• facebook
  • whatsapp
  • telegram

అఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం

భూకంప బాధితులకు సాయం

పెను భూకంపంతో చిగురుటాకులా వణికిపోయిన అఫ్గానిస్థాన్‌కు భారత్‌ మానవతా దృక్పథంతో ఆపన్నహస్తం అందించింది. జూన్‌ 22వ తేదీ తెల్లవారుజామున రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపం అఫ్గానిస్థాన్‌ను అతలాకుతలం చేసింది. దాదాపు వెయ్యిమందికి పైగా మరణించారు, లెక్కలేనన్ని ఇళ్లు కుప్పకూలాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. విపత్కర పరిస్థితుల్లో తాలిబన్‌ పాలకులు చేతులెత్తేయడంతో ప్రజలు అల్లాడారు. అలాంటి పరిస్థితుల్లో భారత్‌ సత్వరమే స్పందించింది. తాలిబన్లు అధికారం చేపట్టిన తరవాత, భారత్‌ తన రాయబార కార్యాలయాన్ని మూసేసినా, తక్షణసాయంగా ఔషధాలు, నిత్యావసర సరకులు అందించి పెద్ద మనసును చాటుకుంది. అఫ్గాన్‌లో చాలామేర ఇళ్లు ఇటుకలు, మట్టితో కట్టినవే కావడంతో భూకంపం తాకిడికి కుప్పకూలిపోయాయి. ఇళ్లలో దాచుకున్న కొద్దిపాటి సరకులు, దుస్తులు, వస్తువులన్నీ శిథిలాల కిందే కూరుకుపోయాయి. తమకు అత్యవసరంగా ప్రాణాలు కాపాడుకోవడానికి బియ్యం, గోధుమపిండి కావాలంటూ బాధితులు అర్థించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రాథమిక అంచనాల ప్రకారమే సుమారు 10వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయని చెబుతున్నారు. తుది అంచనాలు తేలేసరికి ఈ నష్టం ఇంకెంత ఎక్కువ ఉంటుందో, బాధితులు ఇంకా ఎంత సంఖ్యలో ఉంటారో చెప్పడం కష్టమే. ప్రజాస్వామిక ప్రభుత్వం లేకపోవడంతో, విపత్కర సమయంలో తమకు ఆహారం అందించే వారయినా ఉంటారా అనే సంశయంతో అఫ్గాన్‌వాసులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సహాయకార్యక్రమాలకు వెళ్తున్న వివిధ వర్గాలు చెబుతున్నాయి.

మానవతా దృక్పథం

ఆసియా ఖండంలోని పలు ప్రాంతాల్లో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటాయి. మే నెల తొమ్మిదో తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా 100 భూకంపాలు సంభవిస్తే, వాటిలో 36 అఫ్గానిస్థాన్‌లోనే నమోదయ్యాయి. వాటిలో చాలావరకు అసలు వచ్చిన విషయమే తెలియదు. హిందూకుష్‌ ప్రాంతంలోనే ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయన్నది అమెరికా జియలాజికల్‌ సర్వే చెబుతున్న మాట. ఇందుకు భూగర్భంలోని ఫలకాల కదలికలు, అవి ఒకదాంతో ఒకటి ఢీకొనడం లాంటివే ప్రధాన కారణం. రహదారుల వంటి మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉండే అఫ్గానిస్థాన్‌లో మానవీయ సాయం అందించడానికి వచ్చే వాహనాలు ముందుకు సాగడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సాధారణంగా ఏ దేశమైనా విపత్కర పరిస్థితిలో ఉందంటే అంతర్జాతీయ సమాజం ఆదుకోవడానికి ముందుకొస్తుంది. మానవతా దృక్పథంతో చేతనైనంత సాయం చేస్తుంది. కానీ, తాలిబన్‌ పాలకుల విషయంలో గతంలో పలు దేశాలకు చేదు అనుభవాలు ఉన్నాయి. తాలిబన్లు తమకు మద్దతిచ్చే ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఉండేచోటుకే సహాయం అందించే వాహనాలను దారిమళ్ళించేవారు. సహాయ సామగ్రిని తీసుకొచ్చిన వాహనాలను తామే స్వాధీనం చేసుకుని, వాటిని స్వయంగా తామే పంపిణీ చేసినట్లుగా చిత్రీకరించేవారు. అయితే, ఈసారి అఫ్గాన్లకు సహాయం చేసేందుకు ముందుకొచ్చే అంతర్జాతీయ సంస్థల విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని, ఎక్కడ, ఎప్పుడు, ఎలా పంపిణీ చేస్తారన్నది మొత్తం వాళ్ల ఇష్టమేనని తాలిబన్లు చెబుతున్నారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి ముందుకొచ్చిన భారత్‌కు తాలిబన్‌ పాలకులు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి రాయబార కార్యాలయాన్ని తెరవడంతో పాటు సాంకేతిక బృందాన్ని, మానవీయ సహాయాన్ని పంపించి అఫ్గాన్‌ వాసులతో సంబంధాలు పునరుద్ధరించడం శ్లాఘనీయమని ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అబ్దుల్‌ ఖహర్‌ బల్ఖీ పేర్కొన్నారు. భారత బృందానికి తాము అన్నివిధాలా భద్రత కల్పిస్తామని, వారి దౌత్యపరమైన, రాజకీయ హక్కులను కాపాడుతామని చెబుతున్నారు.

వ్యూహాత్మకంగా కీలకం

పాకిస్థాన్‌కు అవతలివైపు ఉన్న అఫ్గానిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించడం వ్యూహాత్మకంగా భారత్‌కు చాలా కీలకం. భారత ఉపఖండంలో ప్రాంతీయ సమతౌల్యం కోసం అఫ్గానిస్థాన్‌లో ప్రజాస్వామ్యం, అభివృద్ధి చాలా ముఖ్యమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ చాలా సందర్భాల్లో స్పష్టంచేసింది. మధ్య ఆసియా రిపబ్లిక్‌లకు చేరువ కావాలన్నా; పాకిస్థాన్‌, చైనాలను నిరోధించాలన్నా అఫ్గానిస్థాన్‌ కీలకంగా మారుతుంది. మధ్య ఆసియా రిపబ్లిక్‌లైన కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లకు భారతదేశం నుంచి వెళ్ళే ఎగుమతులకూ అఫ్గాన్‌లో భారత్‌ నిర్మించిన డేలారామ్‌ జాతీయ రహదారి ఉపయోగపడుతుంది. చైనా తలపెడుతున్న బీఆర్‌ఐకి కూడా ఈ మార్గం పోటీగా నిలుస్తుంది. అఫ్గాన్‌లో మూడు ఆనకట్టలు, పార్లమెంటు భవనం, రహదారులు, ఆస్పత్రులను భారత్‌ నిర్మించింది. అయితే ఇన్నాళ్లూ అక్కడ ఎన్నికైన ప్రభుత్వాలతోనే భారత్‌ సంబంధాలు కొనసాగించింది. తాలిబన్ల వంటి వర్గాలతో సంప్రదింపులు చేపట్టలేదు. ఇప్పుడు తొలిసారిగా తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలో భూకంప బాధితులకు సహాయం అందిస్తోంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా భారత్‌-అఫ్గాన్‌ సంబంధాలు మెరుగ్గా ఉండేందుకు ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయి. ఇప్పుటికీ తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లుగా భారత్‌ ఎక్కడా ప్రకటించకపోవడం గమనార్హం.

- కామేశ్వరరావు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 5జీ రాకకు వేళాయె...

‣ రాష్ట్రాల అసంతృప్తి గళం

‣ తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట

‣ చేయూత అందిస్తే దేశానికే పెన్నిధులు

‣ సముద్ర సంపదపై సాంకేతిక నేత్రం

Posted Date: 29-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం