• facebook
  • whatsapp
  • telegram

‘సీపెక్‌’కు నిధుల కటకట

తృతీయపక్షం కోసం చైనా, పాక్‌ ఆరాటం

ప్రపంచవ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని పెంచుకొని అమెరికాకు దీటైన శక్తిగా అవతరించాలన్న లక్ష్యంతో చైనా ప్రతిష్ఠాత్మకమైన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)ను తలపెట్టింది. అందులో అత్యంత కీలకమైన చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓవైపు ఇస్లామాబాద్‌ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. బీజింగ్‌ సైతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. పాక్‌లో నిర్మాణ కార్యకలాపాలకు భద్రత కల్పించడమూ పెద్ద సవాలుగా మారింది. ఈ తరుణంలో సీపెక్‌లో ఏదైనా తృతీయ దేశం భాగస్వామ్య పక్షంగా చేరితే స్వాగతిస్తామంటూ చైనా, పాక్‌ ప్రకటించాయి. దానిపై భారత్‌ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలు భారత సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతలకు విరుద్ధమని ప్రకటించింది. వాటికి తగిన విధంగా బదులిస్తామనీ హెచ్చరించింది.

బీఆర్‌ఐ ద్వారా ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపాలతో వాణిజ్య వ్యవస్థను సృష్టించుకోవాలన్నది డ్రాగన్‌ యోచన. అందులో భాగంగా తన చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్‌తో కలిసి సీపెక్‌కు శ్రీకారం చుట్టింది. పాక్‌లోని గ్వాదర్‌ ఓడరేవును చైనాలోని షింజియాంగ్‌ ప్రాంతంలో ఉన్న కష్గర్‌తో రోడ్డు, రైలు, పోర్టు ప్రాజెక్టులతో అనుసంధానించడం సీపెక్‌ ఉద్దేశం. ఇందుకోసం 65 వేల కోట్ల డాలర్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాలని సంకల్పించారు. 2015లో సీపెక్‌ పనులు ప్రారంభమైనప్పుడు పాక్‌ ఆర్థిక వ్యవస్థకు అది గొప్ప వరంగా మారుతుందని అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సహా పలువురు భావించారు. కానీ, పాక్‌ ఆర్థికానికి అది శాపంగా తయారైనట్లు ఏడేళ్లు గడిచేసరికి తేటతెల్లమైంది. సీపెక్‌ ప్రాజెక్టుల పేరుతో ఇస్లామాబాద్‌ వేల కోట్ల డాలర్ల విలువైన సామగ్రిని బలవంతంగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా దాయాది దేశంలో ద్రవ్యలోటు పెరిగింది. సీపెక్‌ కోసం తీసుకున్న రుణాలను బీజింగ్‌కు తిరిగి చెల్లించలేక ఇస్లామాబాద్‌ ప్రస్తుతం తలపట్టుకొంటోంది. గోరుచుట్టుపై రోకటి పోటులా కొవిడ్‌ మహమ్మారి పాక్‌ ఆర్థిక వ్యవస్థను మరింత ఊబిలోకి నెట్టింది. చైనాలోనూ స్థిరాస్తి రంగంలో సంక్షోభం నెలకొంది. మదుపరుల నిరసనలతో బ్యాంకింగ్‌ రంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. జీరో కొవిడ్‌ లాక్‌డౌన్లు ఆర్థిక కార్యకలాపాలకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఫలితంగా సీపెక్‌కు అవసరమైన నిధులను బీజింగ్‌ సొంతంగా తరలించలేకపోతోంది. దానివల్ల పనుల్లో ఆశించిన ప్రగతి లేదు. గ్వాదర్‌ ఓడరేవు రెండో దశ విస్తరణ, 300 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నిర్మాణం, గ్వాదర్‌లో నూతన విమానాశ్రయం వంటి పనులన్నీ నత్త నడకన సాగుతున్నాయి. దాంతో తృతీయ దేశాల భాగస్వామ్యం ద్వారా మరిన్ని నిధులను సమీకరించాలని బీజింగ్‌, ఇస్లామాబాద్‌లు భావిస్తున్నాయి.

భద్రతాపరంగా ఎదురవుతున్న సవాళ్లు సైతం సీపెక్‌ పనుల్లో మందకొడితనానికి మరో ప్రధాన కారణం. ఈ నడవాలో ఎక్కువ భాగం పాక్‌లోని బలూచిస్థాన్‌ నుంచి వెళ్తుంది. అక్కడి బంగారం, సహజవాయువు, బొగ్గు గనులపై డ్రాగన్‌ కన్నేసింది. ఆ సంగతిని గుర్తించిన బలూచ్‌ ప్రజలు సీపెక్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిర్మాణ కార్యకలాపాలకు రక్షణ కల్పించే పేరుతో బీజింగ్‌, ఇస్లామాబాద్‌ సాయుధ బలగాలు బలూచిస్థాన్‌లో తిష్ఠ వేయడం వారికి ఏమాత్రం నచ్చడంలేదు. అందుకే నడవా నిర్మాణ పనులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. వాటిలో ఇప్పటికే పలువురు చైనా అధికారులు మృత్యువాత పడ్డారు. చైనా, పాక్‌ల మధ్య అనుసంధానతను మెరుగుపరచడమే సీపెక్‌ ప్రధాన లక్ష్యమని డ్రాగన్‌ చెబుతోంది. దాని వెనక వేరే వ్యూహం ఉంది. గ్వాదర్‌ నౌకాశ్రయానికి అనుసంధానం కావడం ద్వారా అరేబియా కడలిలోకి, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశాన్ని సులభతరం చేసుకోవాలన్నది బీజింగ్‌ పథకం. గ్వాదర్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి డ్రాగన్‌ ప్రయత్నిస్తోందని బలూచ్‌ ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే దాడులకు పాల్పడుతున్నారు. వాటిని నివారిస్తేగానీ నడవాను పూర్తి చేయడం సాధ్యం కాదు. అఫ్గానిస్థాన్‌కూ సీపెక్‌ను విస్తరించడంపై చైనా, పాక్‌ ఇటీవల చర్చించాయి. అదేమీ అంత సులభం కాదు. సీపెక్‌కు నిధుల కటకట, బలూచిస్థాన్‌లో వ్యతిరేకత, శ్రీలంక, పాక్‌ సహా పలు దేశాలను రుణాల ఊబిలోకి దింపిన చైనా తీరు గురించి ప్రపంచమంతటికీ తెలుసు. వీటన్నింటికి తోడు తాజాగా ఇండియా తీవ్ర నిరసన నేపథ్యంలో ఇతర దేశాలేవీ ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి ముందుకు రాకపోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

- ఎం.నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం!

‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

Posted Date: 29-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం