• facebook
  • whatsapp
  • telegram

ఉపప్రణాళికల అమలులో లొసుగులెన్నో!

ఎస్‌సీ, ఎస్‌టీల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ప్రణాళిక చట్టం తెచ్చారు. దాని   అమలులో లోపాలు ఆ చట్టం పాలిట శాపాలుగా మారాయి. నిధుల మళ్ళింపు వల్ల ఎస్‌సీ, ఎస్‌టీలకు తీరని అన్యాయం జరుగుతోంది.

షెడ్యూల్డు కులాలు, తెగల అభ్యున్నతి, సామాజిక భద్రతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక, షెడ్యూల్డ్‌ తెగల ఉప ప్రణాళిక (ఆర్థిక వనరుల ప్రణాళికా రచన, కేటాయింపు, వినియోగం) చట్టం-2013 తెచ్చారు. ఈ చట్టం ప్రకారం అన్ని శాఖలకు ప్రభుత్వ కేటాయింపుల్లో 16.4శాతం నిధులను ఎస్‌సీలకు, 6.6శాతం నిధులు ఎస్‌టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఖర్చుచేయాలి. ఉమ్మడి రాష్ట్ర విభజన తరవాత కేటాయింపులు మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సీలకు   16.4శాతం, ఎస్‌టీలకు 5.3శాతం, తెలంగాణలో ఎస్‌సీలకు 15.45, ఎస్‌టీలకు 9.3శాతం చొప్పున అభివృద్ధి వ్యయాన్ని బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది. చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే తొమ్మిదేళ్లు గడిచాయి. దాని అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు నేటికీ ఎస్‌సీ, ఎస్‌టీలకు చేసింది అంతంత మాత్రమే.

ఎస్‌సీ, ఎస్‌టీ ఉప ప్రణాళిక చట్టం ద్వారా బడ్జెట్‌ కేటాయింపుల్లో 2011 జనాభా లెక్కలను కాకుండా 2001 లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నారు. అంటే పదేళ్లలో పెరిగిన జనాభాను విస్మరించారు. చట్టం అమలుకు పదేళ్ల కాలపరిమితి విధించారు. 1989లో ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం అమలులోకి వచ్చినా ఇప్పటికీ అకృత్యాలను నివారించ లేకపోయింది. సమాచార హక్కు చట్టం వచ్చి పదిహేడేళ్లు అవుతున్నా ప్రజలంతా దాన్ని వినియోగించే పరిస్థితి రాలేదు. చట్టం అమలు అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి తప్ప, కాలపరిమితితో సాధించేది ఏమీ ఉండదని ఇవి తేటతెల్లం చేస్తున్నాయి.

సాధారణ పథకాల ఖర్చును సైతం ఎస్‌సీ, ఎస్‌టీ ఉప ప్రణాళికలో చూపించే అవకాశం కల్పించడం ఈ చట్టంలోని మరో లొసుగు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఎస్‌సీ, ఎస్‌టీలకు ఇచ్చే వేతనం, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజలకు ఇచ్చే పింఛన్‌, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ను ఉప ప్రణాళిక బడ్జెట్‌ ఖర్చుగానే చూపుతున్నారు. ఇది ఆ వర్గాలకు అన్యాయం చేయడమే. ఆర్థిక సంవత్సరంలో ఎస్‌సీ, ఎస్‌టీ ఉప ప్రణాళికలకు కేటాయించిన బడ్జెట్లో మిగిలిన మొత్తం మురిగిపోయేలా చట్టం చేశారు. మిగులు బడ్జెట్‌ను వచ్చే ఏడాది కేటాయింపులకు కలపాలన్న సూచనలను గాలికి వదిలేశారు. 2017-22 మధ్య అయిదేళ్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభివృద్ధి వ్యయ బడ్జెట్‌ రూ.5,89,309 కోట్లు. అందులో 16.4శాతం(రూ.96,647 కోట్లు) ఎస్‌సీలకు వెచ్చించాలి. కానీ రూ.69,213 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రత్యేకంగా ఎస్‌సీలకు ఉద్దేశించిన (లక్షిత) పథకాలకు రూ.27,894 కోట్లే వ్యయం చేశారు. ఎస్‌టీలకు 5.3 శాతం(రూ.31,233 కోట్లు) వెచ్చించాల్సి ఉండగా, రూ.24,003 కోట్లు కేటాయించారు. రూ.7,284 కోట్లు మాత్రమే లక్షిత పథకాలకు వెచ్చించారు. తెలంగాణలో అయిదేళ్లకు అభివృద్ధి వ్యయం రూ.4,97,719 కోట్లు. అందులో 15.45 శాతం(రూ.58,003 కోట్లు) ఎస్సీలకు కేటాయించాలి. రూ.81,070 కోట్లు కేటాయించి లక్షిత పథకాలకు రూ.31,825 కోట్లు ఖర్చు చేశారు. ఎస్‌టీలకు 9.3శాతం(రూ.46,288 కోట్లు) బదులు రూ.47,119 కోట్లు కేటాయించారు. లక్షిత పథకాలకు రూ.18,315 కోట్లు వ్యయం చేశారు.

ఎస్‌సీ, ఎస్‌టీ ఉప ప్రణాళిక చట్టం అమలుకు పటిష్ఠ ఏర్పాట్లు జరగాలి. దళిత ఆదివాసీల ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని పథకాలను రూపొందించాలి. వాటి అమలు, పర్యవేక్షణలో దళిత, ప్రజా, స్వచ్ఛంద సంఘాలను భాగస్వాములను చేయడం తప్పనిసరి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యకు నోచుకోని ఎస్‌సీల్లో 22శాతం, ఎస్‌టీల్లో 33శాతం విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళిక రచించి అమలు చేయాలి. మానవ అభివృద్ధి సూచికల్లో అత్యంత ప్రధానమైన విద్యతో పాటు వైద్యాన్నీ చేర్చాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌సీ, ఎస్‌టీల జనాభా నిష్పత్తి మేరకు నిధులు ఖర్చు చేయడం ప్రభుత్వాల బాధ్యత. పాలకులు దానికి కట్టుబడి ఉన్నప్పుడే దళిత, గిరిజన సాధికారత సాకారమవుతుంది.

- డాక్టర్‌ గురువెల్లి రమణమూర్తి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పేదలకు దక్కని ఉచిత న్యాయం

‣ భూసార రక్షణతో ఆహార భద్రత

‣ అప్పుల కుప్పలు... భావి తరాలకు తిప్పలు!

‣ ఆవిష్కరణలకు ప్రోత్సాహం... ప్రగతికి మార్గం

‣ ఒకే భూమి... ఒకే కుటుంబం... భవిత ఉజ్జ్వలం!

Posted Date: 18-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం