• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ బద్ధతే ప్రామాణికం

గవర్నర్ల నియామకం తీరు మారాలి

గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు దశాబ్దాలుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహారశైలి పరంగా స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల గవర్నర్లు స్థానిక సర్కారులతో చెట్టాపట్టాలేసుకొని సఖ్యతతో మెలగుతున్నారు. కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించే ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నారు. బహిరంగంగానే అక్కడి సర్కార్లను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇటీవల ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అయితే ఆ రాష్ట్రం సరైన దారిలో పయనిస్తోందంటూ మరీ ఆకాశానికి ఎత్తేశారు! ఎటొచ్చీ, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు సాగుతున్న రాష్ట్రాలలోనే పేచీ వచ్చిపడుతోంది. ఆయా సర్కారుల పాలనను గవర్నర్లు ప్రస్తుతించడం మాట అటుంచితే, ప్రభుత్వాల విధానాలన్నీ వారికి అసంబద్ధంగానే తోస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నియమాలు నీరుగారిపోతున్నాయని, నిబంధనలు బేఖాతరు అవుతున్నాయని గవర్నర్లు తరచూ గగ్గోలు పెడుతున్నారు. ఒకరకంగా చూస్తే వారు ప్రభుత్వాలకు ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది!

అనాదిగా కొనసాగుతున్నదే

మహారాష్ట్రలో ఇటీవల అత్యాచారం, హత్య ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి అసెంబ్లీలో రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండు చేసింది. ఆ మేరకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. ఆ వెంటనే ఉద్ధవ్‌ తనదైన శైలిలో ప్రత్యుత్తరం ఇచ్చారు. మహిళల భద్రత అన్నది దేశం మొత్తానికీ సంబంధించిన సమస్య అని, అందువల్ల ఆ అంశంపై చర్చించేందుకు నాలుగు రోజులపాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేలా కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మెజారిటీకి అవసరమైన సీట్లు దక్కలేదు. అయినా, భాజపా శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా గవర్నర్‌ కోశ్యారీ నియమించారు. భాజపాకు మద్దతుగా ఇతర పార్టీల లేఖలు అందకపోయినా గవర్నర్‌ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరవాత మెజారిటీ నిరూపించుకోలేక ఫడ్నవీస్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం మహా వికాస్‌ అగాఢీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఉద్ధవ్‌ ఠాక్రేను శాసన మండలికి గవర్నర్‌ నామినేట్‌ చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. కోశ్యారీ నెలల పాటు ఆ నిర్ణయానికి ఆమోదం తెలపలేదు. ఆ విషయంపై పలుమార్లు అభ్యర్థించినా ఆయన పట్టించుకోలేదు. చాలా సందర్భాల్లో కోశ్యారీ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి ఇక్కట్లు కల్పించారు. పశ్చిమ్‌ బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో పోలిస్తే-కోశ్యారీ, ఠాక్రే కయ్యం కొంత నయం అనిపిస్తుంది. పశ్చిమ్‌ బెంగాల్‌లో గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య ఉప్పునిప్పులా నిత్యం మాటల యుద్ధం సాగుతుంటుంది. పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం ప్రజాస్వామ్యానికి గ్యాస్‌ ఛాంబర్‌లా మారిందని ధన్‌కడ్‌ విమర్శిస్తారు. ‘రాజ్‌ భవన్‌లో మాకో రాజు ఉన్నారు. ఆయన నాలుక ఎప్పుడూ అదుపులో ఉండదు. ఆయన భాజపా అధ్యక్షుడిలా వ్యవహరిస్తారు’ అని దీదీ అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఆమె మంత్రుల్లో ఒకరు ధన్‌కడ్‌ను బెంగాలీ కవి సుకుమార్‌ రాయ్‌ రచనల్లోని ‘పాగల్‌ జగాయ్‌’ పాత్రతో పోల్చి ఎద్దేవా చేశారు. గవర్నర్లు ప్రతిపక్ష ప్రభుత్వాలకు కంట్లో నలుసులా మారడం అనాదిగా కొనసాగుతున్నదే. ప్రస్తుత భాజపా సర్కారుతో పాటు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సైతం ఎంచుకున్న బాట అదే. ప్రతిపక్ష పార్టీలు పాలన సాగిస్తున్న ప్రాంతాలు లంకలని, వాటిలో రావణ పాలన సాగుతోందని నిరూపించేందుకు గవర్నర్ల సాయంతో గతంలో కాంగ్రెస్‌   చేయాల్సినంతా చేసింది.

ప్రత్యేక వ్యవస్థ అవసరం

గవర్నర్ల పెడపోకడలకు అడ్డుకట్ట వేయాలంటే 163వ అధికరణకు సవరణ చేసి వారి విచక్షణాధికారాలను తొలగించాలని కొందరు కోరుతున్నారు. సమస్యకు అది ఎంతమాత్రమూ సరైన పరిష్కారం కాదు. స్వయం నిర్ణయాధికారం లేని గవర్నర్‌ పదవి రబ్బరు స్టాంపుతో సమానం. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటెత్తు పోకడలతో ఇష్టారీతిగా వ్యవహరించడానికి ఆస్కారం లభిస్తుంది. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. నిజానికి గవర్నర్‌ రాజ్యాంగబద్ధ పర్యవేక్షకుడిగా వ్యవహరించాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంవల్లే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి విధేయంగా ఉండటమే గవర్నర్ల నియామకానికి ప్రధాన ప్రమాణంగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష ప్రభుత్వాలను వారు ఇబ్బందులకు గురిచేయడాన్ని ఎలా నివారించగలం? అందుకే గవర్నర్ల నియామక విధానం మారాలి. వారి నియామకంలో కేంద్రం అధికారాన్ని తొలగించాలి. ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రథమ పౌరులను నియమించాలి. ఆ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇతర స్వతంత్ర వ్యక్తులు సభ్యులుగా ఉండాలి. తద్వారా వివాదాలకు అడ్డుకట్టపడి గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజా సంక్షేమానికి పాటుపడటానికి అవకాశం లభిస్తుంది.

వలస పాలన అవశేషాలు

రాజ్యాంగంలోని 163వ అధికరణ గవర్నర్ల విధివిధానాలను తెలియజేస్తుంది. అది 1935 భారత ప్రభుత్వ చట్టంలోని సెక్షన్‌ 50కి నకలే. సాధారణంగా గవర్నర్‌ మంత్రిమండలి సలహాల మేరకు నడుచుకోవాలి. వలస పాలన కాలంనాటి గవర్నర్ల మాదిరిగా, స్వతంత్ర భారతంలోని రాష్ట్ర ప్రథమ పౌరులకు సైతం విచక్షణ, స్వయం నిర్ణయాధికారాలున్నాయి. రాజ్యాంగంలో వాటికి స్పష్టమైన పరిధులను పేర్కొనలేదు. తన విచక్షణాధికారంతో గవర్నర్‌ తీసుకునే నిర్ణయాలను మంత్రిమండలి, న్యాయస్థానాలు ప్రశ్నించే అవకాశం లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని రాష్ట్రాల ప్రథమ పౌరులు ప్రతిపక్ష ప్రభుత్వాలకు సమస్యలు సృష్టిస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సుదీర్ఘకాలం తొక్కిపడుతున్నారు. జాతీయ ప్రవేశ, అర్హత పరీక్ష (నీట్‌) బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్‌ అదేవిధంగా వ్యవహరించారు. వైద్య విద్యలో నీట్‌ నుంచి తమిళనాడును మినహాయించేందుకు ఆ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. బిల్లులతోపాటు క్యాబినెట్‌ నిర్ణయాలకు కొర్రీలు పెట్టి వెనక్కి పంపే అవకాశమూ గవర్నర్లకు ఉంది. ఝార్ఖండ్‌ గవర్నర్‌ సైతం పలు బిల్లులను తొక్కి పట్టారు. తెలంగాణలోనూ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరం పెరిగినట్లు ఇటీవలి పరిణామాలు చాటుతున్నాయి. తాజాగా గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ వేదికగా మహిళా దర్బారును నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది.

- అరుణ్‌ సిన్హా (సామాజిక రాజకీయ విశ్లేషకులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

Posted Date: 15-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం