌ ఉభయ సభల్లో ప్రజాప్రతినిధులను తనకు అనుకూలంగా తిప్పుకోవడానికి పైరవీలు చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తుపాకుల అమ్మకాలపై గట్టి నియంత్రణ విధించగా, అనేక ఇతర రాష్ట్రాలు అందుకు మొరాయిస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలూ తుపాకుల నియంత్రణకు సమ్మతి తెలుపడం కీలక పరిణామం. చట్టంలోని నిబంధనల అమలుకు 1300 కోట్ల డాలర్లను కేటాయిస్తారు. తుపాకుల సంస్కృతిని సామాజిక స్థాయిలోనే తుంచేయాలని పాలక డెమోక్రాట్లు వాదిస్తుండగా, వ్యక్తుల్లో పరివర్తన రావాలన్నది రిపబ్లికన్ల అభిమతం. ఈ భేదాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక మానసిక ఆరోగ్య కేంద్రాలను విస్తరించడానికి, పాఠశాలల్లో మానసిక స్వాస్థ్య శిక్షణకు, హింసా నిరోధక చర్యలు తీసుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని బిల్లు నిర్దేశిస్తోంది. ఇకనైనా, విచ్చలవిడి తుపాకుల వినియోగం తగ్గితేనే- కాల్పుల మోత, హింస నుంచి అమెరికా సమాజానికి ఉపశమనం దక్కుతుంది.

- నీరజ్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చేయూత అందిస్తే దేశానికే పెన్నిధులు

‣ సముద్ర సంపదపై సాంకేతిక నేత్రం

‣ గుక్కెడు గంగకూ కరవే!

‣ వర్ధమాన దేశాల ‘వాణిజ్య సమరం’

‣ ఏటా తప్పని విత్తన గండం

‣ పోరుబాటలో ఆకాశనేత్రం

Posted Date: 29-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం