• facebook
  • whatsapp
  • telegram

బరి తెగిస్తున్న పాక్‌

సరిహద్దుల్లో రెచ్చిపోతున్న వైనం
 

సరిహద్దుల్లో పాక్‌ కుయుక్తులు, కవ్వింపులు మితిమీరుతున్నాయి. కొన్నేళ్లుగా చైనా అండ చూసుకుని అది మరింత పేట్రేగిపోతోంది. ఈ నెలలో వారం వ్యవధిలోనే ఆ దేశం ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంతో రెండు దుశ్చర్యలు చోటుచేసుకున్నాయి. ఎనిమిదో తేదీన జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌ వద్ద పాక్‌ ప్రేరేపిత చొరబాటుదారులు ముగ్గురు దేశంలోకి ప్రవేశించే క్రమంలో భారత బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికాధికారి సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగిన అయిదు రోజుల వ్యవధిలోనే మరో దుస్సాహసానికి పాక్‌ బరితెగించింది. 13న నియంత్రణ రేఖ వెంబడి గురేజ్‌ - ఉరి సెక్టార్ల మధ్య పాక్‌ సైన్యం మోర్టార్లు, ఇతర ఆయుధాలతో భారత సైనికులు, పౌర నివాసాలు లక్ష్యంగా దాడులకు తెగబడింది. ఈ ఘటనల్లో అయిదుగురు భద్రతా సిబ్బంది సహా 11 మంది బలయ్యారు. వెంటనే భారత సేనలు క్షిపణులు, శతఘ్నులతో పాక్‌ సేనలకు దీటుగా జవాబిచ్చాయి. ఎనిమిది మంది పాక్‌ సైనికులను హతమార్చాయి. ఈ ఏడాది నవంబరు 13 వరకు 3,800 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పొరుగు దేశం తూట్లు పొడిచిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. భారత్‌ నుంచి పాక్‌ వేరుపడిన తరవాత ఒకే సంవత్సరంలో ఇన్నిసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇదే తొలిసారి. పాక్‌ దుశ్చర్యలకు గత 30 ఏళ్లలో 5,412 మంది భారత సైనికులు మృతి చెందగా... భారత సైన్యం చేతుల్లో  పాక్‌ సైనికులతో సహా 25 వేల మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మన సేనలు మూడు వేల మంది చొరబాటుదారులను బందీలుగా పట్టుకోగా- 4,500 మంది  లొంగిపోయారు. ఏటా వందలు, వేల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుపెడుతున్నా దాయాది దేశం తన సైన్యం, ఐఎస్‌ఐల తోడ్పాటుతో ఉగ్ర కార్ఖానాలో కొత్తవారిని తయారుచేసి  పంపిస్తూనే ఉంది.  
 

ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్‌ను అస్థిరపరచేందుకు ఎప్పటికప్పుడు  ప్రయత్నిస్తున్న పాక్‌కు అనేక మార్లు చెంప చెళ్లుమనిపించినా తన దుష్ట వైఖరిని  విడనాడటం లేదు. పుల్వామా ఘటన ఖ్యాతి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కే దక్కుతుందని ఆ దేశ పార్లమెంటు సాక్షిగా అక్టోబరు నెలలో పాక్‌ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్‌ చౌదరి ప్రకటించడాన్ని యావత్‌ ప్రపంచం వీక్షించింది. ఇప్పటికీ తమ దేశంలో 30 వేల నుంచి 40 వేల మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారంటూ 2019 జులై 24న పాక్‌ ప్రధాని తన అమెరికా పర్యటనలో నిర్లజ్జగా ప్రకటించారు. 40 ఉగ్రవాద ముఠాలు పాక్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నాయనీ వెల్లడించారు. ఇదంతా గత పాలకుల పుణ్యమేనని, తమదీ ఉగ్ర బాధిత దేశమేనని సన్నాయినొక్కులు నొక్కారు. గతంలో పాక్‌ సైనికాధికారిగా, ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన పర్వేజ్‌ ముషారఫ్‌ సైతం కశ్మీర్‌లో భారత్‌తో పోరాడటానికి ఉగ్రశక్తులకు తమ బలగాలు మద్దతు ఇచ్చాయని బహిరంగంగానే ప్రకటించారు.
 

గడచిన పదేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌- మొత్తం బడ్జెట్లో 18 శాతం రక్షణ రంగానికే కేటాయిస్తూ భుజాలు చరచుకుంటోంది. ఇది పాక్‌ స్థూల  దేశీయోత్పత్తి(జీడీపీ)లో నాలుగు శాతం. కొన్నేళ్లుగా ఆ దేశానికి అన్నివిధాలా అండగా నిలుస్తున్న చైనా తన జీడీపీలో రక్షణకు కేటాయిస్తున్నది 1.9శాతం భారత్‌, అమెరికాలు బడ్జెట్లో రక్షణకు 15శాతం వరకు కేటాయిస్తున్నాయి. జీడీపీలో భారత్‌ 2.41శాతం, అమెరికా 3.2శాతం చొప్పున రక్షణరంగానికి వ్యయం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సౌదీఅరేబియా తన జీడీపీలో 8.8శాతం రక్షణకు కేటాయిస్తుండగా- తరవాతి స్థానం పాక్‌దే. తాము చేస్తున్న సైనిక సాయాన్ని పాక్‌ దుర్వినియోగం చేస్తోందని గ్రహించిన అమెరికా- ఆ దేశానికి పదేళ్లుగా సాయంలో కోతలు విధిస్తోంది. ఉగ్రవాదానికి పాక్‌ అండ ఏ స్థాయిలో ఉన్నదీ స్పష్టమవుతున్నా- అది భారత్‌కు శత్రువు అన్న ఏకైక కారణంతోనే చైనా దాంతో అంటకాగుతోంది. పాకిస్థాన్‌కు ఉన్న విదేశీ రుణాల్లో 18శాతం చైనా ఇచ్చినవే ఉన్నాయంటే వాటి బంధం ఏ స్థాయిలో ఉందో బోధపడుతుంది. ఒకప్పుడు ఆయుధాల కోసం అమెరికాపై ఆధారపడిన పాకిస్థాన్‌ నేడు 73శాతం దాకా చైనా నుంచే కొనుగోలు చేస్తోంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో పోరాడుతున్న మన దేశానికి ఇప్పుడు డ్రాగన్‌ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఈ రెండు దేశాలతో పోరాడటానికి భారత్‌ రక్షణపరంగానే కాకుండా... దౌత్య మార్గాల్లోనూ మరింతగా ప్రపంచం మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంది.
 

- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు
 

Posted Date: 23-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం