• facebook
  • whatsapp
  • telegram

వ్యూహాత్మక ముందడుగే ఉపయుక్తం

కొవిడ్‌ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేశాయి. భారత పొరుగు దేశాలు మునుపెన్నడూ లేనంతటి సంక్షోభంలో మునిగాయి. చైనా కొవిడ్‌ కోరల్లో చిక్కుకోగా, పాకిస్థాన్‌ పీకల్లోతు అంతర్గత సమస్యల్లో మునిగింది. రాజకీయ అస్థిరత, ఆర్థిక బలహీనత, క్షీణిస్తున్న సామాజిక పరిస్థితులు శ్రీలంక, నేపాల్‌, మయన్మార్‌, అఫ్గానిస్థాన్‌లను ముంచెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ తన ఇరుగుపొరుగు దేశాల విషయంలో వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సిన అవసరం నెలకొంది.

ప్రస్తుతం భారత సరిహద్దుల వెంబడి పొరుగు దేశాల్లో నెలకొన్న భిన్న పరిస్థితులను విభిన్న దృక్కోణాల్లో నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు చైనా మునుపెన్నడూ లేనంతటి స్థాయిలో దేశీయంగా పలురకాల సమస్యలతో సతమతమవుతోంది. కొవిడ్‌ సృష్టించిన అల్లకల్లోలంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటిని చక్కదిద్దుకుంటూనే- ఉత్పత్తి కార్యకలాపాల్ని, సరఫరా గొలుసుల వ్యవస్థల్ని దెబ్బతినకుండా చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని, డ్రాగన్‌ విదేశాంగ నడతలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. సరిహద్దుల్లో గిల్లికజ్జాల విధానాన్ని కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు, పాకిస్థాన్‌ ఊహించని స్థాయిలో అన్నివైపుల నుంచి అంతర్గత సవాళ్లతో సతమతమవుతోంది. పెచ్చరిల్లిన ద్రవ్యోల్బణం, తినడానికి తిండీ కరవైన సంక్షోభం, ఉగ్రవాదులు రెచ్చిపోతుండటం, బలూచిస్థాన్‌లో ఉగ్రదాడులు, పీఓకేలో ఆందోళనలకు తోడు కొన్ని ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు తోడై పాక్‌ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌ ముంగిట ఉన్న అతిపెద్ద అవరోధం బలహీనమైన ఆర్థిక వ్యవస్థే. శ్రీలంక తరవాత పాక్‌దే అత్యంత దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థగా పేరుపొందుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దసంఖ్యలో ఉండే భారీ సైన్యం భారాన్ని మోస్తూనే- పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య మధ్య సమతౌల్యాన్ని సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్గతంగా పెచ్చరిల్లుతున్న ఉగ్రదాడుల్ని, వేర్పాటువాద ధోరణుల్ని ఎదుర్కొంటూనే భారత్‌తో విరోధ పరిస్థితుల్నీ కొనసాగించాల్సిన విపత్కర పరిస్థితిలో చిక్కుకుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఆర్థిక పరిస్థితులూ ఏమంత ఆశాజనకంగా లేవు. ఇప్పటికే కుప్పకూలిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దుస్థితి ప్రపంచానికి అనుభవంలోకి వచ్చింది. బంగ్లాదేశ్‌లో సైతం ఆర్థిక పరిస్థితి నివురుగప్పిన నిప్పులా సాగుతోంది. అదెప్పుడైనా, ఏ రూపంలోనైనా బద్దలుకావచ్చు. నేపాల్‌లో రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. ఆర్థిక పరిస్థితీ నిరాశాజనకంగానే ఉంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పట్టు మరింత పెరుగుతూ, పలువిషయాల్లో పాత ధోరణిలోకి మరలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మయన్మార్‌లో సైనిక పాలన కారణంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావం భారత ఈశాన్య రాష్ట్రాలపై పడుతోంది.

మౌలిక నిర్మాణాలకు అడ్డంకి

చైనాలో అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నా- ఆ దేశ పొరుగు విధానాలు, నడవడికలలో పెద్దగా మార్పులు ఉంటాయని ఆశించలేం. ఈ క్రమంలో భారత్‌ వ్యూహాత్మక ధోరణిని కొనసాగించాల్సి ఉంటుంది. మన సైన్యానికి సంబంధించిన ఉపకరణాలు, సామగ్రిలో అధిక భాగం పాతవే. అత్యాధునిక సాంకేతికత విస్తృతి కొద్దిమేరే ఉంది. కాలానుగుణంగా మార్పుచేర్పులు ఆశించినంత వేగంగా చోటుచేసుకోలేదనే భావించాలి. అలాగని, మెరుగైన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో పరిస్థితి మరీ నిరాశాజనకంగా లేదనేది సుస్పష్టం. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సొరంగాల నిర్మాణం గతంతో పోలిస్తే బాగా మెరుగైంది. పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే, ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగడం వంటి ఘటన వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో భారీ నిర్మాణ కార్యక్రమాలపై కొంతమేర ప్రతికూల ప్రభావాలనైతే చూపే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి పర్యావరణ సంబంధ ప్రతికూలతలు ప్రస్తుతం సాగిస్తున్న మౌలిక వసతుల నిర్మాణాల వేగాన్ని నెమ్మదింపజేయవచ్చు. అయితే, సైనిక శక్తి పరంగా చైనాదే పైచేయి అనుకున్నా,  ఎత్తయిన ప్రాంతాల్లో భారత సైన్యానికి ఉన్న పోరాట అనుభవం అధికమనే చెప్పుకోవాలి. సియాచిన్‌లోనే భారత సైన్యానికి ముప్ఫైఏళ్లకు మించిన కఠోర అనుభవం ఉన్న సంగతి మరచిపోకూడదు. క్షేత్రస్థాయిలో వాస్తవిక పోరాట అనుభవమే చాలా కీలకం.

సమష్టి శక్తి బలోపేతం

మన పొరుగు దేశాలు అనిశ్చితిలో ఉండిపోయినంత మాత్రాన పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నట్లు భావించకూడదని నిపుణుల విశ్లేషణ. ఇలాంటి పరిస్థితుల్లో మనతో కలిసి నడిచే దేశాలతో సమష్టి శక్తిని బలోపేతం చేసుకోవాలి. గణనీయ ఆర్థికవృద్ధితో సుస్థిర మార్గంలో సాగుతున్న దేశంగా మనకున్న పేరును ఉపయోగించుకుంటూ పరస్పర ప్రయోజనం కలిగించే సంబంధాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్ర విధానాన్ని కాపాడుకొంటూనే వ్యూహాత్మక సమతౌల్యాన్నీ కొనసాగించాలి. ప్రపంచ ఆకాంక్షలు కలిగిన ప్రాంతీయ శక్తిగా నిలవాలి. ప్రస్తుత ప్రపంచంలో దేశాల ప్రయోజనాలు, వాస్తవిక రాజకీయాలే ఆయా దేశాల అడుగుల్ని నిర్దేశిస్తాయి. ఇది పోటీ, సహకారం అనే రెండు భావనల మధ్య సంఘర్షణకు దారితీసే అవకాశం కొట్టిపారేయలేనిది. ఆరోగ్యకరమైన పోటీ ఎల్లప్పుడూ అర్థవంతమైన సహకారానికి దారితీస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలపై ఓ కన్నేసి ఉంచుతూనే, మన మనుగడ కోసం కఠినమైన పోటీ మధ్యే సొంత వ్యూహాల్ని రూపొందించుకోవాలి. ఇరుగుపొరుగులో సంక్లిష్ట పరిస్థితులు, పాలన లోపం కారణంగా ఆర్థిక వ్యవస్థలు విఫలమై, ప్రజారోగ్య వ్యవస్థలు బలహీనపడి- ఆహార కొరత, ప్రజాభద్రత కరవయ్యాయి. ఇలాంటి సమయంలో మానవీయ సహాయం, ఆపన్న హస్తాలే అవసరం. చుట్టుపక్కల దేశాల్లో నెలకొంటున్న పరిణామాలను భారత్‌ ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రజల సంక్షేమం కోణంలో ప్రాంతీయ విధివిధానాలు రూపొందించుకునేలా భారత్‌ ఈ సంక్షోభాల్ని వినియోగించుకోవాలి.

సమతౌల్య సాధన

పశ్చిమ తదితర దేశాలతో భారత్‌ స్నేహం ఆశావహ స్థితిలో కొనసాగుతోంది. చైనాతో పొంచి ఉన్న ముప్పు కారణంగా ఆయా దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయి. రష్యాతో సమీకరణాలు, సంబంధాల విషయంలో భారత్‌ సమతుల స్థితినే జాగ్రత్తగా కొనసాగిస్తోంది. ఎన్ని దేశాల నుంచి మనపై ఎంతమేర ఒత్తిడి వస్తున్నా, దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగెయ్యడమే ప్రథమ కర్తవ్యంగా భావించాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులను వేగవంతం చేయడానికి ఇదే మంచి తరుణంగా భావించాలి. మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ వంటి ప్రాంతీయ శక్తుల బాధ్యత పెరిగిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

- శ్రీనివాస్‌ దరెగోని
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

‣ తెలంగాణ బ‌డ్జెట్ 2023-24

‣ చేయూత దక్కని రైతన్న

‣ ఉపాధిలేని వృద్ధితో ఉపయోగమెంత?

‣ ప్రమాదంలో చిత్తడి నేలలు

‣ భారత్‌వైపు ఈజిప్టు చూపు

Posted Date: 07-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం