• facebook
  • whatsapp
  • telegram

కేరళ పథంలో కమల రథం!

గట్టి పోటీకి భాజపా కృషి

ఉత్తర్‌ ప్రదేశ్‌ తరవాత ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యధిక శాఖలు ఉన్నది కేరళలోనే! యూపీలో ఇప్పుడు భాజపా ప్రభుత్వం అధికారంలో ఉండగా, కేరళలో ఇప్పటికీ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. కేరళ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా 2016లో కమలం అక్కడ ఖాతా తెరిచింది. కేరళలో అయిదు వేలకుపైగా ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు నడుస్తున్నాయి. అయినప్పటికీ కమలదళం కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) ఓటుబ్యాంకుల్లోకి చొరబడలేకపోతోంది. ఓట్ల రూపేణా ప్రయోజనం పొందలేకపోతోంది. కేరళ... దేశంలోనే అత్యధికంగా సామాజిక సంస్కరణ ఉద్యమాలు విజయవంతంగా సాగిన రాష్ట్రం. కాషాయం ధరించిన సాధువులు సైతం దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతూ, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని విమర్శించిన రాష్ట్రమిది. అయినప్పటికీ... అలుపెరగకుండా పోరాటం సాగించే తత్వమే భాజపాకు అక్కడ ఎంతోకొంత కార్యకర్తల బలం ఏర్పడేందుకు తోడ్పడింది.

ఇలాంటి పోరాటంతో సముపార్జించుకున్న బలంతో రాష్ట్రంలో 20 అసెంబ్లీ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే స్థితికి ఇప్పుడు ఆ పార్టీ చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో కనీసం అయిదు సీట్లనైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలో భాజపా రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, 2006 తరవాతే ఆ పార్టీ స్పష్టమైన బలం సంతరించుకుంది. అప్పటిదాకా కేరళలోని 140 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని చాలా సీట్లలో సగటున అయిదు నుంచి పది వేల ఓట్లు పొందుతూ- ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ల తరవాత సుదూరంగా తృతీయ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.

బలాబలాల తీరుతెన్నులు

అన్ని అసెంబ్లీ స్థానాలపై దృష్టిపెట్టడంకన్నా, కొన్నిచోట్లకే పరిమితమై కష్టపడి పోరాడటమే ముఖ్యమని భాజపా నాయకత్వం గ్రహించింది. అలాంటి ప్రాంతాల్లో కులం, సామాజిక వర్గ బలాబలాల్ని విశ్లేషించారు. ఈ క్రమంలో కాసర్‌గోడ్‌ పరిధిలోని మంజేశ్వరం, తిరువనంతపురం పరిధిలోని నేమమ్‌లపై దృష్టిసారించారు. మంజేశ్వరంలో గణనీయ సంఖ్యలో ఉన్న కన్నడిగులు హిందుత్వ భావజాలానికి మద్దతుదారులు. మంగళూరులోని వ్యాపారుల నుంచి అందే ఆర్థిక అండదండల్ని దన్నుగా చేసుకొని భాజపా కాసర్‌గోడ్‌లో రాజకీయంగా స్థిరపడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ బలమైన ప్రాబల్యంతోపాటు, గణనీయంగా హిందువుల ఓట్లు ఉండే నియోజకవర్గం నేమమ్‌- కేరళలో భాజపా ఎదుగుదలకు తోడ్పడింది. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఒ.రాజగోపాల్‌ ఈ నియోజక వర్గం నుంచి పలుమార్లు ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ ఈ స్థానంపై ఆశలు వదులుకోలేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు వేయాల్సిందిగా ఇంటింటికీ వెళ్ళి అడిగే రాజగోపాల్‌ను సామాజిక మాధ్యమాల్లో ‘ఎన్నికల మావయ్య’ అని ఆటపట్టించేవారూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమిస్తూ, ఆయన 2016లో నేమమ్‌ నుంచి గెలిచారు. కేరళలో భాజపా తరఫున గెలిచిన తొలి ఎమ్మెల్యేగా పేరొందారు. త్రివేండ్రం, కొల్లాం, పాలక్కాడ్‌, త్రిసూర్‌, కాసర్‌గోడ్‌ వంటి జిల్లాల్లో గట్టి పోటీ ఇవ్వాలని భాజపా లక్ష్యంగా పెట్టుకొంది.

భాజపా కేరళ శాఖను 1980లో ఏర్పాటు చేసిన తరవాత దాని రాజకీయ మనుగడ చాలావరకు ఆర్‌ఎస్‌ఎస్‌పైనే ఆధారపడి సాగింది. 1990లో బాబ్రీ మసీదు విధ్వంస ఘటన అనంతరం అతివాద ఇస్లామిక్‌ భావజాలం పెరిగింది. మతపరమైన సమీకరణ స్పష్టంగా కనిపించడంతో రాజకీయంగా తటస్థంగా ఉండే హిందువుల్లో అభద్రతా భావం ఇనుమడించడం భాజపాకు తోడ్పడింది. ఇది సాంస్కృతిక అంశాలపై ఆసక్తిగల హిందువులపై ప్రభావం చూపడం ప్రారంభించింది. కాంగ్రెస్‌ మద్దతుదారుల్లోని హిందూ అనుకూలురు- అత్యంత దూకుడుతో కూడిన, సంస్కరణల పథంలో నడిచే, మతవ్యతిరేక సీపీఐ(ఎం)ను ప్రత్యామ్నాయంగా భావించడం లేదు. ఫలితంగా భాజపా వైపు మొగ్గు కనబరచడంతో ఆ ప్రయోజనాలను కమలనాథులు అందుకుంటున్నారు.

సామాజిక మాధ్యమాల తోడ్పాటు

కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడం, పలు ఇతర రాష్ట్రాల్లో ఆధిపత్యం కనబరచడం, మరోవైపు కాంగ్రెస్‌ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉండటం వంటి అంశాలన్నీ కేరళలో కార్యకర్తలను పెంచుకునే విషయంలో భాజపాకు తోడ్పడ్డాయి. ప్రస్తుతం దిల్లీ సహకార, సమన్వయాలతో చేపట్టే తీవ్రస్థాయి రాజకీయ ప్రచారం రాష్ట్రంలో భాజపా ఎదుగుదలకు ఎంతోకొంత తోడ్పడుతుందని భావిస్తున్నారు. తమ రాజకీయ వైఖరిని ప్రచారం చేసుకునేందుకు సామాజిక మాధ్యమాలు ప్రధాన ఉపకరణాల్లా అవతరించడమూ భాజపాకు తోడ్పడే అంశమే. దీనిద్వారా ఆ పార్టీ నేతలు తమ రాజకీయ లక్ష్యాలను, ఆలోచనా సరళిని తేలికగా జనంలోకి తీసుకెళ్ళే అవకాశం ఏర్పడింది. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా పలు పంచాయతీలను ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ల నుంచి కైవసం చేసుకోగలిగింది. కేరళ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ విస్తరిస్తున్న తీరు- పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే. వచ్చే ఎన్నికల్లో అది గ్రామీణ ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కాకపోతే- కేరళలోని మొత్తం 140 స్థానాల్లోనూ ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌లతో ప్రత్యక్షంగా పోటీ పడేందుకు భాజపాకు మరో పదేళ్లు పట్టవచ్చు!

- కె.ప్రవీణ్‌ కుమార్‌

Posted Date: 20-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం