• facebook
  • whatsapp
  • telegram

జనాభా నియంత్రణే నేరమా?

లోక్‌సభ స్థానాలపై దక్షిణాది ఆందోళన

జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాలను పునర్విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ ఇటీవల మద్రాస్‌ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ఇప్పటిదాకా నియోజక వర్గాల పునర్విభజనకు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయి. ఇకపైనా అదే విధానం అవలంబిస్తే మరోసారి ఈ రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని మద్రాస్‌ హైకోర్టు ముందుచూపుతో పేర్కొంది. గతంలో చేపట్టిన పునర్విభజన కారణంగా తమిళనాడు రెండు, ఏపీ ఒక లోక్‌సభ స్థానం కోల్పోయాయి. 60-70వ దశకంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు జనాభా వృద్ధిరేటు బాగా మందగించింది కాబట్టి మరిన్ని సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేటు తక్కువగా ఉండటం వల్ల ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ జనాభాలో భారీ తగ్గుదల నమోదయ్యే సూచనలున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం సిఫార్సులకు జనాభాను ప్రధాన కొలమానంగా తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రాలు బాగా నష్టపోయాయి. ఇప్పుడు అదే సూత్రాన్ని నియోజక వర్గాల సంఖ్యకూ వర్తింపజేస్తే రాజకీయంగా ప్రాబల్యం కోల్పోవడం తథ్యం.

ప్రాతినిధ్యానికి విలువ

దేశంలో ఇప్పటిదాకా 1952, 1963, 1973ల్లో అప్పటి జనాభా లెక్కల ప్రకారం చట్టసభ స్థానాలను పునర్విభజించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాలు 494, 522, 543కు చేరాయి. ప్రతి సీటుకు సమాన జన సంఖ్య ఉండాలన్న ప్రాతిపదికన అప్పట్లో నియోజక వర్గాలను విభజించారు. అయితే 1976లో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 జనాభా లెక్కల వరకు తదుపరి లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు పెంచకూడదనే నిబంధన విధించారు. దేశంలో అప్పుడప్పుడే కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చినందువల్ల, అది ఒక క్రమరూపాన్ని సంతరించుకొని రాష్ట్రాల్లో జనాభా వృద్ధిరేటులో స్థిరత్వం రావడానికి కనీసం పాతికేళ్లయినా పడుతుందన్న ఉద్దేశంతో 2001 వరకు నియోజక వర్గాల పునర్విభజన చేపట్టకూడదని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరవాతా జనాభా వృద్ధిరేటు విషయంలో రాష్ట్రాల మధ్య సమతౌల్యం రాకపోవడంతో నియోజక వర్గాల పెంపును 2026 వరకు వాయిదా వేస్తూ 2002లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 2026 తరవాత చేపట్టే తొలి జనాభా లెక్కల ఆధారంగా దేశంలోని చట్టసభల్లో సీట్లు పెంచాలని చెబుతూ అధికరణ 170కి ఆ మేరకు సవరణ చేశారు. 2026 తరవాత తొలి జనాభా లెక్కలంటే 2031లో చేపట్టేవే. ఇప్పుడున్న వరస క్రమం ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2024, 2029, 2034, 2039లో జరుగుతాయి. 2031 జనాభా లెక్కలన్నీ క్రోడీకరించి ప్రచురించడానికి రెండు మూడేళ్లు పడుతుంది కాబట్టి 2034 ఎన్నికల నాటికి నియోజక వర్గాల పునర్విభజన చేసే అవకాశం ఓ మోస్తరుగా ఉంటుంది. అది తప్పితే 2039లో ఖాయమవుతుంది. ఈ క్రమంలో దాదాపు 13-18 ఏళ్ల తరవాత తలెత్తే రాజకీయ విపత్తు గురించి మద్రాస్‌ హైకోర్టు ఇప్పుడే అప్రమత్తం చేసింది. నియోజక వర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు తగ్గిపోతే రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలెక్టోరల్‌ కాలేజీలో దక్షిణాది రాష్ట్రాల సంఖ్యాబలం తగ్గి, వాటి ప్రాతినిధ్యానికి విలువ లేకుండా పోయే ప్రమాదం ఉంది. 

జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఎలాంటి నష్టం ఉంటుందో 2002లో ఏర్పాటైన జస్టిస్‌ కుల్‌దీప్‌సింగ్‌ కమిషన్‌ సిఫార్సులు స్పష్టం చేశాయి. ఆ కమిషన్‌ సీట్ల సంఖ్య పెంపు జోలికి పోకపోయినా- రాష్ట్రాల్లో అంతర్గతంగా నియోజక వర్గాల సరిహద్దులను పునర్విభజించింది. ఆ సూత్రం కారణంగా స్థానికంగా జనాభా పెరిగిన ప్రాంతాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగి, జనాభా తగ్గిన ప్రాంతాలు నష్టపోయాయి. అందుకు ఉదాహరణ ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీట్లు పెరగడమే. సమైక్య రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి విద్య, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌కు ఎందరో వలస రావడంతో భాగ్యనగరం చుట్టుపక్కల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల అక్కడ 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు పెరిగాయి. అప్పట్లో సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల నుంచే మహానగరానికి పెద్దయెత్తున వలసబాట పట్టడంతో ఆ ప్రాంతాల్లో జనాభా తగ్గిపోయింది. దానివల్ల ఏపీలో 11 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లు తగ్గి అవి హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు తోడయ్యాయి. తెలంగాణలోనూ గ్రామీణ ప్రాంత లోక్‌సభ సీట్లయిన సిద్దిపేట, మిర్యాలగూడ కనుమరుగై హైదరాబాద్‌ శివారు నియోజకవర్గాల్లో కలిసిపోయాయి.

అందరికీ పెంచాలి

లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపుపై 2026 వరకు నిషేధం విధించినా జిల్లాల్లోని సీట్ల సంఖ్యపై నిషేధం లేకపోవడంతో కుల్‌దీప్‌సింగ్‌ కమిషన్‌ నియోజకవర్గాల సరిహద్దులను మార్చింది. దాంతో జనాభా పెరుగుదల, వలసలు ఎక్కువ ఉన్నచోట్ల సీట్లు పెరిగి, అవి లేని ప్రాంతాల్లో తగ్గిపోయాయి. దీని ప్రకారం భవిష్యత్తులో జనాభా పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రాలు లబ్ధిపొంది, అది లేనివి నష్టపోవడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో మద్రాస్‌ హైకోర్టు భవిష్యత్తు నష్టంపై పలు ప్రశ్నలు లేవనెత్తడంతోపాటు, దాన్ని సరిదిద్దడానికి సూచనలు కూడా చేసింది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు తగ్గించినప్పుడు, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా రాజ్యసభలో సీట్లు పెంచాలన్న హైకోర్టు సూచన సహేతుకంగా కనిపిస్తోంది. ఇకముందు ఎప్పుడు నియోజక వర్గాల పునర్విభజన చేపట్టినా రాష్ట్ర జనాభాతో సంబంధం లేకుండా సీట్ల సంఖ్యను ఇప్పుడున్న స్థాయికే పరిమితం చేయాలన్న వాదనా ఆమోదయోగ్యంగానే ఉంది. అసలు దేశంలో సీట్ల సంఖ్య జోలికి పోకపోవడమే మంచిదని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ ఎస్‌.వై.ఖురేషీ చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత జనాభా రెట్టింపయినందు వల్ల  ఇప్పుడున్న ప్రజాప్రతినిధులతోనే దేశాన్ని పాలించడం కష్టమన్న వాదన పసలేనిద]న్నది ఆయన అభిప్రాయం. యూకేలో ప్రతి 60 వేల మందికి ఒక ఎంపీ ఉంటారు. ఆ లెక్కన మనవద్ద భారీసంఖ్యలో పెరుగుతారు. ఇప్పుడున్న 543 ఎంపీలను నియంత్రించడమే స్పీకర్‌కు కష్టంగా ఉండగా, ఆ స్థాయిలో సభ్యుల్ని నియంత్రించడం ఎలా సాధ్యమవుతుందన్న ఖురేషీ ప్రశ్నలో సహేతుకత కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే, ప్రతి రాష్ట్రానికీ ఇప్పుడున్న సీట్లను కొనసాగించడమే మేలు. ఒకవేళ అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తే, జనాభాను నియంత్రించిన  రాష్ట్రాల్లోనూ అదే స్థాయిలో పెంచాలి.

తీవ్రనష్టం తప్పదు

దేశంలో నియోజక వర్గాలను 2008లో సవరించినా 2026 వరకు సీట్ల సంఖ్యలో మార్పు చేయకూడదన్న 84వ రాజ్యాంగ సవరణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం పడలేదు. కానీ 2031 తరవాత అప్పటి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను సర్దుబాటుచేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇప్పటికే ఆర్థిక సంఘాలూ జనాభా ప్రాతిపదికగా ఆర్థిక వనరులను పంపిణీ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఒకవైపు నష్టపోయాయి. ఇప్పుడు చట్టసభల్లో సీట్లు కూడా కోల్పోతే వీటికి పెద్ద దెబ్బ తగిలినట్లవుతుంది. దక్షిణాదిలోనూ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలాంటి మహానగరాల శివార్లలో సీట్లు పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతాయి. ఫలితంగా రాష్ట్రాల్లోనూ అంతర్గతంగా రాజకీయ శక్తి సామర్థ్యాల్లో తేడాలు తలెత్తే ప్రమాదం ఉంది.

- చల్లా విజయభాస్కర్‌ 
 

Posted Date: 31-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం