• facebook
  • whatsapp
  • telegram

ముసురుతున్న అణుభయాలు

అస్త్రాలను పేర్చుకుంటున్న దేశాలు

అణ్వాయుధ వ్యాప్తిని నిరోధించాలని భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఈ ఏడాది ఆరంభంలో ముక్తకంఠంతో చెప్పాయి. అణ్వస్త్ర సమరాల్లో విజేతలెవరూ ఉండబోరని, అసలు అణు యుద్ధాలే జరగకుండా చూడాలని నీతి వచనాలు పలికాయి. వాటిని ఆచరణలో పెట్టేందుకు మాత్రం అవి ఆసక్తి చూపడం లేదు. తమ అమ్ములపొదిలో మరిన్ని అణ్వస్త్రాలను చేర్చుకుంటూ మానవాళి భవితవ్యాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం తొలినాళ్లలో అణ్వాయుధాల వినియోగంపై మాస్కో చేసిన హెచ్చరికలు, వార్‌హెడ్‌ల సముపార్జనలో బీజింగ్‌ వడివడిగా వేస్తున్న అడుగులు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఆ వినాశకర ఆయుధాల తయారీపై ప్రపంచ దేశాల మధ్య ఆగిపోయిందనుకున్న పోటీ మళ్ళీ మొదలవుతోందన్న సూచనలు ముప్పిరిగొంటున్నాయి.

డ్రాగన్‌ ఆరాటం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర సామర్థ్యమున్న దేశాలు తొమ్మిది. స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (సిప్రి) తాజా నివేదిక ప్రకారం- ఆ దేశాల ఆయుధ భాండాగారంలో మొత్తం 12,705 అణు ‘వార్‌హెడ్‌’లు ఉన్నాయి. వాటిలో 90శాతం అమెరికా, రష్యాల వద్దే పోగుపడ్డాయి. విడివిడిగా చూస్తే అత్యధికంగా రష్యా వద్ద 5,977, అమెరికా వద్ద 5,428 వార్‌హెడ్‌లు ఉన్నాయి. తరవాతి స్థానాల్లో చైనా (350), ఫ్రాన్స్‌ (290), బ్రిటన్‌ (225), పాకిస్థాన్‌ (165), ఇండియా (160), ఇజ్రాయెల్‌ (90), ఉత్తర కొరియా(20) నిలుస్తాయి. చైనా తన వార్‌హెడ్‌లను 2027కల్లా 700కు, 2030 నాటికి వెయ్యికి పెంచుకొనే లక్ష్యంతో ఉన్నట్లు అమెరికా రక్షణ వర్గాలు గతంలో వెల్లడించాయి. క్షిపణి ప్రయోగాలకు వీలుగా బీజింగ్‌ కొత్తగా 300కు పైగా భూగర్భ నిర్మాణాలు (సిలోస్‌) చేపడుతున్నట్లు కొన్ని ఉపగ్రహ చిత్రాల్లో కనిపించడం వాషింగ్టన్‌ ఆరోపణలు వాస్తవమని నిరూపిస్తోంది. మరోవైపు సమీప భవిష్యత్తులో ఉత్తర కొరియా తన అణ్వస్త్రాలను 60కి పెంచుకొనే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ట్రంప్‌ హయాములో అమెరికా బయటికొచ్చింది. దాంతో టెహరాన్‌ సైతం త్వరలోనే అణ్వాయుధాలను సముపార్జించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంవల్ల ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలు వేడెక్కాయి. అమెరికా ఆధిపత్యాన్ని రష్యా, చైనాలు సవాలు చేస్తున్నాయి. తైవాన్‌ ఆక్రమణకు డ్రాగన్‌ తహతహలాడుతోంది. స్వీడన్‌, ఫిన్లాండ్‌ నాటోలో చేరేందుకు సిద్ధమవడంపై మాస్కో గుర్రుగా ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ అణ్వస్త్రాల రేసు ప్రారంభమైతే ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉన్నట్లే! ఉక్రెయిన్‌కు మద్దతుగా పశ్చిమ దేశాలు యుద్ధంలోకి దిగితే, అణ్వాయుధాలను ప్రయోగించేందుకూ వెనకాడబోనని రష్యా గట్టి హెచ్చరిక చేసింది. దాంతో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రయత్నాలకు గండి కొట్టినట్లయింది. దానిపై అణ్వస్త్ర సామర్థ్య రహిత దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తామెందుకు అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందాలకు కట్టుబడి ఉండాలన్న ఆలోచనలు వాటిలో ఉదయిస్తున్నాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం పదో సమీక్షా సదస్సు ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్‌ వేదికగా జరగనుంది. అందులో ఆ అంశంపై వాడివేడి చర్చ జరిగే అవకాశముంది. అణ్వాయుధాల నిషేధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒప్పందం 2021 జనవరిలో అమలులోకి వచ్చింది. భూగోళంపై అణ్వస్త్రాలను పూర్తిగా నిర్మూలించాలన్నది దాని లక్ష్యం. అణ్వాయుధ దేశాలేవీ దానిపై సంతకాలు చేయలేదు.

సైబర్‌ దాడులతో ముప్పు

అణ్వస్త్ర సామర్థ్యాలను మరింత మెరుగు పరచుకునేందుకు ఇండియా సైతం ప్రయత్నిస్తోందనడంలో సందేహం లేదు. వార్‌హెడ్‌ల సంఖ్యను పెంచుకుంటూనే, వాటిని మోసుకెళ్ళే వ్యవస్థలను మరింత రాటుదేల్చడంపై భారత్‌ దృష్టి సారించింది. రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో వార్‌హెడ్‌ వాహక వ్యవస్థల సామర్థ్యాలు బలోపేతమయ్యాయి. ఇప్పటికే కొన్ని సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరేజ్‌-2000, జాగ్వార్‌ యుద్ధ విమానాలను అణ్వస్త్రాల ప్రయోగానికి అనువుగా తీర్చిదిద్దారు. పొరుగునే చైనా, పాకిస్థాన్‌ల వద్ద ఇండియా కంటే ఎక్కువ అణ్వస్త్రాలు ఉండటం ఆందోళనకర విషయం. కొన్నేళ్లుగా అణ్వాయుధాల పరిమాణంలో గణనీయమైన మార్పులొచ్చాయి. భుజాలపై మోస్తూ ప్రయోగించే క్షిపణుల్లోనూ అమర్చుకునేలా ‘వ్యూహాత్మక వార్‌హెడ్‌’లను శాస్త్రవేత్తలు సృష్టించారు. అలాంటి ఆయుధాలు పాక్‌ వంటి దేశాల్లో ఉగ్ర మూకల చేతికి చేరితే పెను విధ్వంసం తప్పదు. ఈ ఏడాది మార్చిలో బ్రహ్మోస్‌ క్షిపణి ఒకటి భారత్‌ నుంచి పాక్‌ భూభాగంలోకి దూసుకెళ్ళింది. డిజిటల్‌ నియంత్రణ వ్యవస్థలో వైఫల్యమే దానికి కారణమని కథనాలు వచ్చాయి. ఆ క్షిపణిలో అణు వార్‌హెడ్‌ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సైబర్‌ దాడులతో అణ్వస్త్రాలను విద్రోహ శక్తులు తమ అధీనంలోకి తీసుకునే ముప్పుందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం కావాలి. అణ్వస్త్రాలతో మానవాళి మనుగడకు ఎప్పటికైనా ముప్పేనన్న సంగతిని గుర్తించి, వాటిని విడనాడేందుకు కృషిచేయాలి. అందుకోసం కట్టుదిట్టమైన ఒప్పందాలు కుదుర్చుకొని వాటి అమలుకు కృషి చేయాలి.

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వైద్యరంగంలో సాంకేతిక విప్లవం

‣ బలపడుతున్న ద్వైపాక్షిక బంధం

‣ రైతు ఆదాయం రెట్టింపయ్యేదెన్నడు?

‣ పర్యావరణ సూచీలో అట్టడుగున భారత్‌

‣ రాజ్యాంగ బద్ధతే ప్రామాణికం

Posted Date: 18-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం