• facebook
  • whatsapp
  • telegram

సాగర వ్యూహం.. సరికొత్త బంధం!

ఆసియాలో పెరుగుతున్న డ్రాగన్‌ ఆధిపత్య ధోరణిని అడ్డుకొనేందుకు ప్రాంతీయంగా కొత్త సమీకరణలు అవసరమని భారత్‌ భావిస్తోంది. ఇలా ఏర్పాటయ్యే ఏ భాగస్వామ్యంలోనైనా ఇండొనేసియా కీలకంగా ఉండాలని ఆశిస్తోంది. జకార్తా సైతం సరిగ్గా ఇలాంటి ఆలోచనల్లోనే ఉంది. దక్షిణ చైనా సముద్రజలాల్లో తన ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తున్న చైనాను నిలువరించేందుకు భారత్‌ మద్దతును ఇండొనేసియా కోరుకుంటోంది.

భారత్‌ రూపొందించిన తిరుగులేని సూపర్‌ సోనిక్‌ క్షిపణి బ్రహ్మోస్‌ కొనుగోలుకు ఇండొనేసియా సిద్ధంగా ఉంది. రూ.1,635- 2,861 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరాయి. ఇది కార్యరూపం దాలిస్తే ఫిలిప్పీన్స్‌ తరవాత బ్రహ్మోస్‌ను కొనే రెండో ఆగ్నేయాసియా దేశం ఇండొనేసియానే అవుతుంది. వాటికి ఈ క్షిపణులను అందించడం భారత్‌కు కేవలం ఆయుధ విక్రయమే కాదు, హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనే వ్యూహం కూడా. ఈ ఉద్దేశంతోనే ఇండియా తన వైమానిక, నౌకా దళాలతో కూడిన పూర్తిస్థాయి సైనిక స్థావరాన్ని గ్రేట్‌ నికోబార్‌ ద్వీపంలో ఏర్పాటుచేసింది. ఇది ఇండొనేసియాకు 167 కిలోమీటర్ల దూరం!

బీజింగ్‌ కలవరం

హిందూ మహాసముద్రంలో ఇండొనేసియా, అండమాన్‌ దీవులది కీలక స్థానం. దక్షిణ చైనా సముద్రం నుంచి ఆఫ్రికాలోని జిబౌటి వరకు చైనా దూకుడును నిరోధించే వ్యూహాత్మక ప్రాంతంలో ఇవి ఉన్నాయి. అందుకే దిల్లీ, జకార్తాలు దగ్గరకావడం బీజింగ్‌కు ఆందోళనకరం. అదీగాక ఆసియా, ‘ఆసియాన్‌’ ఆర్థిక శక్తుల్లో ఇండొనేసియా ఒకటి. దీనికి దగ్గరయ్యేందుకు భారత్‌ ప్రయత్నిస్తున్న తరుణంలోనే- ఇండొనేసియాను బుట్టలో వేసుకొనేందుకు బీజింగ్‌ తన ఆర్థిక పరపతిని ఉపయోగిస్తోంది. ఇండొనేసియా-బీజింగ్‌ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 12,500 కోట్ల డాలర్లు. దిల్లీ-జకార్తా     ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 2500 కోట్ల డాలర్లే. ‘ఆసియాన్‌’ దేశాల్లో చైనా ఇంతవరకు ఎనిమిది పారిశ్రామిక పార్కులను నిర్మించగా, వాటిలో నాలుగు ఇండొనేసియాలోనే ఉన్నాయి. పైగా బీజింగ్‌ అక్కడ పెద్దయెత్తున పెట్టుబడులు పెడుతోంది. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుల జాబితాలో పాకిస్థాన్‌, కంబోడియా తరవాతి స్థానం ఇండొనేసియాదే. విద్యుత్‌ వాహన బ్యాటరీల తయారీకి ప్రధానమైన నికెల్‌, కోబాల్ట్‌ ఖనిజాలతో పాటు అల్యూమినియం ముడిఖనిజం, బాక్సైట్‌ నిల్వలు ఇండొనేసియాలో భారీగా ఉన్నాయి. వాటి తవ్వకాల్లో డ్రాగన్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. దక్షిణ కొరియా సంస్థలైన హ్యుందాయ్‌, ఎల్‌జీలతో కూడిన కన్సార్షియం ఇప్పటికే అక్కడ విద్యుత్‌ వాహనాల తయారీ కర్మాగారాన్ని నిర్మించింది. టెస్లా సైతం ఈవీ ప్లాంటు ఏర్పాటుకు ఇండొనేసియాతో చర్చలు జరుపుతోంది. ఇలాంటిచోట భారతీయ పెట్టుబడులు ఇప్పటివరకు స్థిరాస్తి, జౌళి రంగాలకే ఎక్కువగా పరిమితమయ్యాయి.

ఇండొనేసియా - చైనా వాణిజ్య బంధం దృఢంగా లేదనే చెప్పాలి. చైనా నిర్మించిన నికెల్‌ శుద్ధి కర్మాగారాల్లో పని పరిస్థితులపై ఇటీవల మొదలైన కార్మికుల ఆందోళనలు ఇరు దేశాల సంబంధాల్ని దెబ్బతీశాయి. బీజింగ్‌ పెట్టుబడులతో పాటే కార్మికుల్ని భారీగా తీసుకురావడంపై వ్యతిరేకత పెరుగుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఇరు దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. నాతూనా దీవుల్లో జకార్తా చేపట్టిన చమురు, గ్యాస్‌ అన్వేషణను నిలిపివేయాలని చైనా డిమాండ్‌ చేసింది. డ్రాగన్‌ తన పరిధిగా ప్రకటించుకునే ‘నైన్‌డ్యాష్‌ లైన్‌’ ఏకంగా ఇండొనేసియా ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి వచ్చింది. తూర్పు ఆసియాను భారత్‌, ఆఫ్రికాలతో కలిపే సముద్ర కేబుళ్ల విస్తరణ విషయంలో డ్రాగన్‌ జగడానికి దిగుతోంది. ఇలా సముద్రతలంపై ఇండొనేసియా సార్వభౌమాధికారాన్ని చైనా సవాలు చేస్తోంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ తీర్పుల్ని ఆ దేశం ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో చైనాను నిలువరించేందుకు ఇండొనేసియా తన సైన్యాన్ని, నావికా దళాన్ని బలోపేతం చేసుకుంటోంది.

ముందున్న అవకాశాలు

ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో తటస్థ దేశంగా ఉండాలన్నది ఇండొనేసియా ఆకాంక్ష. ఓవైపు చైనాతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పెంచుకుంటూనే, అమెరికా మిత్రదేశంగా ఉంటూ భారత్‌, ఆస్ట్రేలియాలతో సంబంధాలు కొనసాగిస్తోంది. ‘సముద్రశక్తి’ పేరిట భారత్‌తో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. జకార్తాకు భౌగోళికంగా, రాజకీయపరంగా భారత్‌ ఎంతో అవసరం. చైనా తరహాలో పెట్టుబడుల వ్యూహంతో జకార్తాను ఆకర్షించడం ఇండియాకు సాధ్యంకాదు. కానీ, ఇందుకు దౌత్య మార్గాలైతే ఉన్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పాటించాల్సిన నియమాల విషయంలో రెండు దేశాలవి ఒకే తరహా లక్ష్యాలు. డ్రాగన్‌కు వ్యతిరేకంగా ఆర్థిక, సైనిక భరోసా కల్పించేలా ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన బలమైన ప్రాంతీయ కూటమి ఏర్పాటుపై ఉభయ దేశాలకు ఆసక్తి ఉంది. ఈ దిశగా జరిగే చర్చలు భారత్‌-ఇండొనేసియా బంధాన్ని బలోపేతం చేస్తాయనడంలో సందేహం లేదు.

- సీహెచ్‌ మదన్‌ మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసా

‣ సౌరశక్తితో ఇంధన భద్రత

‣ శ్రామిక నైపుణ్యం.. దేశానికి వరం!

‣ అంగట్లో వ్యక్తిగత సమాచారం!

Posted Date: 12-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం