• facebook
  • whatsapp
  • telegram

భారత దౌత్యనీతికి పరీక్ష

అమెరికాతో పొసగని పక్షాలతో ఇండియా జట్టు కడుతోందని అగ్రరాజ్య అనుకూల వర్గాలు కొన్నాళ్లుగా ఆక్షేపిస్తున్నాయి. రష్యా, సౌదీ అరేబియా వంటి వాటితో భారతదేశ వ్యవహార శైలిని అందుకు ఉదాహరణగా ఉటంకిస్తున్నాయి. కానీ, విదేశాలతో ఎలాంటి సంబంధాలను కొనసాగించాలన్నది పూర్తిగా ఇండియా ఇష్టం. ఏ దేశమైనా సరే- స్వప్రయోజనాలకు అనుగుణంగానే తన విదేశాంగ విధానాలను రూపొందించుకొంటుంది.

అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రపంచ అగ్రగామి దేశాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది. ఆ క్రమంలో ఇటీవల ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమెరికా నేతృత్వంలోని ఇండో-పసిఫిక్‌ ఆర్థిక చట్రం (ఐపీఈఎఫ్‌)లో వాణిజ్య విభాగం సంప్రతింపుల నుంచి ఇండియా వైదొలగింది. అదే సమయంలో- భారత్‌కు అత్యధికంగా చమురును ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో రష్యాను అధిగమించి రెండో స్థానాన్ని సౌదీ అరేబియా తిరిగి చేజిక్కించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీ, రియాద్‌ల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇది అద్దంపడుతోంది.

నాలుగు స్తంభాలాట

ఈ ఏడాది మేలో టోక్యోలో క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐపీఈఎఫ్‌ ఏర్పాటును ప్రకటించారు. దానిద్వారా ఆసియా ఆర్థిక వ్యవహారాల్లో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయాలన్నది ఆయన వ్యూహం. అమెరికా, భారత్‌తోపాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని మరో పన్నెండు దేశాలకు కొత్త కూటమిలో సభ్యత్వం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 40శాతం వాటా ఐపీఈఎఫ్‌ దేశాలదే. పటిష్ఠ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకోవడం, శుద్ధ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పన్నుల్లో పారదర్శకత పెంపు ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయడం, స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కల్పించడం అనే నాలుగు అంశాలు ఈ కూటమికి మూలస్తంభాలు. విస్తృత సంప్రతింపుల తరవాత ఆ నాలుగింటిపై విడివిడిగా సంతకాలు చేయాలని సభ్యదేశాలు భావించాయి. అందుకోసం లాస్‌ ఏంజెలిస్‌లో గతవారం చర్చలు జరిగాయి. ఇతర సభ్యదేశాలన్నీ నాలుగు అంశాలపైనా సంతకాలు చేశాయి. సరఫరా గొలుసులు, అవినీతి నిరోధకత, శుద్ధ ఇంధన అంశాలకు సమ్మతి తెలిపిన ఇండియా- వాణిజ్య సంబంధిత విభాగం నుంచి ప్రస్తుతానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. డిజిటల్‌ వాణిజ్యం, కార్మికులు, పర్యావరణం వంటి అంశాల్లో ఐపీఈఎఫ్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. వాణిజ్య ఒప్పందం సభ్యదేశాలకు ఎలా లబ్ధి చేకూరుస్తుందన్న దానిపైనా స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో వాణిజ్య విభాగంలో భాగస్వామిగా చేరడం సముచితం కాదని ఇండియా భావించింది. సౌదీ, అమెరికాల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఐపీఈఎఫ్‌పై భారత వైఖరి చర్చనీయాంశంగా మారింది.

సౌదీతో ఇండియా రాజకీయ, ఆర్థిక, వాణిజ్య సంబంధాలు కొన్నేళ్లుగా బాగా బలపడ్డాయి. దానివల్ల పలు సందర్భాల్లో మనకు లబ్ధి చేకూరింది. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినప్పుడు- అందుకు వ్యతిరేకంగా దిల్లీపై రియాద్‌ గళమెత్తేలా చేసేందుకు పాక్‌ ప్రయత్నించింది. కానీ, సౌదీ దాని బుట్టలో పడలేదు. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగినప్పుడు- వాటిని సౌదీ గర్హించినా, ఇండియాను ఇబ్బందుల్లోకి నెట్టే చర్యలకు దూరంగానే ఉంది. భారత్‌లో పర్యటించాల్సిందిగా సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను మోదీ ఇటీవల ఆహ్వానించారు. ఇరుదేశాల నడుమ పెరుగుతున్న సాన్నిహిత్యానికి అది మరో నిదర్శనం. ఇక రష్యాతో భారత బంధం ఎంతటి పటిష్ఠమైనదో ప్రపంచమంతటికీ తెలుసు. తాజాగా ఉజ్బెకిస్థాన్‌ వేదికగా జరిగిన షాంఘై సహకార సదస్సులో మోదీ, పుతిన్‌ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు అంతర్జాతీయ వ్యవహారాలపైనా చర్చించారు. దిల్లీ-మాస్కో బాంధవ్యం ఎవరూ విడదీయరానిదని చాటిచెప్పారు. ఈ పరిణామాలన్నీ వాషింగ్టన్‌కు రుచించనివే. ఇప్పటికే తన ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి భారత్‌ భారీగా చమురును కొనుగోలు చేస్తోందని అమెరికా కుతకుతలాడుతోంది.  

లాభమా, నష్టమా?

ఐపీఈఎఫ్‌లోని వాణిజ్య విభాగానికి ఇండియా దూరంగా ఉండటం ప్రస్తుతానికి సరైన నిర్ణయంగానే కనిపిస్తోంది. ఐరోపా కూటమి, బ్రిటన్‌, కెనడా తదితర దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు జరుపుతున్న చర్చలపై దాని ప్రభావం పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో కీలకంగా మారాలని బలంగా కాంక్షిస్తున్న భారత్‌కు దీర్ఘకాలంలో అది ప్రతికూలంగా మారే అవకాశాలూ ఉన్నాయి. ముఖ్యంగా సంక్లిష్ట వాణిజ్యాంశాలపై చర్చల్లో మన దేశం బలహీనంగా ఉంటుందన్న సంకేతాలు వెళ్ళే ముప్పుంది. చైనా మద్దతు కలిగిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద చర్చల నుంచి భారత్‌ 2019లో వైదొలగడంపైనా పలు దేశాలు పెదవి విరిచిన సంగతి మరిచిపోలేం. కాబట్టి మోదీ సర్కారు అప్రమత్తంగా వ్యవహరించాలి. చైనా, పాకిస్థాన్‌ల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని- రష్యా, సౌదీ తదితరాలతో సత్సంబంధాలను కాపాడుకుంటూనే, అమెరికాతో మైత్రీబంధాన్ని పటిష్ఠపరచుకోవాలి.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అవరోధాల సుడిలో మానవాభివృద్ధి

‣ ‘తీస్తా’ ఒప్పందంపై ప్రతిష్టంభన

‣ వాణిజ్య ఒప్పందాలపై ఆచితూచి...

‣ ఆత్మనిర్భరతే భారత్‌ కర్తవ్యం

‣ సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

Posted Date: 21-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం