• facebook
  • whatsapp
  • telegram

వసివాడుతున్న బాల్యం

బాలకార్మిక వ్యవస్థకేదీ అంతం?

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బాలకార్మికులున్న దేశం భారత్‌! దేశ శ్రామికశక్తిలో 3.1 కోట్ల మంది బాలలు ఉన్నారు. ప్రతి 11 మంది పిల్లల్లో ఒకరు పనిలో కొనసాగుతున్నారు. ఇండియాలో బాలకార్మికుల సంఖ్యపై ప్రభుత్వం వద్ద ఎలాంటి గణాంకాలూ అందుబాటులో లేవు. సుమారు మూడు దశాబ్దాలుగా ఈ సమస్యను పర్యవేక్షిస్తున్న జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు (ఎన్‌సీఎల్‌పీ)కి సరైన నిధుల కేటాయింపులు లేకపోవడమే అందుకు కారణం. 2016లో సమగ్ర శిక్షా అభియాన్‌లో ఎన్‌సీఎల్‌పీని విలీనం చేసినప్పటి నుంచి బాలకార్మికులకు సంబంధించిన రికార్డులు లేవని, వాటికోసం తరవాతి జనగణన దాకా వేచి చూడాల్సిందేనని జనతాదళ్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బాలకార్మికుల గణాంకాల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘం 14 మంత్రిత్వ శాఖలను సంప్రదించినా సరైన సమాచారం లభించలేదు. బాలకార్మికుల కోసం ఎన్‌సీఎల్‌పీ నెలకొల్పిన పాఠశాలలు సైతం మూడు, నాలుగేళ్లు పనిచేసి నిధుల కొరతతో మూతపడ్డాయి.

చట్టాలున్నా ఫలితమేదీ?

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక ప్రకారం ఇండియాలో అయిదు నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో 1.01 కోట్ల మంది బాలలు పనుల్లో కొనసాగుతున్నారు. అదే వయసు వారిలో సుమారు 4.27 కోట్ల మంది బడి బయట ఉన్నారు. బాలకార్మిక శ్రామిక శక్తిలో 14-17 ఏళ్ల మధ్య వయసు వారు దాదాపు 63శాతం ఉన్నారని సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ లెక్కగట్టింది. వారిలో బాలికల కంటే బాలురే ఎక్కువగా ప్రమాదకర పనుల్లో కొనసాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 80శాతం పిల్లలు ఏదో ఒక పనిలో నిమగ్నమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పెద్ద పట్టణాల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందువల్ల చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. యునిసెఫ్‌ నివేదిక ప్రకారం- పట్టణీకరణ ప్రాంతాల్లో అయిదు నుంచి 14 ఏళ్ల వయసులోని బాలకార్మికుల్లో 54శాతం పెరుగుదల కనిపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో బాలకార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి తల్లిదండ్రులు వారిని పనులకు పంపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబాల అప్పులు సైతం చిన్నారులను బాలకార్మికులుగా మార్చేస్తున్నాయి.

ఏదైనా పనిలో పిల్లలను నియమించడం 2016లో సవరించిన బాల, కౌమారదశ కార్మిక (నిషేధం- నియంత్రణ) చట్టం-1986 ప్రకారం గుర్తించదగిన క్రిమినల్‌ నేరం. కర్మాగారాల చట్టం-1948 ప్రకారం గనులు, పేలుడు, మండే పదార్థాల తయారీ సంస్థల్లో, ప్రమాదకర వృత్తుల జాబితాలో చేర్చిన పనుల్లో కౌమారదశలో ఉన్నవారిని నియమించకూడదు. ప్రమాదకర పరిశ్రమల్లో బాలకార్మికులను చేర్చుకోవడాన్ని రాజ్యాంగంలోని 24వ అధికరణ సైతం వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా బాలకార్మికుల్లో 60శాతం వ్యవసాయ రంగంలో ఉన్నట్లు ఐఎల్‌ఓ వెల్లడించింది. 70శాతం బాలకార్మికులు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉన్నారని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. వ్యవసాయేతర ప్రధాన రంగాలన్నింటా బాలకార్మికులు కనిపిస్తారు. 2014 డిసెంబరులో అమెరికా కార్మిక శాఖ బాలకార్మికుల ద్వారా ఉత్పత్తయిన వస్తువుల జాబితాను విడుదల చేసింది. వాటిలో 23 రకాలు భారత్‌లో రూపొందుతున్నట్లు వెల్లడించింది.

సమష్టి కృషి అవసరం

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలి. ఉచిత ప్రాథమిక విద్యను అందించడం ద్వారా బడి వయసు బాలలెవరూ విద్యకు, విజ్ఞానార్జనకు దూరం కాకుండా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అనాథలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు జీవనోపాధి కోసం వారు బాల్యంలోనే పనులు చేయకుండా వారికి చేయూత అందించాలి. బాలకార్మిక వ్యవస్థ కొనసాగడంలో సమాజమే కీలకంగా నిలుస్తోంది. పిల్లల జీవితాలను, సామాజిక పరిస్థితులను బాల కార్మిక వ్యవస్థ ఎలా ప్రభావితం చేస్తుందో తెలియకపోవడం వల్లనే అది ఇంకా ఉనికిని చాటుకొంటోంది. తక్కువ వేతనంతో ఎక్కువ సమయం పనిచేయించుకోవచ్చనే ఉద్దేశంతో యజమానులు పిల్లలను పనుల్లో నియమించుకుంటున్నారు. బాలకార్మికుల నిషేధ చట్టాల గురించి యజమానులకు తెలియజెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. ప్రభుత్వ విధులకు ప్రజల మద్దతు తోడైతే బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం పెద్ద కష్టం కాదు. బాలలే రేపటి దేశ భవిష్యత్తు అనే వాస్తవాన్ని సమాజానికి వివరించి దేశ సౌభాగ్యానికి పిల్లల చదువు, వారి సరైన ఎదుగుదల అత్యంత కీలకమని అర్థమయ్యేలా చేయాలి.

కొరవడుతున్న పురోగతి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు 1979లో గురుపాదస్వామి కమిటీని కేంద్రం నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1986లో బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం తెచ్చారు. ప్రమాదకర వృత్తుల్లో పనిచేస్తున్నవారి పునరావాసంపై దృష్టి సారించేందుకు 1987లో జాతీయ విధానాన్ని రూపొందించారు. 1988 నుంచి కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ బాలకార్మికుల పునరావాసానికి పెద్ద సంఖ్యలో పథకాలను అమలు చేసింది. పలు స్వచ్ఛంద సంస్థలు బాలల విద్య, ఇతర వసతుల కల్పనకు కృషిచేసినా ఫలితం దక్కలేదు. బాలకార్మికుల సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నా పేదరికం, నిరక్షరాస్యత వంటి కారణాల వల్ల పురోగతి కొరవడుతోంది.

బడికి దూరం

పేదరికం, ప్రభుత్వ అరకొర విద్యా సదుపాయాలు బాలకార్మిక వ్యవస్థ కొనసాగడానికి కారణాలని బీబీసీ నివేదిక నిర్ధారించింది. బాలురతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో బాలికలు చదువుకు దూరమై, ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారని యునిసెఫ్‌ గుర్తించింది. పాఠశాల అందుబాటులో ఉన్నా విద్యావ్యయం భరించలేకపోవడం, బడుల్లో ఎదురయ్యే వేధింపులు, లింగ దుర్విచక్షణ వంటి కారణాలతో ఎక్కువ మంది బాలికలు చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. పిల్లల సంపాదన కుటుంబ మనుగడకు కీలకమని తల్లిదండ్రులు భావించడమూ పిల్లలు బడికి దూరంకావడానికి ఒక కారణం. కొన్ని కుటుంబాల మొత్తం ఆదాయంలో 25 నుంచి 40శాతందాకా పిల్లల ద్వారానే సమకూరుతున్నట్లు అంచనా.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Posted Date: 05-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం