• facebook
  • whatsapp
  • telegram

ప్రాంతీయ సహకారం... ఎవరికి ఉపకారం?

చైనా సారథ్యంలో ఆర్‌సెప్‌-దూరంగా భారత్‌!
 

ప్రపంచీకరణ అమెరికాను తీవ్రంగా నష్టపరచిందనే ఆగ్రహారోపణతో డోనాల్డ్‌ ట్రంప్‌ 2016 ఎన్నికల్లో గద్దెనెక్కారు. అమెరికా కంపెనీలు ప్రపంచీకరణ పేరిట తమ ఉత్పత్తి యూనిట్లను చైనాకు తరలించేయడంతో అమెరికాలో భారీగా ఉద్యోగ నష్టం సంభవించిందనీ, చైనానుంచి వచ్చిపడుతున్న కారు చవక వస్తువులు అమెరికన్‌ పరిశ్రమలను తిరిగి లేవకుండా దెబ్బకొట్టాయంటూ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇంతలో కొవిడ్‌ విరుచుకుపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇంతటి సంక్షోభంలోనూ చైనా ఆర్థికాభివృద్ధి నమోదు చేయడం చూసి, ప్రపంచీకరణవల్ల చైనా మాత్రమే లబ్ధి పొంది, ఇతర దేశాలు నష్టపోయాయనే భావన బలపడింది. ఇలాంటి భయాలు, సంకోచాలను అధిగమించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే తాజాగా కుదిరిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (ఆర్సెప్‌). దీనిపై ఆగ్నేయాసియా దేశాల సంఘాని(ఆసియాన్‌)కి చెందిన 10 సభ్యదేశాలతోపాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంతకాలు చేశాయి. భారత్‌ కూడా ఒప్పందంలో చేరవలసింది కానీ- దానివల్ల చైనా, ఆస్ట్రేలియా తదితర ఆర్సెప్‌ దేశాలనుంచి చౌక దిగుమతులు వచ్చిపడి స్వదేశీ పరిశ్రమలు, వ్యవసాయం, పాడి పరిశ్రమ దెబ్బతింటాయనే ఆందోళనతో ఆర్సెప్‌కు దూరం జరిగింది. ఆర్సెప్‌ ఒప్పందం కుదిరిన మరునాడే భారతదేశం ఎటువంటి వాణిజ్య ఒప్పందాల్లోనూ చేరబోదని విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ తెగేసి చెప్పారు. ప్రపంచీకరణ పేరుతో గతంలో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలవల్ల భారత్‌లో కొన్ని రంగాల్లో పరిశ్రమలు అంతరించిపోయాయని గుర్తుచేశారు. చైనా కంపెనీలు ప్రపంచమంతటా వ్యాపారం చేస్తున్నా విదేశీ కంపెనీల ప్రవేశానికి మాత్రం ఆ దేశం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని జైశంకర్‌ గతంలోనూ విమర్శించారు. అమెరికా ఆగ్రహమూ ఇదే.
 

తలుపులు తెరుస్తున్న ‘డ్రాగన్‌’!
ఇలాంటి అనుమానాలను తొలగించడానికి రానున్న పదేళ్లలో విదేశాల నుంచి 22లక్షల కోట్ల డాలర్ల వస్తుసేవలను దిగుమతి చేసుకుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ ఇటీవల ప్రకటించారు. అదేపనిగా ఎగుమతులు చేస్తూ లక్షల కోట్ల డాలర్ల వాణిజ్య మిగులును కూడబెట్టుకున్న చైనా ఇక నుంచి ఎగుమతులు, దిగుమతుల మధ్య సమతుల్యత సాధించడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అయితే, ఇది కూడా చైనా ఆర్థిక ఆధిపత్యానికి దోహదపడవచ్చు. దిగుమతులు ఇనుమడించే కొద్దీ అంతర్జాతీయ లావాదేవీలలో చైనా కరెన్సీ యువాన్‌ వాడకం పెరుగుతుంది. అది క్రమంగా అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా పరిణామం చెంది, డాలర్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. హానికరమైన వాణిజ్య విధానాలను అనుసరించడంతోపాటు కరోనా మహమ్మారి గురించి ముందుగా హెచ్చరించకుండా దాచిందనే ఆగ్రహంతో బహుళజాతి సంస్థలు తమ సరఫరా గొలుసులను చైనా నుంచి తరలిస్తున్నాయి. ఈ తరలింపు ఒక క్రమ పద్ధతిలో జరిగేట్లు చూడటానికి ఆర్సెప్‌ తోడ్పడుతుంది. నేడు చైనాలో ఉత్పత్తి అయ్యే అనేక సరకులు రేపు వియత్నాం వంటి ఆర్సెప్‌ దేశాల్లో తయారై, అక్కడి నుంచి అమెరికా, భారత్‌లకు ఎగుమతి కావచ్చు. ఇది చివరకు చైనాకు లాభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నాణేనికి రెండో వైపు చూస్తే, ప్రపంచ జీడీపీలో మూడో వంతు (26.2 లక్షల కోట్ల డాలర్లను) ఉత్పత్తికి కారణమైన దేశాలతో ఏర్పాటైన ఆర్సెప్‌, కరోనాతో కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి తోడ్పడే మాట నిజం. 2008 ఆర్థిక సంక్షోభం తరవాత చైనాయే ప్రపంచానికి ఆర్థిక ఇంజిన్‌గా పనిచేసింది. ఈసారి 220 కోట్ల జనాభా గల ఆర్సెప్‌ దేశాలు ఆ పాత్ర పోషించవచ్చు. ఆర్సెప్‌ భాగస్వామ్య దేశాలు పరస్పరం వాణిజ్య సుంకాలను భారీగా తగ్గించుకోవడం, సరఫరా గొలుసులను సమతుల్యంగా పంచుకోవడం, ఇ-కామర్స్‌ నిబంధనల చట్రాన్ని రూపొందించుకోవడం ద్వారా ఉమ్మడిగా లబ్ధిపొందుతాయి. బరాక్‌ ఒబామా హయాములో ఆర్సెప్‌కు పోటీగా 12 దేశాలతో విశాల పసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందాన్ని (టీపీపీ) అమెరికా ప్రతిపాదించినా, డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు కాగానే టీపీపీని రద్దు చేశారు. ఆర్సెప్‌ మాత్రం నిక్షేపంగా కార్యరూపం ధరించి, అమెరికా వాణిజ్య ఆధిక్యానికి సవాలు విసరుతోంది. ఆర్సెప్‌, బెల్ట్‌ రోడ్‌ పథకం (బీఆర్‌ఐ)వల్ల మున్ముందు అమెరికా ఎగుమతిదారులకు మార్కెట్లు తరిగిపోవచ్చు.  ఆర్సెప్‌ సభ్యదేశాల్లో వివిధ వస్తు విడిభాగాల తయారీ, కూర్పులు నిర్దిష్ట నియమ నిబంధనల ప్రకారం జరుగుతాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా రూపొందిన వస్తువులపై పరస్పర దిగుమతి సుంకాలు ఉండవు. తమకు చాలా ముఖ్యమనుకున్న వస్తువుల దిగుమతులపై మాత్రం సభ్య దేశాలు సుంకాలు విధించుకోవచ్చు. ఈ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలు ఆర్సెప్‌ సభ్య దేశాల్లో సరఫరా గొలుసులను ఏర్పరచి గరిష్ఠంగా లబ్ది పొందగలుగుతాయి. ఆర్సెప్‌ దేశాల్లో పరిశ్రమలు, ఉద్యోగావకాశాల వృద్ధికి ఈ సరఫరా గొలుసులు కీలకమవుతాయి.
 

వాణిజ్య బంధాలపై ఆచితూచి...
జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టే జో బైడెన్‌ ఆర్సెప్‌పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారో ఇంకా స్పష్టం కాలేదు. మొదట కరోనా మహమ్మారిని అదుపు చేసి, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలనుకుంటున్న బైడెన్‌, ఇప్పుడప్పుడే వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టకపోవచ్చు. గతంలో వాణిజ్య ఒప్పందాల వల్ల అమెరికా పరిశ్రమలు విదేశాలకు తరలిపోయి విస్కాన్సిన్‌, మిషిగన్‌, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు మూతబడ్డాయి. అసంఖ్యాక కార్మికులు రోడ్డున పడ్డారు. తుప్పు క్షేత్రాలుగా పేరుపడిన ఈ రాష్ట్రాల్లో ఓటర్ల ఆగ్రహమే 2016 ఎన్నికల్లో ట్రంప్‌ను గద్దెనెక్కించింది. తాజా ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో పాగా వేసిన బైడెన్‌ అక్కడి ఓటర్ల ఆదరణను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అలాగని ప్రపంచంలో అగ్ర ఆర్థిక శక్తిగా చైనా అవతరిస్తుంటే బైడెన్‌ చేతులు ముడుచుకు కూర్చుంటారనుకోలేం. ఐరోపా సమాఖ్య (ఈయూ) కూడా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తుందని భావించలేం. భారత్‌ ఈ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగు వేయాలి. మొదట ఈయూతో 2013నుంచి నానుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై తక్షణం సంతకం చేయాలి. ఆర్సెప్‌తో నిమిత్తం లేకుండా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌)తో వాణిజ్య సంబంధాలు వృద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఆ మేరకు ఉభయ పక్షాలూ సంయుక్త ప్రకటన చేశాయి కూడా. సువిశాల భారతీయ విపణి అమెరికాకు ఆకర్షణీయం కాబట్టి, రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం బలపడటం అనివార్యం. అలాగే ‘క్వాడ్‌’ దేశాల మధ్య ఆర్థిక సహకారం పెరగవచ్చు.
 

సుంకాలతో తంటా
భారత్‌ నుంచి చైనాకు జరిగే ఎగుమతులకన్నా దిగుమతులే ఎక్కువ. ఆర్సెప్‌లో చేరాక చైనా దిగుమతులు వెల్లువెత్తితే, వాటిపై సుంకాలు పెంచే స్వేచ్ఛ తనకు ఉండాలని భారత్‌ కోరింది. భారీగా ఉపాధి కల్పించే పాదరక్షల, దుస్తుల తయారీ యూనిట్లు ఉన్నపళాన చైనానుంచి తరలిపోవడానికి బీజింగ్‌ ఒప్పుకోవడం లేదు. ఇలాంటి వస్తు ఎగుమతులపై సుంకాలు బాగా తక్కువగా ఉండాలనీ భారత్‌ కోరుతోంది. చైనాపట్ల భారత్‌కు అనుమానాలు ఉన్నా ఆర్సెప్‌లోని ఇతర సభ్యదేశాలు-ముఖ్యంగా ఆసియాన్‌ దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి కృతనిశ్చయంతో ఉంది.
 

- ప్రసాద్‌
 

Posted Date: 20-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం