• facebook
  • whatsapp
  • telegram

కుదరని కూర్పు

సరికొత్త సమాచార బిల్లుకు ప్రభుత్వ కసరత్తు

వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణకు 2019లో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకొంటున్నట్లు భారత ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ఆ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) 81 సవరణలు, 12 సిఫార్సులను సూచించింది. వాటిని పరిగణనలోకి తీసుకుని సరికొత్త సమగ్ర బిల్లును వచ్చే ఏడాది పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో సమర్పిస్తామని కేంద్ర సమాచార పరిజ్ఞాన (ఐటీ) శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వచ్చే ఏడాది కేవలం ఈ ఒక్క బిల్లునే కాకుండా డేటా రక్షణ, గోప్యత, సైబర్‌ భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం విడివిడిగా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచించాయి.

వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను మొట్టమొదట 2018లో జస్టిస్‌ శ్రీకృష్ణ నాయకత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించింది. కేంద్రం దాన్ని 2019లో లోక్‌సభకు సమర్పించగా- అదే సంవత్సరం డిసెంబరులో సభ దాన్ని జేపీసీ పరిశీలనకు నివేదించింది. కమిటీ తన సిఫార్సులను 2021 డిసెంబరులో సమర్పించింది. వ్యక్తిగత-వ్యక్తిగతేతర సమాచారాన్ని, సామాజిక మాధ్యమాలను, ఈ-కామర్స్‌, ఐటీ కంపెనీలు, స్థిరాస్తి, ఫార్మా కంపెనీలు, టెలికాం, ఆస్పత్రులను సైతం బిల్లు తుది ప్రతి తన పరిధిలోకి తీసుకొంటోంది. బిల్లులోని అంశాలను పౌరులతోపాటు బడా టెక్‌ కంపెనీలూ వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దేశ సార్వభౌమత్వ రక్షణ పేరిట పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించడానికి బిల్లు వీలు కల్పిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇది పౌరుల గోప్యత హక్కుకు భంగకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పౌరుల సమ్మతి లేకుండానే వారి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకునే అధికారాన్ని ఈ బిల్లు సర్కారుకు ఇస్తోంది. 

సీమాంతర డేటా ప్రవాహాలపై బిల్లు కఠినమైన నియంత్రణలు విధించడం గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలకు నచ్చడం లేదు. ఈ బిల్లు కింద టెక్‌ కంపెనీల నుంచి సమాచారాన్ని కోరే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. భారత పౌరుల ఆర్థిక, ఆరోగ్య, బయోమెట్రిక్‌ సమాచారాన్ని దేశంలోని సర్వర్లలో మాత్రమే నిల్వచేయాలని బిల్లు స్పష్టం చేసింది. టెక్‌ కంపెనీలు వ్యక్తిగతేతర సమాచారాన్ని ఉపయోగించి తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటాయి. సామాజిక మాధ్యమ, ఇంటర్నెట్‌, ఎలెక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ కంపెనీల స్వతంత్ర డైరెక్టర్లు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కూడా డేటా రక్షణ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు శిక్షార్హులని బిల్లు స్పష్టం చేయడంపై టెక్‌ కంపెనీలు గగ్గోలుపెట్టాయి. 2019 బిల్లు పౌరులకన్నా ప్రభుత్వం, పెద్ద టెక్‌ కంపెనీల ప్రయోజనాల రక్షణకే పెద్దపీట వేస్తోందని ‘భారత్‌ ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌’ విమర్శిస్తోంది. మరోవైపు తాము సూచించినట్లు పెద్దయెత్తున సవరణలు చేయడంకన్నా వాటిని పరిగణనలోకి తీసుకుని పూర్తిగా కొత్త బిల్లు తీసుకురావడమే మంచిదని జేపీసీ అధ్యక్షుడైన భారతీయ జనతా పార్టీ ఎంపీ పి.పి.చౌధరి వ్యాఖ్యానించారు. చవగ్గా లభించే స్మార్ట్‌ ఫోన్లు, డేటా జనానికి అందుబాటులో ఉన్నందువల్ల భారతీయ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ లక్ష కోట్ల డాలర్ల పరిమాణాన్ని అందుకోనున్నది. ఈ మార్కెట్‌ నియంత్రణకు అంతర్జాతీయ ప్రమాణాలను విధించి, కట్టుదిట్టమైన సైబర్‌ చట్టాలను రూపొందించాల్సి ఉంది. డిజిటల్‌ కార్మిక విపణులు, ఈ-కామర్స్‌ నానాటికీ విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత సమాచారం, గోప్యతల పరిరక్షణకు పకడ్బందీ చట్టాన్ని తీసుకురాక తప్పదు.

- వరప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పరిశోధనలే దన్నుగా పురోగమనం

‣ మాల్దీవులతో స్నేహబంధం

‣ మూడో ప్రపంచ యుద్ధ భయం!

‣ మిగ్‌ పాపం ఎవరిది?

‣ పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు

Posted Date: 09-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం