• facebook
  • whatsapp
  • telegram

మాల్దీవులతో పటిష్ఠ బంధం

శ్రీలంక, పాకిస్థాన్‌లను అప్పుల ఊబిలో ముంచి ఆ దేశాల్లోని రేవులను చైనా స్వాధీనం చేసుకొంది. భారత్‌ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. పరస్పర సహకారమే ప్రాతిపదికగా మాల్దీవులతో దృఢ బంధాన్ని కోరుకుంటోంది. ఈ దిశగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకొంది.

భారత్‌, మాల్దీవుల బంధం మరింత బలోపేతమవుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల అక్కడ పర్యటించి రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకార వృద్ధికి అంగీకారం కుదుర్చుకున్నారు. ఉమ్మడిగా నౌకా, సైనిక అభ్యాసాలను నిర్వహించాలని రెండు దేశాలు నిశ్చయించాయి. 2021లో మాల్దీవులలో తీర రక్షణ దళ స్థావరం ఏర్పాటుకు అయిదు కోట్ల డాలర్ల రుణం ఇస్తానని భారత్‌ వాగ్దానం చేసింది. ‘ఏకతా హార్బర్‌’ పేరుతో చేపట్టనున్న ఈ నిర్మాణానికి రాజ్‌నాథ్‌, మాల్దీవుల రక్షణ మంత్రి మరియా దీదీలు శంకుస్థాపన చేశారు. ఇకపై మాల్దీవుల నౌకలు, బోట్లకు ఇక్కడే మరమ్మతులు చేపడతారు. భారత్‌ తరఫున పహరా బోటుతో పాటు దాడికి సేనలను దించే నౌకనూ రాజ్‌నాథ్‌ మాల్దీవులకు అందించారు.

చిరకాల సంబంధాలు

ఉభయ దేశాల మధ్య జాతి, భాష, సంస్కృతి, వాణిజ్యం వంటి అంశాల్లో చిరకాల సంబంధాలున్నాయి. 1965లో మాల్దీవులకు స్వాతంత్య్రం వచ్చిన తరవాత మొదట అధికారికంగా గుర్తించింది ఇండియాయే. రాజధాని మాలిలో 1972లోనే భారత రాయబార కార్యాలయం ఏర్పాటైంది. 1988లో అక్కడ తలెత్తిన తిరుగుబాటును అణచివేయడానికి భారత్‌ తోడ్పడింది. కానీ, 2013-18 మధ్య   యమీన్‌ ప్రభుత్వ హయాములో రెండు దేశాల సంబంధాలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. సోలీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరవాత సంబంధాలు మళ్ళీ గాడినపడ్డాయి. ప్రధాని మోదీ 2019   జూన్‌లో మాల్దీవులను సందర్శించారు. మాల్దీవుల్లో ఇస్లామిక్‌ తీవ్రవాదం పెచ్చుమీరుతోంది. హిందూ మహాసముద్రంలోని రవాణా మార్గాలకు మాల్దీవులు కూడలి స్థానంలో ఉన్నాయి. పశ్చిమాసియాలోని   ఏడెన్‌, హోర్ముజ్‌ సింధు శాఖల గుండా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే చమురు, సరకుల నౌకలు భారత్‌కు... మలక్కా జలసంధి గుండా జపాన్‌, ఆగ్నేయాసియా దేశాలకు పయనిస్తాయి. భారత చమురు దిగుమతుల్లో 80శాతం, సరకుల ఎగుమతి దిగుమతుల్లో 50శాతం ఈ మార్గం గుండానే జరుగుతున్నాయి. ఈ రవాణా మార్గం దెబ్బతినకుండా చూసుకోవడం భారత్‌కు చాలా అవసరం. చైనా సైతం తన సముద్ర వాణిజ్యాన్ని కాపాడుకోవడానికి మాల్దీవులు కీలకమని భావిస్తోంది. అందుకే పదేళ్లుగా ముందుజాగ్రత్త కార్యకలాపాల పేరిట ఏడెన్‌ సింధుశాఖకు యుద్ధనౌకలను పంపుతోంది. దక్షిణాసియాలో తాను చేపట్టిన ముత్యాల సరాల ప్రాజెక్టులో మాల్దీవులను ముఖ్యమైన ముత్యంగా బీజింగ్‌ పరిగణిస్తోంది. అక్కడ మౌలిక వసతులు, నౌకా స్థావరాల ఏర్పాటుకు నడుం కట్టింది. మాలికి 40 కిలోమీటర్ల దూరంలో చైనా జలాంతర్గామి స్థావరాన్ని నిర్మించి, అణు జలాంతర్గాములను, ఖండాంతర క్షిపణులను ఏర్పాటు చేయనుందని భావిస్తున్నారు. మాల్దీవులను స్థావరంగా చేసుకుని జిహాదీలు భారత్‌పై దాడులు చేసే ప్రమాదముంది. హిందూ మహాసముద్రంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఇస్లామిక్‌ తీవ్రవాదులు మాల్దీవులను ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ ఆయుధ డిపోలను ఏర్పాటుచేసి, తీవ్రవాదులను భారత్‌లోని కేరళ తదితర ప్రాంతాలకు పంపే కుట్ర జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో హిందూ మహాసముద్రంలో ప్రధానపాత్ర పోషించేందుకు భారత్‌ చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మాల్దీవులతో కలిసి సముద్ర దొంగలు, మాదకద్రవ్యాల రవాణా, చేపల అక్రమ వేటను అడ్డుకుంటోంది. కొవిడ్‌ సమయంలో భారత్‌ పెద్దయెత్తున టీకాలు, సామగ్రిని పంపి మాల్దీవులను ఆదుకొంది.

రక్షణ భాగస్వామ్యం

భారత్‌, మాల్దీవులు 2009, 2016 నాటి ఒప్పందాల ప్రకారం రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. మాల్దీవుల రక్షణ దళాలకు 70శాతం శిక్షణ సదుపాయాలను ఇండియాయే కల్పిస్తోంది. గత పదేళ్లలో అక్కడ 1400 మంది సైనికులకు శిక్షణ ఇచ్చింది. సముద్రంలో పటిష్ఠ నిఘా ద్వారా మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలాన్ని సంరక్షించడానికి భారత్‌ ఎలెక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) రాడార్లను అందించింది. 2009 నుంచి మాల్దీవులకు అండగా యుద్ధనౌకలు, విమానాలను ఇండియా పంపుతూనే ఉంది. మాల్దీవులలో పట్టు కోసం భారత్‌, చైనాలు పోటీపడుతున్నా- భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా దిల్లీదే పైచేయిగా ఉంది. దీన్ని నిలువరించేందుకు మాల్దీవుల ప్రతిపక్షాలను డ్రాగన్‌ దువ్వుతోంది. వాటి ద్వారా మాల్దీవుల నుంచి భారత్‌ను సాగనంపాలన్న నినాదాలు చేయిస్తోంది. ఈ ఏడాది మాల్దీవులలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నందువల్ల భారత్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బీజింగ్‌ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా?

‣ పేదల నెత్తిన పరోక్షభారం

‣ మానవాళికే సవాళ్లు

‣ రక్షణ ప్రాజెక్టుల నత్తనడక!

Posted Date: 13-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం