• facebook
  • whatsapp
  • telegram

‘తీస్తా’ ఒప్పందంపై ప్రతిష్టంభన

ఇరుగు పొరుగులైన భారత్‌, బంగ్లాదేశ్‌లు స్నేహబంధాన్ని దృఢతరం చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా నదీ జలాల వివాదాల్లో సరైన పరిష్కారానికి కృషి చేయాలి. కానీ, తీస్తా నదీ జలాల పంపిణీ విషయంలో రెండు దేశాల మధ్య పీటముడి నేటికీ వీడలేదు.

కొవిడ్‌ ప్రభావం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్థితులతో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో ఇరుగు పొరుగు దేశాలైన భారత్‌, బంగ్లాదేశ్‌ స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, భాష వంటి వాటిలో ఏకరూపత కలిగిన భారత్‌, బంగ్లాదేశ్‌లు దశాబ్దాలుగా సత్సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇండియా చొరవతోనే పాకిస్థాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. భారత్‌ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) వంటివి బంగ్లాదేశ్‌కు అసంతృప్తి కలిగించాయి. ఇటీవలి కాలంలో చైనావైపు బంగ్లాదేశ్‌ మొగ్గుచూపుతోంది. ప్రపంచం మాంద్యం వైపు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాలు ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నదీజలాల పంపిణీ విషయంలో సరైన విధానాలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని నిపుణులు చెబుతున్నారు.

రైతులకు ఉపయోగం

భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య 54 నదులు ప్రవహిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ తూర్పు పాకిస్థాన్‌గా ఉన్నప్పటి నుంచే రెండింటి మధ్య నదీ జలాల సమస్యలున్నాయి. 1961లో ఇండియా ఫరక్కా ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించింది. దాన్ని పాకిస్థాన్‌ వ్యతిరేకించింది. ఆ సమస్యపై భారత్‌, పాక్‌లు 1969 దాకా అయిదు సమావేశాలను నిర్వహించాయి. బంగ్లాదేశ్‌ ఏర్పడ్డాక 1972లో భారత్‌, బంగ్లాల నడుమ సంయుక్త నదీ కమిషన్‌ ఏర్పడింది. గంగా జలాల పంపకంలో ఇరు దేశాలు ఒక అవగాహనకు రావడానికి రెండున్నర దశాబ్దాలు పట్టింది.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఇటీవలి భారత పర్యటనలో నీటి భాగస్వామ్యం, వాణిజ్యం, రైల్వే, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ముఖ్యంగా 26 ఏళ్లలో తొలిసారిగా ముఖ్యమైన సరిహద్దు నది అయిన కుసియారా జలాలను పంచుకోవడానికి రెండు దేశాలూ అంగీకరించాయి. దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్‌లోని సిల్‌హట్‌ వాసులకు ప్రయోజనం చేకూర్చే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం- షేక్‌ హసీనా తన భారత పర్యటనలో సాధించిన దౌత్య విజయం. చివరిసారిగా భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య 1996లో గంగా నదీ జలాల పంపిణీపై ఒప్పందం కుదిరింది. ఆ తరవాత ఇన్నేళ్లలో నదీజలాల పంపకంపై కుదిరిన ఒడంబడిక ఇదే. ఈశాన్య భారతంలో రెండో అతిపెద్ద నది అయిన బరాక్‌- అస్సామ్‌లోని కరీంగంజ్‌ సమీపంలో రెండుగా విడిపోతుంది. ఉత్తర శాఖ సుర్మాగా, దక్షిణ శాఖ కుసియారాగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. గత శతాబ్ద కాలంలో బరాక్‌ నదిలో వచ్చిన మార్పుల వల్ల అధిక నీటి ప్రవాహం కుసియారావైపు ప్రవహించింది. సుర్మాలోకి తక్కువ నీరు వెళ్తోంది. సిల్‌హట్‌ సుర్మా నది ఒడ్డున ఉంటుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ల సరిహద్దు రేఖగానూ కుసియారా నది నెలకొంది. సిల్‌హట్‌లో శీతకాలంలో వరి సాగుకు ఈ నది నీటివాటా అత్యంత కీలకం. రహీంపుర్‌ కాలువ ద్వారా కుసియారా నుంచి నీటిని తీసుకోవడానికి ఇన్నాళ్లు భారత్‌ ఒప్పుకోకపోవడం వల్ల ఆ ప్రాంతంలో వరి సాగు దెబ్బతింటోందని బంగ్లాదేశ్‌ చెబుతోంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా జలాల పంపిణీకి భారత్‌ అంగీకరించడంతో సిల్‌హట్‌ ప్రాంత రైతులకు మేలు జరగనుంది.

ముందడుగు పడితేనే...

బ్రహ్మపుత్ర ఉపనది అయిన తీస్తా- సిక్కిం, పశ్చిమ్‌ బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. చాలాకాలంగా భారత్‌, బంగ్లాల మధ్య తీస్తా జలాల విషయంలో వివాదాలు నెలకొన్నాయి. హసీనా పర్యటనలో ఆ నది నీటి పంపకంపై ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. శీతకాలంలో వరి ప్రధాన పంటగా ఉన్న పశ్చిమ్‌ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాలు, బంగ్లాదేశ్‌లోని రంగపుర్‌ తదితర ప్రదేశాలకు తీస్తా జలాలు అత్యంత కీలకం. వాటి పంపిణీపై గతంలో ఉద్దేశించిన ఒప్పందాన్ని పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి నిమిషంలో అడ్డుకొన్నారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. హసీనా అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు ఉగ్రవాద ముప్పు గణనీయంగా తగ్గింది. తీస్తా ఒప్పందంపై భారత్‌ ముందడుగు హసీనా అధికారాన్ని బంగ్లాదేశ్‌లో బలోపేతం చేస్తుంది. తద్వారా ఇండియాకు ఉగ్ర మూకల ముప్పు తగ్గుతుంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తీస్తా జలాల సమస్యను భారత్‌ త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.

- గొడవర్తి శ్రీనివాసు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వాణిజ్య ఒప్పందాలపై ఆచితూచి...

‣ ఆత్మనిర్భరతే భారత్‌ కర్తవ్యం

‣ సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

‣ పాలనలో తగ్గుతున్న జనభాగస్వామ్యం

‣ సాగురంగానికి నీటి కొరత ముప్పు

‣ అభివృద్ధి పథంలో భారత్‌

‣ సంక్లిష్ట సమయంలో స్నేహ మంత్రం

Posted Date: 19-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం