• facebook
  • whatsapp
  • telegram

ఆర్మీనియాతో ఉభయతారక బంధం

పాక్‌, అజర్‌బైజాన్‌, తుర్కియేల స్వార్థపూరిత కుయుక్తులను భారత్‌ తనదైన చాణక్యంతో ఎదుర్కొంటోంది. అందులో భాగంగా ఆర్మీనియాతో సంబంధాలను పటిష్ఠం చేసుకుంటోంది. నగోర్నో కారబాఖ్‌ ప్రాంతం విషయంలో ఇండియా ఆ దేశం వైపు మొగ్గింది. సరకుల రవాణాతో పాటు ఉగ్ర మిన్నాగుల చొరబాట్లను అడ్డుకోవడంలోనూ ఆర్మీనియాతో దోస్తీ అక్కరకొస్తుంది.

రాబోయే మూడేళ్లలో భారత్‌ ఫోర్జ్‌ కంపెనీ నుంచి 155 ఎంఎం హొవిట్జర్‌ శతఘ్నులను కొనుగోలు చేయడానికి ఆర్మీనియా గత నవంబరులో రూ.1,200 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రెండు దేశాల సంబంధాలను మరింత పటిష్ఠ పరుస్తోంది. 2020లో అజర్‌బైజాన్‌, ఆర్మీనియాల మధ్య పోరాటం సాగుతున్నప్పుడు భారత్‌ స్వాతి రాడార్లను ఆర్మీనియాకు విక్రయించింది. శత్రు దేశ ఫిరంగులు, ఇతర ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో స్వాతి రాడార్లు కనిపెట్టగలవు. ఏకకాలంలో అనేక రాకెట్లను ప్రయోగించే పినాక లాంచర్లు, ట్యాంకు విధ్వంసక క్షిపణులు, మందుగుండును సైతం కొనడానికి భారత్‌తో ఆర్మీనియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా డ్రోన్లతో పాటు, శత్రు డ్రోన్లను కూల్చే ఆయుధాలు, గగనతల అస్త్రాలు, మధ్య శ్రేణి ఆకాశ్‌ క్షిపణులనూ భారత్‌ నుంచి సముపార్జించుకోవాలని ఆర్మీనియా యోచిస్తోంది.

భౌగోళికంగా ఒకదానికొకటి చాలా దూరంలో ఉన్నా ఆర్మీనియాతో భారత్‌, అజర్‌ బైజాన్‌తో పాకిస్థాన్‌ సంబంధాలు బలపడుతున్నాయి. నిరుడు సంతకాలు జరిగిన ‘బాకు’ ప్రకటనలో అజర్‌బైజాన్‌, తుర్కియేలు జమ్మూకశ్మీర్‌ సమస్యపై పాకిస్థాన్‌ వాదాన్ని బలపరచాలని నిశ్చయించాయి. తదనుగుణంగా భారత్‌ 370వ రాజ్యాంగ అధికరణను రద్దు చేయడాన్ని తుర్కియే ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై ఖండిస్తోంది. దానికి ప్రతిగా జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని ఆర్మీనియా సమర్థిస్తోంది. నగోర్నో కారబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం కోసం అజర్‌బైజాన్‌, ఆర్మీనియాల మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. ఇందులో భారత్‌ ఆర్మీనియావైపు మొగ్గింది. తద్వారా అజర్‌బైజాన్‌, తుర్కియే, పాకిస్థాన్‌ కూటమి కుయుక్తులకు ఇండియా దీటైన బదులు ఇచ్చినట్లయింది. ముఖ్యంగా టర్కిక్‌ సామ్రాజ్య పునరుద్ధరణ కోసం కలలు కంటున్న తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌కు ఇది మింగుడు పడని విషయమే. నల్ల సముద్రం నుంచి కాస్పియన్‌ సముద్రం వరకూ ఏర్పాటు చేయాలనుకొంటున్న టర్కిక్‌ సామ్రాజ్యంలో ఆర్మీనియా, అజర్‌బైజాన్‌, జార్జియా, దక్షిణ రష్యాలో కొన్ని ప్రాంతాలు అంతర్భాగాలు అవుతాయి. ఎర్డొగాన్‌ విస్తరణ స్వప్నం యూరేసియాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించినా ఆశ్చర్యం లేదు. అందుకే జమ్మూకశ్మీర్‌ పట్ల తన వైఖరి మార్చుకోవాలని తుర్కియేను హెచ్చరించడానికి ఆర్మీనియాకు భారత్‌ ఆయుధాలు అందిస్తోంది.

ఇండియా నుంచి సరకులు, సిబ్బంది అఫ్గానిస్థాన్‌, మధ్యాసియా రిపబ్లిక్‌లను చేరుకోవాలంటే ప్రస్తుతం పాక్‌ భూభాగం గుండానే వెళ్ళాలి. దాయాది దేశం అందుకు మోకాలడ్డుతోంది. దానికి ప్రత్యామ్నాయంగా భారత్‌ అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్‌ నిర్మాణాన్ని బలపరుస్తోంది. ఇరాన్‌ ముందుకు తెచ్చిన నల్ల సముద్రం-పర్షియన్‌ సింధు శాఖ రవాణా కారిడార్‌కూ భారత్‌ మద్దతు ఇస్తోంది. ఇరాన్‌ ప్రతిపాదిస్తున్న రవాణా మార్గానికి ఆర్మీనియా కీలకమవుతుంది. అది నల్ల సముద్రం, కాస్పియన్‌ సముద్రాల మధ్యనున్న దేశమని ఇక్కడ గమనించాలి. ఈ మార్గంలో తమ సరకులను పర్షియన్‌ సింధు శాఖ నుంచి ఆర్మీనియాకు అక్కడి నుంచి రష్యా, ఐరోపాలకు ఎగుమతి చేయడం భారత్‌, ఇరాన్‌లకు సులువు అవుతుంది. ఆర్మీనియా సైతం అదే మార్గంలో ఇరాన్‌, భారత్‌లతో వాణిజ్యాన్ని వృద్ధి చేసుకోగలుగుతుంది. వ్యవసాయం, ఔషధాలు, సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక రంగాలలో భారత్‌, ఆర్మీనియా సహకారానికి అవకాశాలు పెరుగుతాయి. చైనా నిర్మిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకానికి ఆ రెండు రవాణా కారిడార్లు ప్రత్యామ్నాయమవుతాయి. అందుకు ఆర్మీనియా కీలకమవుతుంది.

ఆర్మీనియా భూభాగాల ఆక్రమణలవల్ల తుర్కియే మిత్రదేశాలకు, చైనాకు మరింత చేరువ కావచ్చునని అజర్‌బైజాన్‌ పథకం వేసింది. దానివల్ల తుర్కియే, అజర్‌ బైజాన్‌లతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ ఆయుధాలు, ఉగ్రవాదులు కశ్మీర్‌కు చేరడం సులువు అవుతుంది. ఆ కుతంత్రాలను అడ్డుకోవడానికి ఆర్మీనియాతో రక్షణ, ఆర్థిక బంధాన్ని భారత్‌ బలపరచుకొంటోంది. ఇరు దేశాలు అంతర్జాతీయ వేదికలపై ఉమ్మడి పంథాను అనుసరిస్తున్నాయి. గూఢచర్య సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకొంటే ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి అవకాశం లభిస్తుంది. తుర్కియే-అజర్‌ బైజాన్‌-పాకిస్థాన్‌ల పన్నాగాలను యూరేసియాలోనే అడ్డుకుంటే, దక్షిణాసియాలో వాటి ఆటలు సాగనివ్వకుండా నిరోధించడం భారత్‌కు సులువు అవుతుంది.

- బి.కె.కిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగు యాంత్రీకరణతో గిట్టుబాట

‣ అటు ఘర్షణలు... ఇటు వాణిజ్యం!

‣ పర్యావరణ మార్పుల సెగ

‣ ఉరుముతున్న అణు విలయం

Posted Date: 07-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం