• facebook
  • whatsapp
  • telegram

సమస్యల ఊబిలో రేపటి పౌరులు

నేటి బాలలే భావి భారత పౌరులు అన్న మాటలు నేతల ప్రసంగాలకే పరిమితం అవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచినా, నేటికీ బాలబాలికలకు సరైన ప్రయోజనాలు దక్కడం లేదు. అక్రమ రవాణా, చదువుకు దూరమవడం, బాల కార్మిక వ్యవస్థ వంటి సమస్యలు చిన్నారుల పాలిట శాపంగా మారాయి. 

భారత్‌లో పధ్నాలుగేళ్లలోపు పిల్లల జనాభా 35.8 కోట్లు. దేశ మొత్తం జనాభాలో ఇది 25.78శాతం. దేశీయంగా 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత విద్య అందించే ఉద్దేశంతో 2009లో కేంద్రం ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం తెచ్చింది. అది సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ‘యూడైస్‌ 2021-22’ గణాంకాల ప్రకారం కరోనా తరవాత లక్షల సంఖ్యలో చిన్నారులు పాఠశాలలకు దూరమయ్యారు. దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా అందించాల్సిన విద్యను ప్రభుత్వమే దూరం చేస్తున్న దుస్థితి నెలకొంది. 2020-21 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 15.09లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆ మరుసటి ఏడాదికి అవి 14.89 లక్షలకు పడిపోయాయి. హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వం పాఠశాలలను కుదిస్తుండటం, ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో పేద పిల్లలకు ఉచిత విద్య అందడం లేదు. పాఠశాలలు దూరంగా ఉండటంతో తమ పిల్లలను ముఖ్యంగా బాలికలను పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఫలితంగా ఎంతోమంది పిల్లలు మధ్యలోనే బడి వదిలేస్తున్నారు.

సమస్యలెన్నో...

ప్రభుత్వ పాఠశాలల్లో తగినంతమంది ఉపాధ్యాయులు లేకపోవడమూ ప్రధాన సమస్యగా మారింది. ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో ఉద్యోగ విరమణ చేస్తున్నా, పోస్టులను భర్తీ చేయడంలేదు. గత పదేళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిలో భారీగా అంతరం పెరిగిందని యునెస్కో నివేదిక స్పష్టం చేసింది. పిల్లలను ప్రమాదకర పనుల్లో పెట్టకుండా నివారించేందుకు బాలకార్మిక నిషేధ చట్టాన్ని కేంద్రం తెచ్చింది. నేటికీ ఎంతోమంది చిన్నారులు చదువుకు దూరమై ఇటుక బట్టీలు, వస్త్ర పరిశ్రమ, మైనింగ్‌, హోటళ్లు వంటివాటిలో గొడ్డు చాకిరిచేస్తూ కునారిల్లిపోతున్నారు. మరెందరో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నారు. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపాలన్నది ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. అందుకోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్రం గొప్పలు చెబుతోంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది బాలకార్మికుల్లో ఒకరు భారత్‌లోనే ఉన్నారని అధ్యయనాలు చాటుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 5-17 ఏళ్ల మధ్య వయసున్న బాల కార్మికులు భారత్‌లోనే అధికంగా ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) వెల్లడించింది. కైలాస్‌ సత్యార్థి ఫౌండేషన్‌ అంచనా ప్రకారం 2025 నాటికి 74.3 లక్షల మంది బాల కార్మికులు దేశంలో ఉంటారని అంచనా. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ లెక్కల ప్రకారం దేశీయంగా ఏటా 40 వేల మంది చిన్నారులు అపహరణకు గురవుతున్నారు. 11వేల మంది పూర్తిగా కనిపించకుండా పోతున్నారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. దేశీయంగా లక్షల సంఖ్యలో చిన్నారులు పోషకాహారం అందక వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. కేంద్రం లెక్కల ప్రకారమే భారత్‌లో 33.23 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మహారాష్ట్ర, బిహార్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో పోషకాహార సమస్య మరింతగా జడలు విప్పుతోంది. అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం దేశీయంగా అయిదేళ్లలోపు చిన్నారుల్లో 35.5శాతం వయసుకు తగ్గ ఎత్తు లేరు. 32శాతం పిల్లలు వయసుకు తగిన బరువు లేరు. వచ్చే అయిదేళ్లలో రూ.1.31 లక్షల కోట్లతో కోట్లాది పిల్లలకు పోషకాహారం అందించడానికి గతేడాది పీఎం పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ పథకాన్ని కేంద్రం తెచ్చింది. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో ఇప్పటికీ ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. వాటి పరిష్కారంపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సరైన శ్రద్ధ చూపాలి.

సమర్థ చర్యలు కీలకం

గతేడాది బడ్జెట్‌లో కేంద్రం విద్యకు రూ.93,223 కోట్లు కేటాయించింది. అందులో రూ.88,002కోట్లే ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.1.04లక్షల కోట్లు ప్రకటించారు. అందులో ఎంత ఖర్చు చేస్తారన్నది చూడాలి. పీఎం పోషణ్‌ అభియాన్‌కు సమధిక నిధులు వెచ్చించి మారుమూల ప్రాంతాలకు సైతం పోషకాహారం అందేలా చూడాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు సమర్థ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే విధంగా ఏటా రెండుసార్లు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. ఆయా కార్యక్రమాల అమలును సమన్వయపరచే బాధ్యతను విద్యాశాఖతోపాటు ఐసీడీఎస్‌, కార్మిక శాఖలకు అప్పగిస్తూ పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని కొలువుతీర్చాలి. బాలబాలికల కోసం తెచ్చిన పథకాలకు సమధిక నిధులు కేటాయించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తేనే పటిష్ఠమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుంది.

- యార్లగడ్డ అమరేంద్ర
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భద్రతతోనే మహిళా సాధికారత

‣ వణికిస్తున్న ప్రకృతి విపత్తులు

‣ జీ20 నాయకత్వం బృహత్తర అవకాశం

‣ ద్వైపాక్షిక బంధానికి కొత్త చివుళ్లు

‣ నీరుగారుతున్న సహ చట్ట స్ఫూర్తి

Posted Date: 26-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం