• facebook
  • whatsapp
  • telegram

నాగాలతో సయోధ్య మంత్రం

నాగాలాండ్‌లో వేర్పాటువాదాన్ని తాత్కాలికంగానైనా చల్లబరచకుండా వచ్చే ఏడాది సజావుగా ఎన్నికలు నిర్వహించడం కష్టమే. ఈ నేపథ్యంలో నాగా వేర్పాటువాదులతో కొద్ది రోజుల క్రితం కేంద్రం చర్చలు ప్రారంభించింది. డిసెంబరులోగా ఒక ఒప్పందానికి రావాలనే లక్ష్యంతో ఇవి సాగుతున్నాయి.

భారత్‌లో అత్యంత పురాతన వేర్పాటువాద పోరాటాల్లో ‘నాగా ఉద్యమం’ ఒకటి. నాగా వేర్పాటువాదంలో త్యుంగలెంగ్‌ ముయివా, ఇసాక్‌ల నేతృత్వంలోని నేషనలిస్టు సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌ ఐ-ఎం), ఖాప్లాంగ్‌ వర్గంగా పేర్కొనే ఎన్‌ఎస్‌సీఎన్‌(కె) సంస్థలే అతి పెద్దవి. ఈ రెండు ఎన్‌ఎస్‌సీఎన్‌ గ్రూపులు 1997లో కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొన్నాయి. తరవాత ఎన్‌ఎస్‌సీఎన్‌(కె) వైదొలగింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ఈశాన్య భారత్‌లో కొంతమేర శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. 2015లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వీరితో శాంతి ఒప్పందం చేసుకొంది. ఇది ఈశాన్య భారత్‌లో ఉద్రిక్తతలను చల్లార్చడానికి దోహదపడింది.

జెండాయే అజెండా

1997 కాల్పుల విరమణ ఒప్పందానికి ఈ ఏడాది ఆగస్టులో 25 ఏళ్లు నిండాయి. అప్పట్నుంచి దాదాపు 80 విడతల చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ జరిగి పాతికేళ్లు గడుస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐ-ఎం) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో నాగాలాండ్‌ మాజీ ముఖ్యమంత్రి, మితవాద నేత ఎస్‌.సి.జమీర్‌ సైతం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. నాగాల డిమాండ్లలో కీలకమైన ప్రత్యేక జెండా, రాజ్యాంగం వంటి అంశాలను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. వేర్పాటువాదం తల్లివేరు ప్రత్యేక జెండా, రాజ్యాంగం వంటి అంశాల్లోనే ఇమిడి ఉందని భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2015 నాటి ఒప్పందంలోనూ ఈ అంశాల ప్రస్తావన లేదు. ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐ-ఎం) మాత్రం ఈ అంశాలను తుది ఒప్పందంలో చేర్చాలని పట్టు పడుతోంది. కేవలం ప్రభుత్వేతర కార్యక్రమాలకు మాత్రమే ఆ జెండాను అనుమతించే అంశం మాత్రం కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో నాగాలు నివసించే ప్రాంతాలను కలిపి కోరుతున్న ‘నాగాలిమ్‌’ (గ్రేటర్‌ నాగాలాండ్‌) డిమాండ్‌ కూడా ఇబ్బందికరమే. ప్రభుత్వానికి సమాంతర పాలన నిర్వహిస్తున్న నాగా గ్రూపులు బలవంతపు వసూళ్లకు పాల్పడటం, పన్నులు విధిస్తుండటం- సామాన్య ప్రజలు, వ్యాపారులకు సమస్యగా పరిణమించింది. దీంతోపాటు ఆయా గ్రూప్‌లు ఆదాయం కోసం డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా చేపట్టడం ఈశాన్య భారత్‌ భద్రతకే ముప్పుగా పరిణమిస్తోంది. మరోవైపు, చైనాలో నక్కిన ఎన్‌ఎస్‌సీఎన్‌(ఐ-ఎం) సాయుధ విభాగం నేత షిమ్రా వంటి వారిని భారత్‌కు రప్పించాల్సి ఉంది. ఇవన్నీ నాగాలాండ్‌ అంశంలో ముడివడి ఉన్న సమస్యలు.

గతంలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించిన ఆర్‌.ఎన్‌.రవి- వివిధ నాగా గ్రూపులతో పాటు ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐ-ఎం)తోనూ సమాంతరంగా చర్చలు జరిపారు. నాగా గ్రూపుల్లో విభేదాలు తీసుకొచ్చేందుకే ఇలా చర్చలు జరిపారనే విమర్శలున్నాయి. ఈ పరిణామం అతిపెద్ద గ్రూప్‌ అయిన ముయివా వర్గానికి ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి ముయివా మణిపుర్‌ నాగా జాతికి చెందిన నేత. దీంతో తమ ఉద్యమాన్ని మణిపుర్‌ వ్యక్తి హైజాక్‌ చేస్తున్నారన్న భావన ఇతర నాగాలాండ్‌ గ్రూపుల్లో తీసుకొచ్చేలా చేసిన ప్రయత్నంగా ముయివా అనుమానిస్తున్నారు. రవి తరవాత ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన ఏకే మిశ్రా 2015 ఒప్పందంలోని కీలక అంశాలను విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నాగా రాజకీయ అంశాలపై ఏర్పాటైన 22 మంది సభ్యులతో కూడిన బృందం- ముయివా వర్గంలో నెలకొన్న అసంతృప్తిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మల దృష్టికి తీసుకొచ్చింది. 2015 ఒప్పందంలోని ‘సార్వభౌమత్వాన్ని పంచుకోవడం’ వంటి పదాలను ముయివా వర్గం వేర్పాటువాదానికి అనుకూలంగా అన్వయించుకొంటోంది.

శాంతి స్థాపనే కీలకం

మరోవైపు ఏడు నాగా వర్గాలతో ఏర్పాటైన నాగా జాతీయ రాజకీయ బృందం (ఎన్‌ఎన్‌పీజీ) అసెంబ్లీ ఎన్నికలకు ముందే సమస్యకు పరిష్కారం లభించాలని కోరుకుంటోంది. కేంద్రంతో చర్చలు జరుపుతున్న బృందాల్లో ఇది కూడా ఉంది. చర్చల్లో పురోగతి మందకొడిగా ఉండటంతో, ఒప్పందం కుదరకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక జెండా, రాజ్యాంగాలనే కేంద్రం పక్కన పెట్టిన నేపథ్యంలో వాటిని ఎంత మేరకు ఆమోదిస్తుందో నాగాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌ చేపట్టిన యాక్ట్‌ ఈస్ట్‌ విధానం మరింత వేగంగా పురోగతి సాధించాలంటే ఈశాన్య భారత్‌లో శాంతిని స్థాపించడం చాలా అవసరం. ఇందుకు అన్ని వర్గాలూ కలిసి రావాలి.

- ఫణికిరణ్‌

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ - ఇటలీ స్నేహబంధం

‣ వాతావరణ మార్పులు.. జనజీవనం తలకిందులు

‣ ఇరకాటంలో గుజరాత్‌ సర్కారు

‣ సేంద్రియ సేద్యం... భూసారం పదిలం!

‣ సమస్యల ఊబిలో అన్నదాత

‣ రైతుల ఆర్థికాభివృద్ధికి మార్గం

‣ సమర్కండ్‌లో భారత్‌ సహకార నినాదం

Posted Date: 01-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం