• facebook
  • whatsapp
  • telegram

ఉక్రెయిన్‌పై యుద్ధంలో భారత్‌ ఎటు?

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర పట్ల భారత్‌ విలక్షణ వైఖరి కనబరుస్తోంది. ఈ విషయంలో ప్రధాన ప్రజాస్వామ్య దేశాలు, వ్యూహపరంగా అమెరికాతో కలిసినడుస్తున్న దేశాలు స్పందిస్తున్న తీరుకు ఇండియా దృక్పథం భిన్నంగా ఉంటోంది. రష్యా ప్రారంభించిన యుద్ధంతో తనకు ఇబ్బందులు ఉన్నా, తటస్థ వైఖరినే అవలంబిస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. నిరుడు ఫిబ్రవరి 24న ఈ దండయాత్ర మొదలైనప్పుడు భారత్‌ వేగంగా స్పందించి ఉక్రెయిన్‌కు మానవతా దృక్పథంతో మందులు తదితర సహాయ సామగ్రిని పంపింది. కానీ, రష్యా చర్యను ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో ఖండించే తీర్మానాలపై చేపట్టిన ఓటింగ్‌లో మాత్రం పాల్గొనలేదు. ఐరాస భద్రతా మండలిలో, సర్వప్రతినిధి సభలో, మానవ హక్కుల మండలిలో రష్యాను ఖండించిన తీర్మానాలకు దూరంగానే ఉండిపోయింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రష్యాయే కారణమని నిందించడానికి భారత్‌ నిరాకరిస్తోంది. దీంతో ఇండియా రష్యాను సమర్థిస్తోందనే భావన తలెత్తడానికి ఆస్కారం ఏర్పడింది. భారత వైఖరి అమెరికాకు, ఐరోపాలోని నాటో దేశాలకు నచ్చడంలేదు. ఈ వైఖరి ఉత్తరోత్రా భారత్‌కే నష్టదాయకం అవుతుందని అంటున్నాయి. కానీ, ఇండియా మొదటినుంచీ రష్యా పట్ల సంయమనం పాటిస్తోంది. రష్యా 1956లో హంగరీపైన, 1968లో చెకొస్లొవేకియాపై, 1979లో అఫ్గానిస్థాన్‌పైన దండయాత్రలు చేసినప్పుడూ భారత్‌ మౌనమే పాటించింది. ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడవలసి రావడమే దీనికి ప్రధాన కారణం. 2011 నుంచి 2021 వరకు భారత ఆయుధ దిగుమతుల్లో    60 శాతం రష్యా నుంచే వచ్చాయని స్టాక్‌హోమ్‌ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) లెక్కగట్టింది. దీనికితోడు క్లిష్ట సమయాల్లో భారత్‌కు రష్యా పెద్ద అండగా నిలిచింది. ఆ ఉపకారాన్ని భారతీయులు ఎన్నటికీ మరచిపోరు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలూ బలీయమైనవే.

నిజమైన నేస్తం రష్యా

జమ్మూకశ్మీర్‌ తన అంతర్భాగమని భారత్‌ ఘోషించినప్పుడు అమెరికా, బ్రిటన్‌, ఇతర పాశ్చాత్య దేశాలు మద్దతు ఇవ్వకపోగా వ్యతిరేకించాయి. 1955లో సోవియట్‌ నేత నికితా కృశ్చెవ్‌ బహిరంగంగా కశ్మీర్‌పై భారత్‌ విధానాన్ని సమర్థించారు. ఐరాస భద్రతామండలిలో భారత్‌కు మద్దతుగా రష్యా ఆరుసార్లు వీటో అస్త్రాన్ని ప్రయోగించింది. అవసరమైతే భవిష్యత్తులోనూ ప్రయోగిస్తుంది. అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)ల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యా నుంచి చమురును కొనడంలో చైనా తరవాతి స్థానం ఇండియాదే. చమురు ఎగుమతులే రష్యాకు ప్రధాన ఆదాయ వనరు. అదే ఆ దేశ ఎగుమతుల్లో సింహభాగం. చమురు ధరలపై పరిమితి విధించి ఆదాయాన్ని తెగ్గోయడం ద్వారా రష్యాను లొంగదీయాలని అమెరికా, ఈయూలు లక్షిస్తున్నాయి. కానీ, భారత్‌ ఇందుకు కలిసిరావడం లేదు. చమురు లేకుంటే భారత ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుంది. బారెల్‌ చమురును 60 డాలర్లకే విక్రయించాలని అమెరికా, ఈయూలు పరిమితి విధించగా- భారత్‌ అంతకన్నా తక్కువ ధరకే టన్నుల కొద్దీ చమురును రష్యా నుంచి కొనుగోలు చేయగలిగింది. దీంతోపాటు ఆ దేశం నుంచి ఎరువుల దిగుమతులను ఎనిమిది రెట్లు పెంచుకుంది. కార్లు, విమానాలు, రైళ్ల విడిభాగాలతోపాటు మొత్తం 500 రకాల వస్తువులను సరఫరా చేయవలసిందిగా రష్యా గతనెలలో భారత్‌కు ఆర్డరు పెట్టింది. ఆంక్షల వల్ల స్తంభించిపోయిన రష్యా పరిశ్రమలకు, సూపర్‌ మార్కెట్లకు భారత వస్తువులు మళ్ళీ ఊపు తెస్తాయి. మరిన్ని వస్తువులను రష్యా మార్కెట్లకు సరఫరా చేసేందుకు అనుమతించాలని భారత్‌ పెద్ద జాబితాను పంపింది. 2021లో భారత్‌-రష్యాల మధ్య 1,360 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా, 2022లో జులై నాటికే 1,100 కోట్ల డాలర్ల వ్యాపారం చోటుచేసుకుంది. 2025 కల్లా రెండు దేశాల వాణిజ్యాన్ని 3,000 కోట్ల డాలర్లకు పెంచాలని లక్షిస్తున్నారు. ప్రస్తుతం రష్యా నుంచి దిగుమతులే ఎక్కువగా ఉండటంతో ఎగుమతులను పెంచి వాణిజ్య సమతూకం సాధించాలని భారత్‌ ఆశిస్తోంది.

రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతి చేసుకోవడాన్ని ఉక్రెయిన్‌ మొదట్లో వ్యతిరేకించినా క్రమంగా దౌత్యం, సంప్రతింపుల బాటకు వచ్చింది. డిసెంబరు చివరి వారంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడి, తన శాంతి సూత్రానికి మద్దతు కోరారు. మోదీ మొదటినుంచీ ఉభయ దేశాలు కాల్పులను విరమించి చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని పిలుపిస్తున్నారు. ఇటీవల ఉక్రెయిన్‌ భారత్‌కు 37,500 టన్నుల వంటనూనెను ఎగుమతి చేసింది. భారత తటస్థ విధానం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నచ్చకపోయినా ఇండో-పసిఫిక్‌లో చైనా దూకుడును అడ్డుకోవడానికి భారత్‌ సహకారం అవసరం కాబట్టి సర్దుకుపోతున్నారు.

శాంతి చర్చలకు అవకాశాలు

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేట్లు కనిపించడంలేదు. కానీ, ఉభయ దేశాల నడుమ శాంతి చర్చలు జరిగే అవకాశాలు మాత్రం పెరుగుతున్నాయి. యుద్ధ నేరాల ట్రైబ్యునల్‌ ఎదుట రష్యా విచారణను ఎదుర్కోవాలని, తూర్పు ఉక్రెయిన్‌లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ జెలెన్‌స్కీ ఇటీవల ఒక శాంతి ఫార్ములాను ముందుకుతెచ్చారు. రష్యా దానికి సమ్మతించే ప్రసక్తి లేదు. రెండు పక్షాలకూ సర్దిచెప్పి శాంతి చర్చలకు ఒప్పించడం అంత తేలిక కాదు. ఈ పరిస్థితుల్లో అటు రష్యాకూ ఇటు ఉక్రెయిన్‌, అమెరికా, నాటో దేశాలకూ మిత్రదేశమైన భారత్‌ కీలక మధ్యవర్తిగా నిలిచే అవకాశం ఉంది. డిసెంబరులో భారత్‌ జీ20 అధ్యక్షతను చేపట్టిన దరిమిలా ఈ పాత్ర పోషణకు సిద్ధం కావాలని అమెరికా కూటమి మోదీని కోరవచ్చు. ఉక్రెయిన్‌ చర్చలకు అంగీకరిస్తే, రష్యానూ అందుకు ఒప్పించాల్సిందిగా భారత్‌కు విజ్ఞప్తి చేయవచ్చు. ఇలా మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధాన్ని ముగించగలిగితే శాంతి దూతగా తనకున్న పేరును భారత్‌ సార్థకం చేసుకొంటుంది.

పొరుగు నుంచి చీకాకులు

సైనికపరంగా చైనా, పాకిస్థాన్‌ల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారత్‌కు రష్యా అండదండలు ఎంతో ముఖ్యం. రష్యాకు భారత్‌ దూరమైతే చైనా, పాక్‌లకు రష్యా దగ్గరయ్యే అవకాశముంది. అది భారత ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదు. ఇటువంటి సమీకరణను నివారించాలంటే రష్యాతో మైత్రిని వదులుకోకూడదు. ఉక్రెయిన్‌ యుద్ధం తరవాత రష్యా, చైనాల బంధం మరింత బలీయమవుతోందనే అంచనాలు విస్మరించరానివి. పాక్‌, చైనాలు రష్యాతో సన్నిహిత సంబంధాలను ఆకాంక్షిస్తున్నాయి. తన శాశ్వత ప్రత్యర్థులైన ఈ రెండు ఇరుగుపొరుగు  దేశాలను కట్టడిచేయడానికి రష్యా సహకారం భారత్‌కు ఎంతో అవసరం. అందుకే అంతర్జాతీయ వేదికలపై రష్యాను ఖండించేందుకు భారత్‌ విముఖత చూపుతోంది. రష్యా-చైనా, రష్యా-పాకిస్థాన్ల ఆలింగనాలను నివారించడం భారత్‌కు సైనికపరంగా చాలా అవసరం.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈశాన్యంలో కొత్త కాంతులు

‣ సిరిధాన్యాలతో ఆహార భద్రత

‣ డ్రోన్‌ సాంకేతికతతో మార్కెట్‌కు రెక్కలు

‣ అనిశ్చితి నామ సంవత్సరానికి తెర

Posted Date: 07-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం