• facebook
  • whatsapp
  • telegram

ఆహార భద్రతకు కొత్తరూపు

ఆకలితో అలమటించే వారికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఏనాడో 1945 జనవరినుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) వేరూనుకొన్న ఇండియాలో బడుగు జీవుల ఆహార భద్రతా సాధనంగా అది పూర్తి స్థాయిలో అక్కరకొస్తోందా అన్న ప్రశ్నకు- లేదు లేదన్నదే సమాధానం! పీడీఎస్‌లో అవినీతి గాదెకింద పందికొక్కులా మారి నిరుపేదల కడుపు కొట్టడంతోపాటు ఏటా వేలకోట్ల రూపాయల విలువైన ఆహారాన్ని స్వాహా చేస్తున్న నేపథ్యంలో- లబ్ధిదారుల వేలిముద్రలు, ఐరిస్‌ సాంకేతికత వినియోగం ద్వారా అక్రమాలను అరికట్టే యత్నాలు మొదలయ్యాయి. వాటికి ఆధార్‌ సాంకేతికతను అనుసంధానించి ‘ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు’ పథకాన్ని ప్రారంభించిన మోదీ ప్రభుత్వం, వలస శ్రామికులు తామెక్కడ ఉంటే అక్కడే రేషన్‌ తీసుకోగల అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. నిరుడు ఆగస్టునుంచి నాలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ విధానం మొన్న సెప్టెంబరునుంచి 68.8 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనకరమయ్యేలా 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులోకి వచ్చిందని కేంద్రం తాజాగా ప్రకటించింది. నేటికీ ముందు వెనకలాడుతున్న తమిళనాడు, పశ్చిమ్‌బంగ, ఛత్తీస్‌గఢ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోమ్‌ లాంటి రాష్ట్రాల్నీ దారిలోకి తెచ్చి వచ్చే ఏడాది మార్చినుంచి దేశవ్యాప్తంగా పథకాన్ని సమగ్రంగా పట్టాలకెక్కించాలన్నది సంకల్పం. దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్‌ తీసుకోగల అవకాశం ఉండి ఉంటే కొవిడ్‌ కష్టకాలంలో వలసజీవుల ఆకలి వెతలు కొంతైనా తప్పేవన్న విశ్లేషణలున్నా- లబ్ధిదారుల ఆధార్‌, వేలిముద్రల స్వీకరణలో అవాంతరాలు, ఇంటర్నెట్‌ వేగం తగినంతగా లేకపోవడం వంటి సమస్యలు అసలైన లబ్ధిదారుల్ని ఇబ్బంది పెడుతున్న దృష్టాంతాలూ నమోదవుతున్నాయి. మరోవంక పీడీఎస్‌ బియ్యం ఏపీనుంచి ఆఫ్రికా, మలేసియాలకు అక్రమంగా రవాణా అవుతున్న తీరు పూడ్చాల్సిన కంతలెన్నో ఉన్నాయని నిర్ధారిస్తోంది!
 

యూపీఏ జమానాలో తెచ్చిన ఆహార భద్రతా చట్టం గ్రామాల్లో 75శాతం, పట్టణాల్లో 50శాతాన్ని పేదలుగా గుర్తిస్తూ 81 కోట్లమందికి (2011 జనాభా లెక్కల ప్రాతిపదిక) చౌక రేషన్‌ అందించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 23కోట్ల రేషన్‌ కార్డుదారులకు అయిదు లక్షలకుపైగా ఉన్న చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార ధాన్యాల్ని సక్రమంగా బట్వాడా చేయించడమే సంబంధిత చట్టం పరమోద్దేశంగా ఉంది. 2011 లగాయతు పెరిగిన జనాభాలో దాదాపు 10కోట్లమంది ఆహార భద్రతకు నోచుకోవడం లేదని ఆర్థికవేత్తలు మొత్తుకొంటుంటే, ఆహార అభద్రతతో అలమటిస్తున్న వారిలో అత్యధికులు ఇండియాలోనే పోగుపడ్డారని అంతర్జాతీయ అధ్యయనాలు చాటుతున్నాయి. ప్రపంచ క్షుద్బాధా సూచీలోని 107 దేశాల్లో 94వ స్థానంలో నిలిచిన ఇండియా- ఆకలి అనారోగ్యాలతో ఈసురోమంటోంది. అయిదేళ్లలోపు పిల్లల మరణాలు ఇండియాలోనే అత్యధికమని ‘యునిసెఫ్‌’ నివేదిక ఎలుగెత్తుతుంటే- అసోమ్‌, బిహార్‌, యూపీ, రాజస్థాన్‌ పౌష్టికాహార లేమికి పర్యాయపదంగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఆహారం ప్రజాపంపిణీ కోసం కేంద్రం కేటాయించింది లక్షా 22వేల కోట్ల రూపాయలు! దారిద్య్ర రేఖతోపాటు ఆహార భద్రత నిర్వచనాన్నీ మార్చి పరిమిత వనరుల్ని గరిష్ఠ ప్రయోజన సాధకంగా మలచే పటుతర కార్యాచరణే కావాలిప్పుడు! గత ఏడేళ్లలో 4.4 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డుల్ని ఏరివేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. దారిద్య్ర రేఖను శాస్త్రీయంగా నిర్వచించి, లక్షిత వర్గాల్ని నిక్కచ్చిగా గణించి, ఆధార్‌ కార్డుల్లో అక్రమాల్నీ ఏరివేసి, ఆహార భద్రతలో పౌష్టికాహారాన్నీ చేర్చడం ద్వారానే స్వస్థ భారతావనికి మేలు బాటలు వేయగలం. ఆహార స్వావలంబనకు కేంద్రం నడుం బిగిస్తే అది రైతుకూ, నిరుపేదకే కాదు- ఆత్మ నిర్భర్‌ భారత్‌కూ దోహదపడుతుందన్నది వాస్తవం!
 

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 16-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం