• facebook
  • whatsapp
  • telegram

సృజనతోనే చదువులకు వెలుగు

ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం

 

 

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి పుష్కరకాలం అవుతున్నా నేటికీ ఇండియా అక్షరాస్యత 77.7శాతానికే పరిమితమైంది. గతేడాది జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన లెక్కల ప్రకారం గ్రామీణంతో పోలిస్తే (73.5శాతం), పట్టణ ప్రాంతాల్లోనే (87.7శాతం) అక్షరాస్యత ఎక్కువ. రాష్ట్రాల విషయానికి వస్తే అక్షరాస్యతలో కేరళ ప్రథమ స్థానాన్ని (96.2శాతం) దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ 66.4శాతంతో అట్టడుగు స్థానంలో నిలిచింది. తెలంగాణలో అక్షరాస్యత 72.8శాతంగా నమోదైంది. దేశంలో పురుషుల కంటే మహిళల అక్షరాస్యత తక్కువగా ఉంది. చదువుకున్న పురుషులు 84.7శాతం ఉండగా, మహిళా అక్షరాస్యత 70.3శాతానికే పరిమితమైంది. గత పదేళ్లలో ఇండియాలో మహిళా అక్షరాస్యత కేవలం అయిదు శాతమే పెరిగింది. బాలికలను చదువులో ప్రోత్సహించేందుకు కేంద్రం ‘బేటీ బచావో... బేటీ పఢావో’ వంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. మాధ్యమిక విద్యలో జాతీయ స్థాయిలో బాలికలకు ప్రోత్సాహకాల కోసం గతేడాది కేంద్రం రూ.110 కోట్లు కేటాయించగా, ఈసారి కోటి రూపాయలకు తగ్గించింది. ప్రపంచ అక్షరాస్యతలో భారత్‌ది 128వ స్థానం. సిరియా, కెన్యా, కాంగో వంటి వెనకబడిన దేశాలెన్నో మనకంటే విద్యపరంగా ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలు 99శాతానికి పైగా అక్షరాస్యతను సాధించాయి. ఉత్తరకొరియా, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాలు వందశాతం అక్షరాస్యతను సాకారం చేసుకున్నాయి.

 

కేటాయింపులు తక్కువే

విద్యార్థుల నమోదు 1990వ దశకం నుంచి భారత్‌లో పెరుగుతూ వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు విద్యార్థులు బడిబాట పట్టడానికి తోడ్పడ్డాయి. అదే సమయంలో విద్యారంగానికి నిధుల కేటాయింపులు ఆశించిన స్థాయిలో పెరగడంలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యను ఎనిమిదో ప్రాధాన్య రంగంగా కేంద్రం గుర్తించింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో విద్యకు ఆరు శాతం నిధులు ప్రత్యేకించాలని జాతీయ విద్యావిధానం-2020 స్పష్టం చేసింది. ఈ ఏడాది కేంద్రం కేటాయింపులు 2.67శాతానికే (రూ.93,224 కోట్లు) పరిమితమయ్యాయి. 2014-19 మధ్య కాలంలో దేశంలో విద్యకు మూడు శాతం మేర కేటాయింపులు దక్కగా, కరోనా ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి కేంద్రం తాజాగా కోతపెట్టింది. భూటాన్‌, స్వీడన్‌ దేశాలు తమ జీడీపీలో విద్యకు 7.5శాతం కేటాయిస్తున్నాయి. ఫిన్‌లాండ్‌, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, పాలస్తీనాలు సైతం విద్యకు పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. మన దగ్గర చేస్తున్న కేటాయింపుల్లోనూ వాస్తవిక పరిస్థితులకు వచ్చేసరికి కోతలు తప్పడం లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి విద్యకు కేంద్రం రూ.99,312కోట్లను కేటాయించి, సవరించిన అంచనాల్లో రూ.85,089 కోట్లకు తగ్గించింది. విద్యార్థులకు అందించే ఆర్థిక సాయంలోనూ 48శాతం కోత పడింది. గతేడాది కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదనలకన్నా 28శాతం తక్కువగా పాఠశాల విద్యాశాఖకు కేటాయింపులు లభించాయి. నిధుల్లో 34శాతం జాతీయ విద్యా మిషన్‌కే దక్కుతున్నాయి. ఇందులో భాగంగా సమగ్ర శిక్ష, ఉపాధ్యాయుల శిక్షణ, వయోజన విద్య కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోంది. 2021-22 బడ్జెట్‌లో సమగ్రశిక్షకు రూ.31,050 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 6.8శాతం ఎక్కువ. జాతీయ విద్యామిషన్‌కు కేటాయించిన నిధుల్లో 99శాతం సమగ్ర శిక్షకే అందుతున్నాయి. మొత్తం విద్యారంగానికి చేసిన కేటాయింపుల్లోనూ 33శాతం దీనికే దక్కుతున్నాయి. గతేడాది సమగ్ర శిక్షకు కేటాయించిన నిధుల్లో రూ.10,794కోట్లకు వివిధ ఆర్థిక కారణాలు చూపుతూ కోతపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో విద్యారంగానికి 12శాతం నిధులు దక్కుతుండగా, తెలంగాణ 7.4శాతానికి పరిమితమైంది.

 

పాఠశాలలు పటిష్ఠం కావాలి

దేశ విద్యావిధానంలో 2040 నాటికి సమూల మార్పులు తెస్తామని కేంద్రం గతేడాది జులైలో జాతీయ విద్యావిధానానికి ఆమోదం తెలిపింది. 15 వేల పాఠశాలలను కొత్త విధానానికి అనుగుణంగా మారుస్తామని ఈ ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రకటించింది. ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అందరికీ విద్య చేరువ కావాలంటే ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయాలి. బాలికావిద్యను ప్రోత్సహించాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సృజనశక్తికి పెద్దపీట వేయాలి.సాంకేతికతను అందిపుచ్చుకొని ఉపాధ్యాయులకు శిక్షణ అందించాలి. ఉపాధి ఆధారిత ఉన్నతవిద్యా కోర్సులను తీసుకురావాలి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో రాజకీయ జోక్యం నివారించడం తప్పనిసరి. అప్పుడే దేశం విజ్ఞాన భాండాగారంగా వెలుగొందే అవకాశం ఏర్పడుతుంది.

 

- యార్లగడ్డ అమరేంద్ర
 

Posted Date: 08-09-2021 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌