• facebook
  • whatsapp
  • telegram

చిక్కుల్లో ఆర్థిక వ్యవస్థ

పునరుద్ధరణ చర్యలు అత్యావశ్యకం

నిరుడు కొవిడ్‌ విజృంభణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ కారణంగా 2020 జూన్‌లో భారత స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) 24 శాతం పడిపోయింది. ఆదాయాలు, పొదుపులు తగ్గాయి. నిరుద్యోగం పెరిగింది. ప్రభుత్వాల ఆర్థిక సాయం, లాక్‌డౌన్‌ సడలింపులతో పరిస్థితి క్రమంగా కుదుటపడటం ప్రారంభించింది. 2020 డిసెంబరు నాటికి ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందినట్లు సంకేతాలు వెలువడ్డాయి. జాతీయ అంతర్జాతీయ సంస్థలూ 2021లో భారత్‌ రెండంకెల వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంచనాలు కట్టాయి. కొవిడ్‌ రెండోదశ భీకరంగా విరుచుకుపడటంతో దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఒడుదొడుకులకు లోనవుతోంది. కొవిడ్‌ కారణంగా జీడీపీ వృద్ధి ఈ ఏడాది తొలుత అంచనా వేసిన 13.5శాతం నుంచి 12.6శాతానికి తగ్గవచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ (నోమురా) వెల్లడించింది. జేపీ మోర్గాన్, యూబీఎస్‌ సైతం తమ అంచనాలను 13శాతం నుంచి 11, 10 శాతాలకు తగ్గించాయి. భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు కొవిడ్‌ రెండోదశతో ముప్పు వాటిల్లనున్నదని ‘మూడీస్‌’ హెచ్చరించింది. 

నిరుపేదల పాలిట శాపం

రోజూ లక్షల కొద్దీ కరోనా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు- లాక్‌డౌన్లు, రాత్రి కర్ఫ్యూలతో పాటు ఇతర ఆంక్షలనూ అమలుచేస్తున్నాయి. దేశ జనాభాకు అవసరమైన వైద్యశాలలు, వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్రమైన భయాందోళనలతో తమ కార్యకలాపాలను కొనసాగించలేక పోతున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కనుక్కున్నా, అది ఇప్పటివరకు పదిశాతం కంటే తక్కువ జనాభాకే ఇచ్చారు. గూగుల్‌ మొబిలిటీ డేటా ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి 24తో పోలిస్తే, ఏప్రిల్‌ ఏడో తేదీకి భారతదేశం అంతటా రిటైల్, వినోద కార్యకలాపాలు 25శాతం తగ్గాయి. ఇటీవల భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చేపట్టిన ‘కంజ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే’ సైతం దీన్ని నిరూపించింది. అనవసరమైన వస్తువులపై ఖర్చు తగ్గనుందని వెల్లడించింది. కరోనా విజృంభణ అనంతరం ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా పెరిగింది. ఒకవైపు ఉపాధి కోల్పోయి ఆదాయం తగ్గిపోవడం, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలవల్ల పేద ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వ్యవసాయ రంగం భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధిరేటును నమోదు చేస్తోంది. 2020-21లో ఆహార ధాన్యం ఉత్పత్తి 30.33 కోట్ల టన్నులను తాకింది. వరసగా అయిదో సంవత్సరం రికార్డు స్థాయిలో ఉత్పత్తి స్థాయిని అధిగమించింది. అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ అవసరమైన ఆహార పదార్థాలను సమకూర్చుకొని, ప్రజలకు పంపిణీ చేసేవిధంగా కార్యోన్ముఖులు కావాల్సి ఉంది. ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’తో ఆహార సరఫరా, నగదు బదిలీ అందరికీ చేరేలా చూడాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం 2021 సంవత్సరానికి 384 కోట్ల పని దినాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 45శాతం పెరిగింది. నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని వలసదారులకు పనుల స్థాయిని విస్తృతం చేయవలసిన అవసరం ఉంది. ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు, వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ గృహాలను నిర్మించడం లాంటివి చేయడం వల్ల దీర్ఘకాలిక వలసలను తగ్గించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు వేగంగా స్పందించి, అందరికీ కరోనా వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకుంటే ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలను కొనసాగించడానికి, తద్వారా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తూ- ఆర్థికంగా నష్టాన్ని కొంతమేరకు తగ్గించుకుంది. రాష్ట్రాలకూ పెద్దయెత్తున సహాయ సహకారాలను, ఆర్థిక వెసులుబాటును కల్పించినట్లయితే కొంతమేరకు ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చు. 

స్వీయ నియంత్రణ కీలకం

పర్యాటకం, ఆతిథ్యం, విమానయానం, వినోదం, ఆటొమొబైల్, స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌), నిర్మాణం వంటివి తీవ్రస్థాయిలో నష్టపోయాయి. ఈ రంగాలు జీడీపీలో చెప్పుకోదగిన వాటా కలిగి ఉన్నాయి.  వీటికి పూర్వ వైభవాన్ని సంతరించి పెట్టాలంటే దీర్ఘ కాలం పట్టే అవకాశం ఉంది. అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న ప్రజల ఆదాయాలు గణనీయంగా కుదించుకుపోతూ ఉండటంతో ఆర్థిక వ్యవస్థపై పెద్దప్రభావం పడే అవకాశం ఉంది. కరోనాతో తీవ్ర నష్టాలు చవి చూస్తున్న టూరిజం, హోటల్, వీధి వ్యాపారులు, వలస కార్మికులు, ఆటో, ట్యాక్సీ కార్మికులకు తక్షణం సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రంగాలు నేటి వరకు పునరుత్తేజానికి నోచుకోలేదు. ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం రుణగ్రస్తులకు కొంత ఊరట కలిగిస్తోంది. రుణ రేట్లు పడిపోవడం రుణ వృద్ధిని పెంచుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో గిరాకీకి కొరత లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి రాజకీయ, మతపరమైన కార్యక్రమాలకు అనుమతిని నిషేధించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కొవిడ్‌ నిబంధనలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. భౌతిక దూరం పాటించే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించినట్లయితే   కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుంది. ఇంకోసారి లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే- జరిగే నష్టం భారీగా ఉంటుంది. అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తే లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం రాదని గ్రహించాలి.

- డాక్టర్‌ చిట్టెడి కృష్ణారెడ్డి
(హెచ్‌సీయూలో అర్థశాస్త్ర ఆచార్యులు) 

 

Posted Date: 17-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం