• facebook
  • whatsapp
  • telegram

సమర్కండ్‌లో భారత్‌ సహకార నినాదం

ఇటీవలి షాంఘై సహకార సంస్థ సదస్సుపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమైంది. భారత్‌ అన్ని దేశాలతోనూ సమదూరం పాటించింది. తన వాణిని, బాణీని సమర్థంగా వినిపించింది. ఉక్రెయిన్‌ యుద్ధంపై అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టడం ద్వారా ప్రపంచ దేశాల అభిమానాన్ని చూరగొంది.

కొవిడ్‌ కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు వ్యవస్థలు బలహీనపడ్డాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అవి అస్తవ్యస్తంగా మారాయి. ఆహార, ఇంధన సంక్షోభాలు భయపెడుతున్నాయి. యుద్ధంతో భౌగోళిక రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌ వేదికగా ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) 22వ శిఖరాగ్ర సదస్సు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కీవ్‌పై మాస్కో బలగాలు సైనిక చర్యకు దిగిన తరవాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధానమంత్రి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమర్కండ్‌లోనే తొలిసారిగా వేదికను పంచుకోవడం కూడా ప్రపంచ దేశాల ఆసక్తి పెరగడానికి కారణమైంది. ప్రచ్ఛన్న యుద్ధం తరహా పరిస్థితులు మళ్ళీ నెలకొన్నవేళ భారత దౌత్యనీతికి పరీక్షగా నిలిచిన ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ లౌక్యంగా వ్యవహరించారు. రష్యాతో బలమైన మైత్రీబంధాన్ని గుర్తుచేస్తూనే, ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించాలంటూ పుతిన్‌కు తన అభిమతాన్ని నిక్కచ్చిగా తెలియజేయడం ద్వారా అమెరికాతోపాటు పలు ఐరోపా దేశాలనూ ఆకట్టుకున్నారు.

బలీయ కూటమి

మొత్తం ఆరు వ్యవస్థాపక సభ్యదేశాలతో (చైనా, రష్యా, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌) 2001లో ఎస్‌సీఓ అవతరించింది. 2017లో భారత్‌, పాకిస్థాన్‌ అందులో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని దక్కించుకున్నాయి. కొత్తగా ఇరాన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వ హోదా మంజూరు చేశారు. మరికొన్ని దేశాలు సైతం ఇందులో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం తహతహలాడుతున్నాయి. ఎస్‌సీఓలో రష్యా, చైనాలదే కాస్త పైచేయిగా ఉన్నా వాణిజ్య, ఆర్థికపరమైన వ్యూహాత్మక అవసరాల రీత్యా దిల్లీ ఈ కూటమికి సముచిత ప్రాధాన్యం ఇస్తోంది. చైనా, పాక్‌లతో సంబంధాలు క్షీణించినా, రష్యాతో దోస్తీ అమెరికా, జపాన్‌ వంటి భారత మిత్రదేశాలకు అసంతృప్తి కలుగజేస్తున్నా- మోదీ ఎస్‌సీఓ సదస్సుకు స్వయంగా హాజరు కావడమే అందుకు నిదర్శనం. సమర్కండ్‌లో పుతిన్‌తో మోదీ భేటీ అవుతారని, జిన్‌పింగ్‌తో కలిసి వేదికను పంచుకుంటారని తెలిసినప్పటి నుంచీ ఇండియా తీరుపై పెదవి విరిచిన పాశ్చాత్య మీడియా- సదస్సు ముగిసేసరికి ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టింది. ఉజ్బెక్‌లో మోదీ ముక్కుసూటిగా వ్యవహరించడమే అందుకు కారణం. కూటమి నేతలతో విందుకు దూరంగా ఉన్న ఆయన, ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న ఆహార, ఇంధన సంక్షోభాలు, పర్యావరణ మార్పుల గురించే ఎస్‌సీఓ వేదికపై మాట్లాడారు. జిన్‌పింగ్‌తో భేటీ కాలేదు. ఇక ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఇండియా అభిప్రాయాన్ని పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో స్పష్టంగా తెలియజేశారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని పిలుపిచ్చారు. ఆయన వ్యాఖ్యలు- ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో దిల్లీ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందంటూ ఇన్నాళ్లూ విమర్శించిన పలువురు పాశ్చాత్య దేశాల విశ్లేషకుల నోళ్లకు తాళంవేశాయి. యుద్ధాన్ని వీడి ఆహార, ఇంధన, ఎరువుల కొరత సమస్యను పరిష్కరిద్దామంటూ రష్యా అధ్యక్షుడికి పిలుపిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు వార్తాఛానళ్లలో ప్రసారమయ్యాయి. దీంతో సమర్కండ్‌లో ఇండియా నిర్మాణాత్మక వైఖరిని ప్రదర్శించిందంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సహచర సభ్యదేశాలకు రవాణా సంబంధిత హక్కుల మంజూరులో కొన్ని దేశాలు సముచితంగా ప్రవర్తించడం లేదంటూ ప్రభాని పరోక్షంగా పాక్‌కు చురకలు అంటించారు. తృణధాన్యాల సాగు, వినియోగంతో ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చంటూ పరిష్కార మార్గం చూపారు. భారత్‌ అభివృద్ధి పథాన్ని వివరించారు. దేశంలో అంకుర పరిశ్రమలు విరాజిల్లుతున్న తీరును వివరిస్తూ, ఆ రంగంలో సభ్యదేశాలకు సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిని ప్రస్తావిస్తూ, భారత్‌తో మెరుగైన వాణిజ్య/ఆర్థిక సంబంధాలు కొనసాగించడం ఎంత ముఖ్యమో సభ్యదేశాలకు పరోక్షంగా తెలియజేశారు.

ఇరాన్‌ చేరిక కలిసొచ్చేనా?

ఎస్‌సీఓలో ఇరాన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వ హోదాను మంజూరు చేయడం తాజా సదస్సులో చోటుచేసుకున్న మరో కీలక పరిణామం. అఫ్గానిస్థాన్‌తోపాటు మధ్య ఆసియా దేశాలకు భారత వాణిజ్య రవాణాకు ప్రస్తుతం పాక్‌ పెద్ద అడ్డంకిగా మారింది. ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవును సద్వినియోగం చేసుకోగలిగితే, పాక్‌తో సంబంధం లేకుండా ఆయా దేశాలను చేరుకోవచ్చు. అమెరికా ఆంక్షల కారణంగా తమ నుంచి నిలిపివేసిన చమురు కొనుగోళ్లను భారత్‌ కొనసాగించాలని ఇరాన్‌ కోరుకుంటోంది. ఎస్‌సీఓ సభ్యదేశంగా చేరడం అందుకు కలిసివస్తుందని భావిస్తోంది. సమర్కండ్‌ సదస్సు అనంతరం ఎస్‌సీఓ అధ్యక్ష స్థానాన్ని ఇండియా అధిష్ఠించింది. వచ్చే ఏడాది దిల్లీలో తదుపరి శిఖరాగ్ర సదస్సు జరగనుంది. గల్వాన్‌ ఘర్షణల అనంతరం తొలిసారిగా సమర్కండ్‌లో ఒకే వేదికను పంచుకున్న మోదీ, జిన్‌పింగ్‌ ఒకరినొకరు కనీసం పలకరించుకోలేదు. పాక్‌తోనూ భారత్‌ సంబంధాల్లో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఎస్‌సీఓను ముందుకు తీసుకెళ్ళడంలో ఆ రెండు దేశాలు అధ్యక్ష పీఠంపై ఉన్న ఇండియాకు ఎంతమేరకు సహకరిస్తాయన్నది ప్రశ్నార్థకమే. అయితే అధ్యక్ష బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల దౌత్యనీతి, సభ్యదేశాలతో అనుసంధానతను మరింత మెరుగుపరచుకోగల సత్తా ఇండియాకు ఉందనడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.

ఇండియాకు దక్కిన ప్రాధాన్యం

ఎస్‌సీఓ ఉమ్మడి ప్రకటనలో భారత్‌ లేవనెత్తిన అంశాలకు అందులో తగిన ప్రాధాన్యం దక్కింది. పర్యావరణ మార్పులు, ఆహార, ఇంధన భద్రతతోపాటు పటిష్ఠ అంతర్జాతీయ సరఫరా గొలుసుల ఏర్పాటు ఆవశ్యకతను ప్రస్తావించారు. సభ్యదేశాల మధ్య సమర్థ ఆర్థిక, రవాణా నడవాలను నిర్మించుకోవాలని ఎస్‌సీఓ తీర్మానించింది. పర్యాటక రంగంలో అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఎస్‌సీఓ తొలి పర్యాటక, సాంస్కృతిక రాజధానిగా వారణాసిని గుర్తించడమూ హర్షణీయం. సభ్యదేశాల్లో విధ్వంసం సృష్టిస్తున్న నిషేధిత ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద సంస్థల ఏకీకృత జాబితాను తయారుచేసేందుకు కూటమి అంగీకరించింది. ఈ విషయంలో బీజింగ్‌, ఇస్లామాబాద్‌ ఎంతమేరకు పారదర్శకంగా వ్యవహరిస్తాయనేది సందేహమే. భారత్‌ చొరవతో- పర్యావరణంలో ప్రతికూల మార్పులపై పోరుకు ఎస్‌సీఓ ప్రత్యేక తీర్మానం చేసింది.

- నవీన్‌కుమార్‌ గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మానవ హక్కులను కాలరాస్తున్న చైనా

‣ స్వేచ్ఛాహననంపై ఆగ్రహజ్వాల

‣ సాగుభూమికి రసాయనాల ముప్పు

‣ మనోవర్తి... గౌరవ జీవన హక్కు!

Posted Date: 27-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం