• facebook
  • whatsapp
  • telegram

సూడాన్‌ నుంచి.. ఆపరేషన్‌ కావేరి!

అంతర్యుద్ధ పీడిత సూడాన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 24న ప్రారంభించిన ‘ఆపరేషన్‌ కావేరి’ ముగిసింది. నౌకలు, విమానాల ద్వారా మొత్తం 3,862 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. భారత రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్న యువ సైన్యాధికారి ఎన్నో సవాళ్ల మధ్య దీన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

సూడాన్‌లో ప్రభుత్వం, పారామిలిటరీ దళాల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. పరస్పర కాల్పుల ధాటికి వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్‌ 15న ఈ ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా, ఆ మరుసటి రోజు నుంచే రాజధాని ఖార్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) మనవాళ్లను క్షేమంగా తరలించడానికి పథక రచన మొదలుపెట్టింది. ఏప్రిల్‌ 24న ఆరంభమైన తరలింపు ప్రక్రియ మే 5న విజయవంతంగా ముగిసింది.

అంతకుముందు సూడాన్‌లోని భారతీయుల్లో 80శాతం దాకా రాజధాని ఖార్టూమ్‌లో నివసిస్తుండగా, మిగిలినవారు ఇతర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్నారు. వారందర్నీ గుర్తించి, విమానాలు, నౌకల వద్దకు చేర్చడానికి ఎంబసీ పకడ్బందీ వ్యూహం చేపట్టింది. అంతర్యుద్ధం వల్ల రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ సూడాన్‌లోని భారతీయులను సంప్రదించి ఒక్కచోటుకు చేర్చడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకున్నారు. వారి ఫోన్‌ నంబర్లు, వారు ఉంటున్న ప్రదేశాలు వంటి వివరాలతో గూగుల్‌ స్ప్రెడ్‌షీట్‌ను తయారుచేశారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా ఆయా ప్రదేశాల్లో ఉన్న భారతీయులంతా వెంటనే స్పందించారు. మూడు రోజుల్లో మూడు వేలమంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఖార్టూమ్‌ వైశాల్యం 1010 చదరపు కిలోమీటర్లు. ఇక్కడున్న భారతీయులను బృందాలుగా విభజించారు. సాంకేతిక నైపుణ్యం కలిగిన వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆహారం, అత్యవసర మందులు, తాగునీరు నిల్వ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. రాయబార కార్యాలయంలో 24 గంటలు పనిచేసే వార్‌రూమ్‌ను ఏర్పాటుచేశారు. అలా భారత వాయుసేన 17సార్లు, నౌకాదళం అయిదు దఫాలుగా సూడాన్‌ నుంచి సౌదీ అరేబియాలోని జెద్దాకు భారతీయులను చేరవేశాయి. విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ జెద్దాకు చేరుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తొలుత విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి చేర్చాలని భావించారు. టర్కీ విమానంపై కాల్పులు జరగడంతో వ్యూహం మార్చారు. ఖార్టూమ్‌ నుంచి 850 కిలోమీటర్ల దూరంలోని పోర్ట్‌ ఆఫ్‌ సూడాన్‌ గుండా నౌకల ద్వారా వారిని తరలించాలని రాయబార కార్యాలయం నిర్ణయించింది. ఆ సమయంలో భారతీయులపై కాల్పులు జరపకుండా సూడాన్‌లోని ఉభయవర్గాల నుంచి అనుమతి తీసుకొంది. బస్సులతో తరలింపు మొదలుపెట్టిన తరవాత తొలివిడతలో వెళ్ళిన ప్రతి బస్సులో సాంకేతిక అనుభవం కలిగిన వ్యక్తిని బృంద నాయకుడిగా నియమించారు. వారు సంఘర్షణలు జరుగుతున్న, జరిగే అవకాశమున్న ప్రాంతాలతో పాటు ఆహారం, నీరు, ఇంధనం దొరికే ప్రాంతాల గూగుల్‌ లొకేషన్‌ మ్యాపులను ఫోన్‌ద్వారా ఎంబసీకి పంపేవారు. బస్సుల్లో తరలిస్తున్న భారతీయులందరికీ గుర్తింపు పత్రాలిచ్చి పోర్ట్‌ ఆఫ్‌ సూడాన్‌కు చేర్చారు. అక్కడి నుంచి భారత నౌకాదళం మనవారిని క్షేమంగా తరలించింది. మరికొందరు భారతీయులను తీసుకెళ్ళడానికి ఖార్టూమ్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని వాదీ సయ్యదినా విమానాశ్రయానికి భారత వాయుసేన సూపర్‌ హెర్కులిస్‌ రవాణా విమానాలను పంపింది. మనవాళ్లను అక్కడికి తీసుకెళుతున్న వాహన శ్రేణికి ఎంబసీలోని యువ సైన్యాధికారి స్వయంగా సారథ్యం వహించారు. విమానాశ్రయం చుట్టూ పోరాటం రేగుతున్నందువల్ల వాయుసేన విమానాలు దీపాలు లేకుండానే రాత్రిపూట దిగాయి. ప్రయాణికులు నైట్‌ గాగుల్స్‌ ధరించి క్రమశిక్షణగా ఒకరి తరవాత ఒకరుగా విమానాలు ఎక్కారు. సూడాన్‌ నుంచి స్వదేశానికి తీసుకొచ్చిన వారిలో కర్ణాటకకు చెందిన హక్కిపిక్కి తెగవారు ఉండటం- ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకొంది. పిట్టలు పట్టేవారిగా పిలిచే ఈ తెగవారు హైదరాబాద్‌ సమీపంలోని జలపల్లి తమ స్వస్థలమని చెబుతారు. సూడాన్‌ నుంచి కర్ణాటకలోని శివమొగ్గకు క్షేమంగా చేరుకున్న హక్కిపిక్కి ప్రజల్ని ప్రధాని మోదీ స్వయంగా కలిసి వారితో ముచ్చటించారు. ఈ పరిణామం శాసనసభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది.

- కైజర్‌ అడపా
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కారడవులపై గొడ్డలి వేటు

‣ ముసురుతున్న మాంద్యం మబ్బులు

‣ సమర్థ నిర్వహణతోనే జల సంరక్షణ

‣ పాక్‌ ఆర్థికం.. అతలాకుతలం!

‣ భూతాపంతో అకాల వర్షాలు

‣ కాలుష్యం కట్టడికి సహజ వాయువు

‣ సాగర వ్యూహం.. సరికొత్త బంధం!

Posted Date: 13-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం