• facebook
  • whatsapp
  • telegram

స్త్రీ సాధికారతకు ఇదా మార్గం?


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అభివర్ణించినట్లు, స్త్రీల అభివృద్ధే సామాజిక ప్రగతికి ప్రమాణం. స్వాతంత్య్రానంతరం విభిన్న రంగాల్లో మహిళలు గణనీయంగా ముందడుగు వేసినా- పితృస్వామ్య భావజాల బందిఖానాలోంచి వారికి నేటికీ సంపూర్ణ స్వేచ్ఛ లభించనేలేదన్నది చేదు వాస్తవం! లింగపరమైన దుర్విచక్షణ మూలంగా గడచిన అర్ధ శతాబ్దంలో భారతదేశంలో 4.5 కోట్ల మంది ఆడ శిశువులు కడతేరిపోయారన్న కఠోర సత్యాన్ని ఐరాస జననిధి సంస్థ నిరుడు వెల్లడించింది. 15-49 ఏళ్ల బాలికలు, స్త్రీలలో 56శాతానికి పైగా రక్తహీనతతో అల్లాడుతున్నారని అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) స్పష్టీకరించింది. చిన్నతనంలోనే పెళ్ళిళ్లు, గర్భధారణల వల్ల అమ్మాయిల ఆరోగ్యం గుల్లబారుతోందంటున్న కేంద్రం- యువతులకు కనీస వివాహ వయసును 18 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు తాజాగా నిశ్చయించింది. ఆ మేరకు చట్ట సవరణకు ఉద్దేశించిన బిల్లు అతిత్వరలో పార్లమెంటు పరిశీలనకు రానుంది. మాతాశిశు మరణాలను అరికట్టడంతో పాటు స్త్రీ సాధికారతకు అది బాటలు పరుస్తుందని ప్రభుత్వం ఉద్ఘాటిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా రూపొందించిన ఆ బిల్లుతో ఆశించిన ప్రయోజనాలు సిద్ధించవన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 20-24 ఏళ్ల యువతుల్లో ప్రతి నలుగురిలో ఒకరు బాల్యవివాహం బారిన పడినట్లు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ గణాంకాలు చాటుతున్నాయి. పశ్చిమ్‌ బెంగాల్‌, బిహార్‌, త్రిపుర, ఝార్ఖండ్‌, అస్సాం, ఏపీ, రాజస్థాన్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ముందువరసలో ఉన్నాయి. చిన్నారి పెళ్ళికూతుళ్లలో అత్యధికులు పేద కుటుంబాల వారే! వివిధ కారణాలతో బాల్యవివాహాల నిరోధ చట్టం అనుకున్నంతగా సఫలీకృతం కాలేదని పార్లమెంటరీ స్థాయీసంఘానికి కేంద్రం గతంలో నివేదించింది. కుటుంబాల ఆర్థిక సామాజిక సమస్యల పర్యవసానాలైన బాల్యవివాహాలు, వాటితో ఆడపిల్లలు ఎదుర్కొనే ఇక్కట్లను నివారించాలంటే- ముందుగా మూలాలకు మందు వేయాలి. తద్భిన్నంగా సర్కారు తలకెత్తుకున్న వివాహ వయోపరిమితి పెంపు ప్రతిపాదన పూర్తిగా తొందరపాటు నిర్ణయమే! 

ఆడపిల్లలకు పెళ్ళి చేయాలంటే 21 సంవత్సరాలు నిండాలన్న నిబంధనను అమలుచేస్తున్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా పట్టుమని పాతిక కూడా లేవు. యూఎస్‌, యూకే వంటి వాటితో సహా 140కి పైగా దేశాల్లో కనీస వివాహ వయసు 18 ఏళ్లే. దుర్భర దారిద్య్రంతో అల్లాడుతున్న కోట్లాది కుటుంబాలను పట్టించుకోకుండా పెళ్ళి ఈడును పెంచితే, అమ్మాయిల వ్యధలు ఇంతలంతలవుతాయంటున్న సామాజికవేత్తల ఆందోళనలు సహేతుకమే! ఆసేతుహిమాచలం పాఠశాల విద్యకైనా పూర్తిగా నోచుకోని అతివలు 59 శాతమని సర్కారీ అధ్యయనాలే సాక్ష్యమిస్తున్నాయి. దేశీయ శ్రామికశక్తిలో స్త్రీల వాటా కేవలం 21శాతం! చైనా, అమెరికా, ఇండొనేసియా, బంగ్లాదేశ్‌లలో వారి ప్రాతినిధ్యం అంతకు రెండు మూడు రెట్లు అధికం. ‘బేటీ బచావో-బేటీ పఢావో’ పథకం నిధుల్లో 80శాతాన్ని ప్రచారానికే వ్యయం చేశారని స్థాయీసంఘం ఇటీవల తేటతెల్లం చేసింది. బాలికల ఆరోగ్యం, విద్యలో గుణాత్మక మార్పుల దిశగా దృష్టి సారించాలని సర్కారుకు అది సూచించింది. జయాజైట్లీ కమిటీ చెప్పినట్లు- పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుతో విద్యావకాశాలను ఇతోధికం కావించడం, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను విరివిగా చేపట్టడం, బాల్యవివాహాల దుష్ప్రభావాలపై ప్రజా అవగాహనను ఇనుమడింపజేయడం ద్వారానే స్త్రీల సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుంది. మహిళలపై మృగాళ్ల అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పేట్రేగుతున్న గృహహింస నిరోధానికి మార్గాలు అన్వేషించడమూ అత్యవసరం. అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహిస్తూ, వారికి సురక్షిత వాతావరణాన్ని కల్పించడం పాలకుల కనీస బాధ్యత. దాన్ని విస్మరించి చట్టాలతోనే ‘మార్పు’ తీసుకురావాలనుకుంటే- అసలుకే మోసం వస్తుంది!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నియంత్రణల నుంచి సరళీకరణ వైపు...

‣ భూమి హక్కుల్లో చిక్కులు

‣ హక్కుల పేరిట అమెరికా దూకుడు

Posted Date: 21-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం