• facebook
  • whatsapp
  • telegram

కశ్మీర్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి

అమెరికా, దాని మిత్రదేశాలు కశ్మీర్‌ సమస్యను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో అవి ఎప్పటికప్పుడు మాట మారుస్తూ... పాకిస్థాన్‌కు కొంత మానసికానందాన్ని కలిగిస్తున్నాయి. రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నంలో భారత్‌ తమకు అండగా నిలవనందుకే ఆయా దేశాలు పన్నాగాలకు పాల్పడుతున్నాయి.

‘ప్రపంచంలో అణ్వాయుధాలున్న అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమధ్య అభివర్ణించారు. ఆ తరవాత కొద్ది రోజులకే ఎఫ్‌-16 ఎయిర్‌ క్రాఫ్ట్‌లను దాయాది దేశానికి అందజేయడాన్ని దౌత్యపరంగా అసంబద్ధమైన రీతిలో సమర్థించుకోవడం ద్వారా తన ద్వంద్వ వైఖరిని ఆయన చాటుకున్నారు. వాస్తవానికి రష్యాను ఏకాకిని చేసే తమ వైఖరికి మద్దతు ఇవ్వని భారత్‌ను చీకాకుపెట్టడానికి పశ్చిమ దేశాలు కశ్మీర్‌ అంశాన్ని వివిధ ప్రపంచ వేదికలపై లేవనెత్తుతున్నాయి. అమెరికా రాయబారి డొనాల్డ్‌ బ్లోమ్‌ ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి అనాలినా బేర్‌బాక్‌  సైతం జమ్మూకశ్మీర్‌ సమస్యపై ఇస్లామాబాద్‌కు మద్దతును ప్రకటించారు. కశ్మీర్‌ ఉద్రిక్తతల విషయంలో బెర్లిన్‌ తన పాత్ర పోషిస్తుందని, ఆ బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు. ఇవన్నీ అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న పలుకుబడిని గుర్తించి- ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న పన్నాగాలుగా భావించాలి. అమెరికా రాయబారి, జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానాలపై ఇండియా గట్టిగానే తన వ్యతిరేకతను తెలిపింది.

అమెరికా పూర్వ అధ్యక్షులు జార్జ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌ల నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వరకూ కొన్నేళ్లుగా కశ్మీర్‌ విషయంలో అగ్రరాజ్యం వైఖరి భారత్‌కు కొంత సౌకర్యంగానే కనిపించినా- అది దీర్ఘకాలిక విధానం మాత్రం కాదు. ఇండియాను బుజ్జగించడం లేదా పాకిస్థాన్‌తో సంబంధాలు నెరపుతూ బెదిరించడం వంటి ప్రయత్నాలను అమెరికా కొనసాగిస్తోంది. రష్యా నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాను అమెరికాతో పాటు మరికొన్ని పశ్చిమ దేశాలు విమర్శిస్తున్నాయి. సొంత ఆంక్షల నుంచి తమను తాము మినహాయించుకొని రష్యా నుంచి పాశ్చాత్య దేశాలు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. అదే విధానాన్ని అనుసరిస్తున్న భారత్‌ను మాత్రం అవి తప్పుపట్టడం వాటి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన వెంటనే దిల్లీ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా రాయితీపై వచ్చే ముడిచమురు దిగుమతులను నిలిపివేయాలని వాషింగ్టన్‌ కోరడం మరీ విడ్డూరం. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌లు వివిధ సందర్భాల్లో మన ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తరవాత ఐరోపా, జీ-7 దేశాల భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సమస్యలు సంక్లిష్టంగా మారాయి. రష్యా నుంచి చమురు దిగుమతులను పరిమితం చేయాలని చైనా, భారత్‌లను అమెరికా నేతృత్వంలోని జీ-7 కూటమి కోరింది. అందులోని చాలా దేశాలు తగ్గింపు ధరలకు క్రూడాయిల్‌ను పొందుతూ- భారత్‌, చైనాలకు మాత్రమే ఇలాంటి సూచన చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి, కశ్మీర్‌లో ఉద్రిక్తతల అంశాలపై ఇండియా పట్టనట్లు వ్యవహరిస్తోందని తన పశ్చిమ మిత్ర దేశాలకు పాకిస్థాన్‌ తెలియజెప్పాలనుకుంది. ఈ ఆరోపణల ద్వారా అమెరికా, ఐరోపా దేశాలతో తన సంబంధాలను పాక్‌ పునరుద్ధరించుకొనే ప్రయత్నాలకు దిగింది. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి తృతీయ పక్షం జోక్యం అవసరమనే సందేశం పంపాలనీ పాక్‌ భావిస్తోంది. మరోవైపు దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి పశ్చిమ దేశాల ఆలోచనలను అనుసరించడానికి సిద్ధంగా లేమంటూ భారత్‌ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇండియా తనను తాను పునర్నిర్మించుకుంటోంది. భారత్‌ అనుసరిస్తున్న విదేశీ, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ వ్యూహాలు ప్రపంచ నాయకత్వం దిశగా సాగుతున్న మన ప్రస్థానాన్ని బలోపేతం చేస్తున్నాయి. ముడి చమురు దిగుమతి, కశ్మీర్‌ వంటి విషయాల ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని అమెరికా, పశ్చిమ దేశాలకు బాగా తెలుసు. అయినా అప్పుడప్పుడూ ఇండియాను బెదిరించే, పాకిస్థాన్‌ను బుజ్జగించే చర్యల ద్వారా అవి తమ ఆయుధ వ్యాపారాలను విస్తరించుకొంటున్నాయి. ఆయా దేశాల ఎత్తుగడ అదేనని మిగిలిన ప్రపంచ దేశాలూ ఇప్పటికే గుర్తించాయి.

- ఎస్‌.ఎన్‌.కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

‣ సుస్థిరాభివృద్ధికి సైన్సే సోపానం

‣ ఉపప్రణాళికల అమలులో లొసుగులెన్నో!

‣ పేదలకు దక్కని ఉచిత న్యాయం

Posted Date: 18-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం