• facebook
  • whatsapp
  • telegram

ఊపందుకొంటున్న ఉపగ్రహ అంతర్జాలం

ఇక మారుమూల ప్రాంతాలకూ విస్తరణ

కొవిడ్‌ దెబ్బకు పాఠశాలలు పనిచేసే పరిస్థితి లేకపోవడంతో అంతా ఆన్‌లైన్‌ తరగతులవైపు మొగ్గుచూపారు. పల్లెల్లో సిగ్నళ్లు సరిగ్గా అందక విద్యార్థులు మేడలు, మిద్దెలు, చెట్లు, గుట్టలు ఎక్కవలసి వచ్చింది. తమ పిల్లలు ఎక్కడ కిందపడిపోతారోనని తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అన్ని గ్రామాలకూ సరైన సెల్‌ టవర్లు, కేబుల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలు లేకపోవడమే విద్యార్థుల ఇక్కట్లకు కారణం. డిజిటల్‌ అంతరం పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో బాలల విద్యాహక్కును దెబ్బతీస్తోందని, పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల నిర్దేశించింది. ఈ సమస్యలకు ఉపగ్రహాల ద్వారా అందే అంతర్జాలం రాబోయే రోజుల్లో పరిష్కారంగా నిలవనుంది.

గ్రామాలకే ప్రాధాన్యం

డిజిటల్‌ అంతరాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో డిజిటల్‌ ఇండియా కార్యక్రమం చేపట్టింది. అందులో భాగమైన భారత్‌ నెట్‌ కార్యక్రమం కింద 2023కల్లా దేశంలోని 2.50 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించదలచారు. ఇప్పటిదాకా 1.78 లక్షల పంచాయతీలను అనుసంధానించారు. 2020నాటికి దేశంలో సగం జనాభాకు, పల్లెల్లో 70శాతం ప్రజలకు అంతర్జాల సౌకర్యం లేదు. 2021 ఆగస్టు నాటికి భారతదేశంలో కేవలం 2.43 కోట్లమందికి మాత్రమే కేబుల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం ఉంది. వీరంతా దాదాపుగా పట్టణ వాసులే. పల్లెలకు సెల్‌ టవర్లు, ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు- సమీప భూకక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం అందించడానికి స్టార్‌లింక్‌, ఒన్‌వెబ్‌ సంస్థలు నడుంకట్టాయి. అందుకోసం అమెజాన్‌ సంస్థ సైతం బరిలోకి దిగనుంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ కోసం సెల్‌ టవర్లు, బ్రాడ్‌బ్యాండ్‌కోసం కేబుళ్లు అవసరమవుతాయి. ఉపగ్రహ అంతర్జాల ప్రసారానికి అవేమీ అక్కరలేదు. ఒక ఉపగ్రహ యాంటెన్నా, మోడెం ఉంటే చాలు. ఉపగ్రహం నుంచి రేడియో తరంగాలు లేదా లేజర్‌ కిరణాలు మొదట భూతలంపై ఉన్న నెట్‌వర్క్‌ ఆపరేషన్స్‌ కేంద్రాలకు (ఎన్‌ఓసీ) అందుతాయి. అక్కడి నుంచి వినియోగదారుల సాధనాలకు చేరతాయి. ఉపగ్రహ అంతర్జాల సేవలు పల్లెలకు, మారుమూల గిరిజన ప్రాంతాలకు 100 నుంచి 150 ఎంబీపీఎస్‌ వేగంతో అందుతాయి. ఉపగ్రహ అంతర్జాల సేవల పోటీలో స్టార్‌లింక్‌ సంస్థ ముందున్నది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్‌ మస్క్‌ రాకెట్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్‌- భూమిచుట్టూ 12,000 ఉపగ్రహాలను నిలిపి అంతర్జాల సేవలు అందించనుంది. వాటిలో 1,700 ఉపగ్రహాలను ఇప్పటికే కక్ష్యలోకి ప్రయోగించి, 14 దేశాల్లో లక్ష మందికి ఉపగ్రహ అంతర్జాలం అందిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటిష్‌ ప్రభుత్వం కలిసి స్థాపించిన ఒన్‌వెబ్‌ ఇప్పటికే 322 ఉపగ్రహాలను ప్రయోగించింది. వచ్చే ఏడాది మరో 648 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. స్టార్‌లింక్‌, ఒన్‌వెబ్‌లు 2022 మధ్యనాటికల్లా భారత్‌లో ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నాయి.

భారత్‌లో ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ పొందాలంటే తొలి సంవత్సరం రూ.1,58,000 చెల్లించాలి. అందులో యాంటెన్నా డిష్‌, స్టాండ్‌, వైఫై రౌటర్‌ వంటి సాధనాల కొనుగోలుకు రూ.37,400, నెలనెలా చందా చెల్లింపునకు రూ.7,425 వెచ్చిస్తారు. తరవాతి ఏడాది నుంచి రూ.1,15,000 చొప్పున చెల్లించాలి. స్టార్‌లింక్‌ ప్రధానంగా గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు అందించడంపై దృష్టి పెడుతుందని స్టార్‌లింక్‌ ఇండియా సంచాలకులు సంజయ్‌ భార్గవ చెప్పారు. వేల రూపాయలు వెచ్చించి స్టార్‌లింక్‌ కనెక్షన్‌ తీసుకునే స్తోమత గ్రామీణులకు ఉందా అని ప్రశ్నించగా- టెలికమ్‌ కంపెనీలు చెల్లించే యూఎస్‌ఓ నిధులు, ప్రభుత్వ గ్రాంట్లు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వెచ్చించే నిధులు తోడ్పడతాయని భార్గవ జవాబిచ్చారు. గ్రామీణులకు తక్కువ ఖర్చులో సేవలు అందించడానికి భారత్‌నెట్‌, రైల్‌టెల్‌ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా వంటి ప్రైవేటు టెలికం కంపెనీలతో పొత్తుకు స్టార్‌లింక్‌ ప్రయత్నిస్తోంది. 2022 డిసెంబరునాటికి రెండు లక్షల కనెక్షన్లు విక్రయించాలని, అందులో 80శాతం గ్రామాలకే ఇవ్వాలని స్టార్‌లింక్‌ యోచిస్తోంది. మొదట దిల్లీ, దాని చుట్టుపక్కల 100 పాఠశాలలకు ఉచితంగా స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని భార్గవ చెప్పారు.

పొత్తు అవసరం

ఉపగ్రహ అంతర్జాల సేవలు చాలా ఖరీదైనవే కాక, వాతావరణపరమైన ఇబ్బందులూ ఉన్నాయి. వానలు పడినప్పుడు, ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు రేడియో తరంగాలు యాంటెన్నాకు అందక ఉపగ్రహ నెట్‌ సేవలు పొందడం కష్టమవుతుంది. ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలు భూతలంమీది టెలికాం ఆపరేటర్లతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటే సేవల విస్తృతి పెరిగి ధరలు తగ్గవచ్చు. కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో స్థానిక టెలికాం ఆపరేటర్‌తో పొత్తు కుదుర్చుకుంటానని ఒన్‌వెబ్‌ ప్రకటించింది. స్టార్‌లింక్‌ సైతం అదే బాట పట్టనుంది. మరోవైపు భారత ప్రభుత్వం టెలికం స్పెక్ట్రమ్‌ వేలం లేదా కేటాయింపుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. సమీప భూకక్ష్యలోని ఉపగ్రహ ప్రసారాల గురించి భారత ప్రభుత్వం ప్రకటించే కొత్త అంతరిక్ష టెలికం విధానంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌ కేవలం గ్రామాలకు ఇంటర్నెట్‌ అందించడం వరకే పరిమితం కాబోదు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక ప్రగతికి ఆయువుపట్టుగా నిలిచే 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)లకూ అది కీలకం కానుంది.

త్వరలో వాణిజ్య సేవలు

స్టార్‌లింక్‌, దాని మాతృసంస్థ స్పేస్‌ఎక్స్‌ భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే భారత్‌లో ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్ల బుకింగులు ప్రారంభించాయి. దాదాపు 5,000 మంది భారతీయులు 99 డాలర్ల (రూ.7,400) డిపాజిట్‌ చెల్లించి స్టార్‌లింక్‌ కనెక్షన్లను ముందస్తుగా బుక్‌ చేసుకున్నారు. దానిపై స్టార్‌లింక్‌కు భారత ప్రభుత్వం నోటీసులు పంపింది. ముందస్తు బుకింగ్‌లను ఆపివేసి, భారత్‌లో వాణిజ్య స్థాయిలో సేవలు ప్రారంభించడానికి అవసరమైన అన్ని అనుమతులు, లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంటామని స్టార్‌లింక్‌ తెలిపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. 2022 జనవరి 31కల్లా వాణిజ్య లైసెన్సు కోసం దరఖాస్తు చేస్తామని, ప్రయోగాత్మక లెసెన్సుకోసం ఇప్పటికే దరఖాస్తు పెట్టామని స్టార్‌లింక్‌ ఇండియా వర్గాలు తెలిపాయి.

- కైజర్‌ అడపా
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆశలపల్లకిలో కొత్త ఏడాదిలోకి...

‣ బహుళ ప్రయోజనాల మైత్రీబంధం

‣ ‘హస్త’వాసి బాగాలేదు...

Posted Date: 01-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం