• facebook
  • whatsapp
  • telegram

నీరుగారుతున్న సహ చట్ట స్ఫూర్తి

పౌరులే అసలైన పాలకులని, ప్రభుత్వానికి వారే యజమానులని సమాచార హక్కు చట్టం ఉద్ఘాటిస్తోంది. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారాన్నే ప్రజలు నిక్కచ్చిగా పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిందే.

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 2005 అక్టోబరు 12న విజయదశమి నాడు అమలులోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందుతుందని ఈ చట్టం ఆశలు రేకెత్తించింది. లోపభూయిష్ఠ భారత ప్రజాస్వామ్యం నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా ఎదగడానికి సమాచార హక్కు (సహ) చట్టం తోడ్పడుతుందని చాలామంది ఆశించారు. అరుణారాయ్‌ నాయకత్వంలో ప్రారంభమైన ఆర్టీఐ ఉద్యమం ప్రపంచంలో అత్యంత పారదర్శకమైన సహ చట్టం ఆవిర్భావానికి దారితీసింది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ పౌరులకు భావ ప్రకటన హక్కును, ప్రచురణ హక్కును, ప్రభుత్వం నుంచి సమాచారం కోరే హక్కును ప్రసాదిస్తోందని 1975 నుంచి సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. వీటిలో మొదటి రెండు హక్కులు నిర్ద్వంద్వంగా గుర్తింపు పొంది, వాటి పరిధి కూడా విస్తరించింది. మూడోదైన సమాచార హక్కు మాత్రం అమలుకు నోచుకోలేదు. సరైన యంత్రాంగం, విధివిధానాలు లోపించడమే దీనికి కారణం.

జవాబుదారీతనం పెంచాలి

సహ చట్టం అమలుకు కొత్తగా సమాచార కమిషన్లను నెలకొల్పారు. సమాచారం గురించి పౌరులకు, అధికారులకు మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ఈ కమిషన్లకే అప్పగించారు. మినహాయింపులు ప్రకటించిన పది విభాగాల సమాచారాన్ని తప్ప మిగతాదాన్ని ప్రభుత్వం పౌరులతో పంచుకోవలసిందేనని చట్టం చెబుతోంది. పౌరుడు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో అందించాలని పేర్కొంది. సమాచారాన్ని అందించడంలో చేసిన జాప్యానికిగాను ప్రభుత్వ ఉద్యోగికి రోజుకు రూ.250 చొప్పున జరిమానా విధించవచ్చు. ఆ మొత్తం జరిమానా రూ.25 వేలు మించకూడదు. దీన్ని సంబంధిత ఉద్యోగి జీతం నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్టీఐ చట్టం గురించి ప్రజల్లో అవగాహన పెరగడంతో మొదట్లో దాన్ని ఉత్సాహంగా ఉపయోగించుకున్నారు. అయితే, అధికారంలో ఉన్నవారి నుంచి మాత్రం వ్యతిరేకత పెరిగింది. ఎక్కువగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులనే సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నందువల్ల వారు సమాచారాన్ని అందించడంలో విఫలమయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలకు ముందుకు రావడం లేదు. పౌరులకు సమాచారాన్ని అందించడానికి మొండికేసే ఉద్యోగులకు జరిమానా విధించడానికీ మొగ్గు చూపడం లేదనే విమర్శలున్నాయి. సమాచార కమిషనర్ల నియామకంలోనూ పారదర్శకత కరవైంది. వారి అలసత్వం వల్ల సహ చట్టం సరిగ్గా ఆచరణలోకి రావడం లేదు. సమాచార కమిషనర్లు సహ చట్టం గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయడం లేదు. పౌరుల ప్రాథమిక హక్కులను గౌరవించాలనే స్పృహ వారిలో కనబడటం లేదు. అందుకే నిర్ణయాలు తీసుకోవడంలో ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తున్నారు.

సహ చట్టం పకడ్బందీగా అమలు కావడానికి కొన్నిరకాల పద్ధతులు పాటించాలి. సమాచార కమిషనర్ల నియామకానికి నిర్దిష్ట అర్హతలు, అనుభవాలను ప్రమాణాలుగా నిర్ణయించి, వాటిని కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం పరిష్కరిస్తున్న కేసుల సంఖ్య ఏడాదికి సగటున రెండు వేల లోపుగానే ఉంటోంది. ఒక్కో కమిషనర్‌ ఆరువేలదాకా, వీలైతే అంతకన్నా ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. కేసులను 90 రోజుల్లోగా పరిష్కరించాలనే నిర్దిష్ట పరిమితుల్నీ విధించాలి. ప్రతి కమిషనర్‌ పనితీరును ఆరు నెలలకు ఒకసారి సమీక్షించాలి. తదుపరి రెండేళ్లలో సమాచారం కోసం అందే దరఖాస్తులు, వాటి పరిష్కారం గురించి అంచనా వేయాలి. దాన్ని వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రతి నెలా అంతకుముందు నెలలో కమిషనర్‌ పనితీరు గురించి వెల్లడి చేయాలి. అవసరాన్ని బట్టి ఎందరు సమాచార కమిషనర్లను నియమించదలచిందీ ప్రభుత్వం ఆరు నెలల ముందే ప్రకటించాలి. ఈ పదవులకు ప్రముఖుల నుంచీ దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఇతరులు నామినేట్‌ చేసినవారినీ పరిశీలించి ఎంపిక చేయవచ్చు. అందుబాటులో ఉన్న సమాచార కమిషనర్‌ పదవులకు మూడు రెట్లు ఎక్కువ పేర్లతో జాబితాను రూపొందించే పనిని యూపీఎస్సీ సభ్యులతో ఏర్పాటయ్యే కమిటీకి అప్పగించాలి. లేక మరేదైనా పద్ధతినీ అనుసరించవచ్చు. ఆ జాబితా నుంచి ఎవరిని ఎందుకు ఎంపిక చేసిందీ స్పష్టంగా వివరించాలి. పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సంబంధిత అన్వేషణ కమిటీ బహిరంగంగా ముఖాముఖి నిర్వహించాలి. పౌరులు, మాధ్యమాల అభిప్రాయాలనూ స్వీకరించాలి. తరవాత అందుబాటులో ఉన్న సమాచార కమిషనర్‌ పదవులకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేయాలి. ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రితో కూడిన కమిటీ ఈ జాబితా నుంచి తుది నియామకాలు జరపాలి. సమాచార కమిషనర్లలో సగం మంది వయసు 60 ఏళ్లకన్నా తక్కువ ఉండాలి. సమాచార హక్కు అమలుకు పాటుపడుతున్న ఉద్యమకారులలో అర్హులైన వారిని కమిషనర్లుగా నియమించాలి. సమాచార కమిషనర్ల ఎంపికకు పారదర్శక ప్రక్రియను పాటించి, వారు తమ విధులను పకడ్బందీగా నెరవేర్చేలా నిరంతరం ఒత్తిడి తెస్తూ జవాబుదారీతనం పెంచినట్లయితే సహచట్టం నుంచి మెరుగైన ఫలితాలను సాధించగలుగుతాం. అలాంటి ప్రక్రియనే ఇతర అనేక కమిషన్లకూ వర్తింపజేయవచ్చు.

సరైన ఫలితాలు శూన్యం

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పనితీరును తనిఖీ చేసి, పొరపాటు జరిగితే సరిదిద్ది సమతూకం సాధించే బాధ్యత సంబంధిత కమిషన్లపై ఉంది. ప్రస్తుతం పలు కమిషన్లు ఆశించిన స్థాయిలో విధులను నిర్వహించడం లేదు. చాలా కమిషన్లు సీనియర్‌ పౌరుల క్లబ్బుల్లా తయారయ్యాయి. పని లేకుండా పదవిని, దాంతోపాటు వచ్చే సౌకర్యాలు, పారితోషికాలను అనుభవించే మార్గాలుగా మారాయి. నేడు మానవ హక్కుల కమిషన్‌, మహిళా కమిషన్‌, లోకాయుక్త వంటి కమిషన్లు ఉన్నా- వాటి నుంచి ఆశించిన ఫలితాలు లభించడం లేదు. సముచిత అర్హతలున్న వ్యక్తులను కమిషనర్లుగా నియమిస్తూ, వారి పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ సమాచార కమిషన్లను సమర్థంగా పని చేయించడంపై దృష్టి కేంద్రీకరించాలి.

సమీక్ష అవసరం

పౌర సమాజం సైతం సమాచార కమిషనర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేయాలి. వారి నిర్ణయాలను ప్రతి నెలా పారదర్శకంగా సమీక్షించాలి. ప్రతి కమిషనర్‌ పనితీరుపై మూడు నెలలకు ఒకసారి మూల్యాంకన పత్రాన్ని ప్రచురించాలి. సమాచార కమిషనర్ల నిర్ణయాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ మూల్యాంకన పత్రాన్ని రూపొందించే పనిని న్యాయ కళాశాలల విద్యార్థులకు అప్పగించవచ్చు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఒప్పంద సేద్యంలో లొసుగుల రాజ్యం

‣ మడ అడవులకు మరణ శాసనం

‣ ఇరాన్‌ మహిళ స్వేచ్ఛానినాదం

‣ చట్టం... రైతు చుట్టం కావాలి!

Posted Date: 26-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం