• facebook
  • whatsapp
  • telegram

మానవ హక్కులను కాలరాస్తున్న చైనా

షింజియాంగ్‌లోని వీగర్‌ ముస్లిములపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తీవ్ర దమన నీతికి పాల్పడుతోంది. వారిని ఉగ్రవాదులుగానో లేదా ముష్కర సానుభూతిపరులుగానో వ్యాఖ్యానిస్తూ నిర్బంధ శిబిరాల్లో కుక్కుతోంది. వీగర్ల విషయంలో మతస్వేచ్ఛ, కనీస మానవ హక్కులకు డ్రాగన్‌ ప్రభుత్వం తిలోదకాలిస్తోంది.

చైనాలో ఆరో వంతు భూభాగంలో విస్తరించిన షింజియాంగ్‌ వీగర్‌ స్వయంపాలిత ప్రాంతానికి పాకిస్థాన్‌, కజకిస్థాన్‌ సహా మొత్తం ఎనిమిది దేశాలతో సరిహద్దులున్నాయి. 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి షింజియాంగ్‌ తనదేనని డ్రాగన్‌ దేశం ప్రకటించుకొంది. అక్కడ భారీగా బొగ్గు, సహజవాయు నిక్షేపాలున్నాయి. ఆసియా మీదుగా ఐరోపాకు చేరే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో షింజియాంగ్‌ కీలక అంతర్భాగం. ఆ ప్రాంతాన్ని తూర్పు తుర్కిస్థాన్‌గా పిలిచే కొందరు వీగర్లు తమది స్వతంత్ర దేశమని వాదిస్తారు.

నిరంతర నిఘా

షింజియాంగ్‌లోకి హాన్‌ చైనీయులను భారీగా తరలించి అక్కడ వారిని స్థిరపరచడానికి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం నడుంకట్టడంతో రాష్ట్ర రాజధాని ఉరుంకిలో 2009లో పెద్దయెత్తున అల్లర్లు జరిగాయి. హాన్‌ చైనీయులను తరలించడమే కాదు- స్థానిక వీగర్లపై సాంస్కృతికంగా, ఆర్థికంగా దుర్విచక్షణ చూపుతున్నారని ఉద్యమకారులు ఆరోపించారు. 2009 అల్లర్లలో 200 మంది దాకా మరణించారు. అప్పటి నుంచి చైనా ప్రభుత్వం వీగర్లందరినీ ఉగ్రవాదులుగానో, ఉగ్రవాద సానుభూతిపరులుగానో పరిగణించసాగింది. తరవాతి కాలంలో స్థానికంగా ఒక ప్రభుత్వ కార్యాలయం, రైల్వేస్టేషన్‌, మార్కెట్‌పై జరిగిన దాడులకూ వీగర్లే కారణమని ఆరోపించింది. అన్నింటికీ మించి బీజింగ్‌ తియానన్మన్‌ స్క్వేర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనకూ వీగర్లనే బాధ్యుల్ని చేసింది.

షింజియాంగ్‌లో మత స్వేచ్ఛ, కనీస మానవ హక్కులను డ్రాగన్‌ ప్రభుత్వం కాలరాచింది. వీగర్లను బందీల దొడ్డిలోకి తోలి వాటిని పునర్విద్యా శిబిరాలనో, వృత్తి శిక్షణ కేంద్రాలనో పిలవసాగింది. కోటికి పైగా జనాభా కలిగిన షింజియాంగ్‌లో చైనా ప్రభుత్వం 2017 నుంచి కనీసం 10 లక్షల మంది వీగర్‌, కజక్‌, ఉజ్బెక్‌ ముస్లిములను నిర్బంధ శిబిరాల్లో ఉంచింది. వీగర్లు ప్రధానంగా టర్కిక్‌ కుటుంబానికి చెందినభాష మాట్లాడతారు. నిర్బంధ శిబిరాల్లో వారికి మాండరిన్‌ భాష నేర్పిస్తున్నామని, చైనీస్‌ చట్టాల గురించి బోధిస్తున్నామన్నది కమ్యూనిస్టు పాలకుల మాట. వారికి వృత్తి నైపుణ్యాలు సైతం మప్పుతున్నామని చెబుతున్నారు. వాస్తవానికి వీగర్ల నిర్బంధానికి కారణాలు వేరే ఉన్నాయి. తుర్కియే, అఫ్గానిస్థాన్‌ వంటి 26 దేశాలతో వీగర్‌ ముస్లిములు ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని చైనా ఆదేశించింది. ఆ దేశాలకు వెళ్ళి వచ్చినా, అక్కడి వారితో సంబంధాలు నెరపినా నిర్బంధ శిబిరాల్లోకి నెట్టేస్తోంది. అలాగే మసీదులకు వెళ్ళి నమాజ్‌ చేసినా, ముగ్గురు కన్నా ఎక్కువ మంది పిల్లలను కన్నా, గడ్డం పెంచినా, సామాజిక మాధ్యమ ఖాతా కలిగి ఉన్నా, ఖురాన్‌ సూక్తులతో సందేశాలు పంపినా- నిర్బంధ శిబిరాల్లో కుక్కుతున్నారు. ఆ శిబిరాలకు వెలుపల ఉన్న వీగర్ల పరిస్థితీ అధ్వానంగానే ఉంది. వారిపై నిరంతర నిఘా పెడుతున్నారు. మతపరమైన ఆంక్షలుంటాయి. హలాల్‌ చేసిన ఆహారమే తింటామని వారు పట్టుపట్టకూడదు. నిర్బంధ శ్రమ, నిర్బంధ గర్భనిరోధక చికిత్సలకు వారు గురి కావలసివస్తోంది. స్త్రీలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే ఆరోపణలూ వచ్చాయి. వీగర్‌ ముస్లిములు తమ పిల్లలకు మహమ్మద్‌ అని, మదీనా అని పేర్లు పెట్టకూడదు. షింజియాంగ్‌ పౌరుల వ్యక్తిగత గుర్తింపు కార్డులను అధికారులు నిత్యం తనిఖీ చేస్తుంటారు. అడిగినప్పుడల్లా ఫొటోలు, వేలిముద్రలు ఇవ్వాల్సిందే. ఎక్కడ చూసినా ముఖ గుర్తింపు కెమేరాలే కనిపిస్తాయి. అధికారులు ఎక్కడికక్కడ వీగర్ల సెల్‌ఫోన్లను తనిఖీ చేస్తారు. వారి బయోమెట్రిక్‌ డేటాను సేకరిస్తారు.

దమన నీతిపై విమర్శలు

షింజియాంగ్‌ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం గత ఆగస్టు 31న ఒక నివేదిక విడుదల చేసింది. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో చైనా ప్రభుత్వం వీగర్లు, ఇతర ముస్లిం గ్రూపుల మానవ హక్కులను హరిస్తోందని ఆరోపించింది. మూకుమ్మడి నిర్బంధానికి, మత, సాంస్కృతిక పరమైన అణచివేతకూ పాల్పడుతోందని వెల్లడించింది. చైనా సర్కారు ఈ దమన నీతిని కట్టిపెట్టాలని ఐక్యరాజ్య సమితి అధికారులు, మానవ హక్కుల సంస్థలు, కొన్ని దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. షింజియాంగ్‌లో అణచివేతతో సంబంధమున్న కొన్ని చైనా కంపెనీలను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. షింజియాంగ్‌లో నిర్బంధ శ్రమతో తయారైన వస్తువులను తమ మార్కెట్లలో నిషేధించాలని ఐరోపా సమాఖ్య (ఈయూ) యోచిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా శక్తిమంతమైన చైనా అంతర్జాతీయ ఆంక్షలను లెక్కచేయకపోవచ్చు.

- బి.కె.కిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వేచ్ఛాహననంపై ఆగ్రహజ్వాల

‣ సాగుభూమికి రసాయనాల ముప్పు

‣ మనోవర్తి... గౌరవ జీవన హక్కు!

‣ వ్యర్థాల దహనం... అనర్థదాయకం!

‣ మరణశిక్షే పరిష్కారమా?

‣ భారత దౌత్యనీతికి పరీక్ష

‣ అవరోధాల సుడిలో మానవాభివృద్ధి

Posted Date: 26-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం