• facebook
  • whatsapp
  • telegram

అవరోధాల సుడిలో మానవాభివృద్ధి

ప్రజలకు ఉత్తమ జీవన పరిస్థితులను కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. విభిన్న అంశాల్లో పురోగతి సాధిస్తేనే సానుకూల జీవన పరిస్థితులు నెలకొంటాయి. అందుకోసం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే, మానవాభివృద్ధి సూచీలో భారత్‌ ర్యాంకు 132కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఆరోగ్యకర జీవనం, విద్యా స్థితిగతులు, మెరుగైన జీవన శైలి... మానవాభివృద్ధిని నిర్దేశించే ప్రమాణాలు. ఈ ప్రాథమిక అంశాల్లో సముపార్జించే పురోగతి మానవాభివృద్ధిలో ఒక దేశం సాధించే విజయంగా భావిస్తారు. ఇలాంటి మానవాభివృద్ధి సూచీలో భారత్‌ క్షీణత కొనసాగుతోంది. తాజాగా ప్రపంచంలోని 191 దేశాల్లో 132వ స్థానాన్ని పొందింది. మానవాభివృద్ధిని కొలిచే అంశాల ఆధారంగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ర్యాంకులను నిర్దేశిస్తూ సవివర నివేదికను విడుదల చేసింది. తాజా నివేదికలో భారత మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) విలువను 0.633గా పేర్కొంది. 2020లో హెచ్‌డీఐ విలువ 0.645తో పోలిస్తే ఇది తక్కువే. ఆ ఏడాది 189 దేశాల జాబితాలో 131వ ర్యాంకుతో నిలిచింది. దేశం పనితీరు గతంలోకంటే తగ్గడానికి ఆయుర్దాయం క్షీణతే కారణంగా పేర్కొంది. కొవిడ్‌ ప్రభావం కారణంగా 90 శాతం దేశాలు వెనకంజవేశాయి.

ప్రపంచవ్యాప్తంగా క్షీణత

కొవిడ్‌ వ్యాప్తి, ఉక్రెయిన్‌ యుద్ధం, పర్యావరణ సవాళ్లు వంటి బహుళ సంక్షోభాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పది దేశాల్లో తొమ్మిది- మానవాభివృద్ధి పనితీరులో క్షీణతను నమోదు చేశాయి. గత 32 సంవత్సరాల్లో మొదటిసారిగా మానవాభివృద్ధి నిలిచిపోయిందని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొంది. ప్రపంచ పోకడలకు అనుగుణంగానే ఇండియా హెచ్‌డీఐ కూడా తగ్గింది. ఆయుర్దాయం 70.7 ఏళ్ల నుంచి 67.2 ఏళ్లకు పడిపోవడమే హెచ్‌డీఐ తగ్గడానికి కారణమని చెప్పవచ్చు. పొరుగు దేశాల్లో శ్రీలంక 73వ స్థానం, చైనా 79, బంగ్లాదేశ్‌ 129, భూటాన్‌ 127వ స్థానంలో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. పాకిస్థాన్‌ 161, నేపాల్‌ 143, మయన్మార్‌ 149వ స్థానాలతో ఇండియా కంటే వెనకబడి ఉన్నాయి. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానతలు 6.7 శాతం పెరిగాయి. పునరుత్పత్తి ఆరోగ్యం, సాధికారత, శ్రామిక మార్కెట్‌ అనే మూడు కోణాల్లో మహిళలు, పురుషుల మధ్య అసమానతలను ఈ సూచీ కొలుస్తుంది. భారత్‌ హెచ్‌డీఐ 1990 నుంచి క్రమంగా ప్రపంచ సగటుకు చేరుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది మానవాభివృద్ధిలో ప్రపంచ పురోగతి రేటు కంటే వేగవంతంగా ఉన్నట్లు సూచిస్తోంది. కాలక్రమంలో దేశం అనుసరించిన విధానాలు, ఆరోగ్యం, విద్యా రంగాల్లో చేసిన వ్యయాల ఫలితంగా ఇదంతా సాధ్యమైనట్లు వివరించింది. అనిశ్చితి, పునరుత్పాదక ఇంధన వాడకం, బలహీన వర్గాలకు సామాజిక భద్రతను పెంపొందించడం, యూఎన్‌డీపీ సహకారంతో ‘కొ-విన్‌’ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఇండియా ఇప్పటికే అగ్రగామిగా నిలిచిందని భారత్‌లోని యూఎన్‌డీపీ ప్రతినిధి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 27.1 కోట్ల ప్రజానీకాన్ని పేదరికం విషవలయం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు నివేదిక స్పష్టంచేసింది. రాజకీయంగా నిబద్ధతతో ప్రజారోగ్యం, విద్య, పోషకాహారాన్ని బలోపేతం చేసే సమ్మిళిత విధానాలను రూపొందించినట్లయితే భారత హెచ్‌డీఐ స్కోరు గణనీయంగా మెరుగు పడుతుంది. ఇలాంటి విధానాల సాయంతో మరింత సమానత్వాన్ని సాధించడం ద్వారా లింగ దుర్విచక్షణను సైతం అంతం చేయవచ్చు.

ఆ అయిదూ కీలకం...

మానవాభివృద్ధిలో మెరుగైన స్థానాన్ని పొందడానికి పెట్టుబడులకు అడ్డంకులు లేకుండా చూడటం, పనితీరు మూల్యాంకనం, అసమానతలను తగ్గించడం, పరిపాలన సంస్కరణలు, వినూత్న పరిష్కారాలు అనే అయిదు అంశాలను భారత్‌ పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో మొదటి అంశం- సామాజిక రంగంలో పెట్టుబడులకు ఉన్న అడ్డంకులను అధిగమించడం. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు మొదలైన రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరం. కొత్త ఆదాయ వనరులను సృష్టించే సాంప్రదాయక విధానాన్ని క్రమబద్ధీకరించాలి. సబ్సిడీలకు హేతుబద్ధమైన లక్ష్యం ఉండాలి. సామాజిక రంగ అభివృద్ధికి ఉద్దేశించిన ఆదాయాలను సక్రమంగా వినియోగించాలి. రెండో అంశం- వివిధ కార్యక్రమాలు, పథకాల పనితీరును ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడం. విధాన రూపకల్పన స్థాయి నుంచి అమలు వరకూ సామాజిక మదింపు ఉండాలి. సంఘ సభ్యుల అర్థవంతమైన భాగస్వామ్యం వంటి వినూత్న పద్ధతులు సామాజిక అభివృద్ధిలో సానుకూల ఫలితాలను ఇస్తాయి. అసమానతలను తగ్గించడం మూడో ప్రధాన అంశం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లోని వివిధ రూపాల్లో ఉన్న అసమానతలు హెచ్‌డీఐని ప్రభావితం చేస్తాయి. దేశంలో అన్ని రకాల అసమానతలను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. సేవల పంపిణీలో అవినీతి చోటుచేసుకొంటోంది. పాలన సంస్కరణలను నాలుగో అంశంగా పరిగణనలోకి తీసుకోవాలి. దేశ ప్రగతికి అడ్డుగా నిలుస్తున్న అవరోధాలను అధిగమించడానికి సుపరిపాలన ప్రధాన సూత్రాలకు కట్టుబడి కొత్త నిర్వహణ పద్ధతులను అవలంబించడం ద్వారా సమగ్ర సంస్కరణలను తీసుకురావాలి. కొత్త అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవడానికి వినూత్న విధానాలు, కార్యక్రమాలను రూపొందించడం అయిదో ప్రధాన అంశం. ఇందుకు అవసరమైన పరిశోధన-అభివృద్ధిపై దృష్టి సారించాలి. వాస్తవిక వృద్ధికి ఎదురవుతున్న సవాళ్లకు వినూత్నమైన, లోతైన పరిష్కారాలను కనుగొనడాన్ని ప్రధాన కర్తవ్యంగా ప్రభుత్వం భావించాలి.

సమానత్వమేదీ?

ప్రజలకు వంద శాతం అక్షరాస్యతను అందించడం, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం, కాలుష్యరహిత వాతావరణాన్ని సృష్టించడంపైనే ఆయా దేశాల మానవాభివృద్ధి సూచీలు ఆధారపడతాయి. వివిధ రూపాల్లో అసమానత, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు కూడా హెచ్‌డీఐలో ర్యాంకింగ్‌ను ప్రభావితం చేస్తాయి. నార్వే, స్విట్జర్లాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి మంచి పనితీరు కనబరుస్తున్న దేశాలు కొన్నేళ్లుగా అసమానతల అంతరాన్ని తగ్గించడంలో అద్భుత విజయాల్ని సాధించాయి. అన్ని రకాల అసమానతలను తొలగించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తున్నా- ఆశించిన ఫలితాలు రావడం లేదు. పరిపాలనలో గణనీయమైన సంస్కరణలు సాధించినా, వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో లింగ సమానత్వాన్ని నిర్ధారించడంలో భారత సంప్రదాయ విధానాల అసమర్థత వల్ల శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ అధ్వానంగానే ఉంది. సమానత్వాన్ని సాధించే మార్గాల గురించి విధాన రూపకర్తలు పునరాలోచించాల్సిన అవసరాన్ని హెచ్‌డీఐ సూచిస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ‘తీస్తా’ ఒప్పందంపై ప్రతిష్టంభన

‣ వాణిజ్య ఒప్పందాలపై ఆచితూచి...

‣ ఆత్మనిర్భరతే భారత్‌ కర్తవ్యం

‣ సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

Posted Date: 19-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం