• facebook
  • whatsapp
  • telegram

కేసుల కొండపరిష్కారాలకు గుదిబండ

 

 

సకాలంలో న్యాయం జరగకపోతే అసలు ఎన్నటికీ దక్కనట్లే లెక్క. చట్టబద్ధ పాలనకు, ప్రాథమిక హక్కులకు అది భంగకరం. పౌరులకు జీవించే హక్కు, స్వేచ్ఛను ప్రసాదిస్తున్న 21వ రాజ్యాంగ అధికరణనూ ఉల్లంఘించడమే అవుతుంది. కేసుల కొండలు ఎంతకూ తరగకపోవడం, కొత్త కేసులు వచ్చిపడుతూ ఉండటంతో భారత న్యాయస్థానాలు సత్వర న్యాయం అందించలేకపోతున్నాయి.

 

అమెరికాలో కోర్టు కేసులను ఫలానా గడువులోగా పరిష్కరించాలని నిర్దేశిస్తూ 1974లో సత్వర విచారణ చట్టం తెచ్చారు. భారత్‌లో పౌర, నేర శిక్షాస్మృతులు ఏ కేసులోనైనా కొన్ని అంచెలను పూర్తి చేయడానికి కాల పరిమితులను నిర్దేశించాయి. మొత్తం కేసును విచారించి తీర్పు చెప్పడానికి నిర్దిష్ట గడువునేమీ విధించలేదు. మేనకా గాంధీ కేసు క్రిమినల్‌ కేసుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. ఏఆర్‌ అంతులే కేసులో తీర్పు- క్రిమినల్‌ కేసుల విచారణను వేగంగా పూర్తిచేయడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను అందించింది. మొత్తం విచారణ నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలన్న నిబంధన ఏదీ విధించలేదు. ఇలాంటి తప్పనిసరి నిబంధనలను విధించడం సాధ్యం కాదని 2002లో ఒక కేసులో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.

 

కాలపట్టిక అవసరం

హరియాణా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, చండీగఢ్‌ రాష్ట్రాలు పదేళ్లు, అంతకు మించి పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ పరిష్కరించగలిగాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, దిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్‌లు సైతం పదేళ్లు, అంతకుమించిన పెండింగ్‌ కేసుల సంఖ్యను కొంతమేర తగ్గించగలిగాయి. ఇదంతా ఆయా రాష్ట్రాల్లోని దిగువ కోర్టులకే పరిమితం. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మాత్రం కేసుల కొండలు తరగడమే లేదు. దేశమంతటా 17,000 సబార్డినేట్‌ కోర్టుల్లో 2.54 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండిపోయాయి. వాటిలో 22.76 లక్షల కేసులు పదేళ్లు, అంతకు పైగా అపరిష్కృతంగా ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ తెలిపింది. 20శాతం అపరిష్కృత కేసులతో గుజరాత్‌ అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోంది. ధనికులు, రాజకీయ ప్రాబల్యం ఉన్నవారు, ఇతరత్రా పలుకుబడి కలిగినవారి కేసులను వేగంగా పరిష్కరించాలని ఉబలాటపడే భారతీయ న్యాయ వ్యవస్థ- సామాన్యుడి పట్ల అవే శ్రద్ధాసక్తులు చూపడం లేదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య పౌరులు తమకు కోర్టుల్లో న్యాయం జరగదని నిరాశానిస్పృహలకు లోనవుతున్నారంటే ఆశ్చర్యం ఏముందని 2013 సెప్టెంబరులో జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు, ఎస్‌.జె.ముఖోపాధ్యాయ ధర్మాసనం పెదవి విరిచింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా అప్పీలును కొట్టివేసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది. 20 లేదా 30 ఏళ్ల నుంచి పెండింగులో ఉన్న సామాన్యుల అప్పీళ్లను విచారించడానికి కేవలం అయిదు శాతం సమయాన్ని మాత్రమే వెచ్చించగలుగుతున్నామని అదే ఏడాది ఆగస్టులో సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఇష్రత్‌ జహాన్‌ బోగస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితుడైన ఐపీఎస్‌ అధికారి పీపీ పాండే ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఆ వ్యాఖ్యలు చేసింది. ‘ఈ కోర్టు బడా నేరస్థులకు శరణాలయంగా తయారైంది. ముందస్తు బెయిలు కోసం ఆరోసారి, ఎనిమిదోసారి అప్పీలు చేస్తూ ఉంటారు. వాటిని మేము ట్రయల్‌ కోర్టులా విచారించక తప్పడం లేదు’ అని సుప్రీం ధర్మాసనం వాపోయింది. శీఘ్రంగా విచారణ పూర్తిచేయకపోతే 21వ రాజ్యాంగ అధికరణ భరోసా ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని 2021లో 74 ఏళ్ల నిందితుడికి బెయిలు ఇస్తూ సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. నేడు కోర్టుల్లో గుట్టలుగా పేరుకుపోయిన అపరిష్కృత కేసుల్లో సగానికిపైగా ప్రభుత్వాలు దాఖలు చేసినవే. అత్యధిక కేసులు ఒక ప్రభుత్వ విభాగంపై మరో విభాగం పెట్టినవే. అనేక కేసుల్లో ప్రభుత్వం తన వాదనను నిరూపించుకోలేక చతికిలపడుతోంది. సత్వర న్యాయ సాధనకు కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. ఆ వైపుగా కృషి మొదలుపెట్టినా కొన్ని సమస్యల వల్ల ముందుకు సాగలేక పోయామని వెల్లడించారు. ఏ కేసు విచారణనైనా ప్రారంభించేటప్పుడే దాన్ని ఎప్పటిలోగా పూర్తిచేయాలో ఒక కాలపట్టికను రూపొందించుకోవడం ఉత్తమం.

 

సరైన చర్యలు కీలకం

భారత్‌లో చాలామందికి కోర్టును ఆశ్రయించడమనేది బాధాకరమైన అనుభవంగా మిగిలిపోతోంది. అది వారిని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కుంగదీస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌- శీఘ్ర న్యాయం చేకూర్చడంలో బాగా వెనకబడింది. న్యాయవ్యవస్థకు సరైన మౌలిక వసతులు, సహాయక సిబ్బంది, వారికి మెరుగైన శిక్షణ, సమయాన్ని ఆదా చేసే సాంకేతికతలను అందించడం సత్వర న్యాయానికి తోడ్పడతాయి. న్యాయమూర్తుల ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, అవసరమనుకుంటే న్యాయమూర్తుల బలగాన్ని పెంచడం అపరిష్కృత కేసుల శీఘ్ర పరిష్కారానికి ఉపకరిస్తాయి. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడం, దిగువ స్థాయి న్యాయస్థానాలకు మరింత స్వయం నిర్ణయాధికారం ఇవ్వడమూ చక్కని సాధనాలవుతాయి. క్రిమినల్‌ కేసుల విచారణ వ్యవస్థ సిబ్బంది పనితీరునూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. సామాన్య పౌరులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు శాసనకర్తలు, ప్రభుత్వం చేయీచేయీ కలిపి న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయడం ద్వారానే శీఘ్ర న్యాయం సిద్ధిస్తుంది.

 

నీరుగారుతున్న చట్టం

బడా నేరస్థుల కేసులను బాగా పేరున్న సీనియర్‌ న్యాయవాదులు చేపడతారు. వాటిని కోర్టులు త్వరగా విచారణకు స్వీకరిస్తాయి. సామాన్యులకు పేరున్న న్యాయవాదుల సేవలను వినియోగించుకొనే ఆర్థిక స్తోమత ఉండదు. అందుకే వారి కేసులు ఎప్పటికీ తెమలవు. సకాలంలో న్యాయం జరగదు కాబట్టి, వారికి శాశ్వతంగా న్యాయం జరగనట్లే లెక్క. ఆర్థిక స్తోమత లేనివారికి న్యాయ సహాయం అందించాలని 39ఏ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తున్నా, అది అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ప్రభుత్వపరంగా న్యాయసహాయం చేయడమనేది దానధర్మం కాదు. దాన్ని పొందడం పౌరుల హక్కు. సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి 1995లో న్యాయ సేవల ప్రాధికార చట్టం తెచ్చారు. నిధుల కొరత, ప్రభుత్వ అలసత్వం, విధానపరమైన లోపాలు, అవినీతి వల్ల ఆ చట్టం నీరుగారిపోయింది.

 

- పీవీఎస్‌ శైలజ

(సహాయ ఆచార్యులు, మహాత్మాగాంధీ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు

‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

‣ ఐరోపాను బెంబేలెత్తిస్తున్న జీవనవ్యయం

‣ ‘పునరుత్పాదక’ లక్ష్యాలు... సుదూరం!

‣ మాటల్లోనే... సమానత్వం

‣ సమితి ప్రక్షాళన... విశ్వశాంతికి ఆవాహన!

Posted Date: 31-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం