• facebook
  • whatsapp
  • telegram

జన సంద్రం... వినియోగించుకుంటే వరం!

భారతదేశం జనాభాపరంగా వచ్చే ఏడాదే చైనాను మించిపోనుంది. ఇది - ప్రపంచ జనాభా తీరుతెన్నులపై ఐక్యరాజ్యసమితి జులై 11న విడుదల చేసిన 2022 సంవత్సర నివేదిక అంచనా. 1947లో 35 కోట్లుగా ఉన్న దేశ జనాభా నేడు 140 కోట్లకు చేరుకుంది. జనాభా విస్ఫోటాన్ని అరికట్టడానికి కఠిన చట్టం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. జనాభా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు   విఫలమయ్యాయనే విమర్శలూ పెరిగాయి. అధిక జనాభా   దేశానికి శాపంగా పరిణమిస్తుందా, వరంగా మారుతుందా అని తరచి చూసుకోవలసిన తరుణమిది.

స్వాతంత్య్రం వచ్చాక గత 75 ఏళ్లలో భారత జనాభా విపరీతంగా పెరిగిపోయింది. 1947లో భారతీయుల సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలుగా ఉండేది. అది క్రమక్రమంగా పెరుగుతూ నేడు 70 ఏళ్లకు చేరుకుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం జనాభా నియంత్రణకన్నా వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధే తారక మంత్రంగా 1951 నుంచి చేపట్టిన పంచవర్ష ప్రణాళికలు గణనీయ ఫలితాలను అందించాయి. 1951లో పండించిన ఆహార ధాన్యాలకన్నా 1.7 రెట్లు ఎక్కువ ఆహారోత్పత్తిని భారతీయ రైతు 1966కల్లా సాధించాడు. ప్రతి ఒక్కరూ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే అధిక జనాభా అనేది సమస్యే కాబోదని తొలి ప్రధాని నెహ్రూ విశ్వసించేవారు. ఇందిరాగాంధీ హయాములో అధిక జనాభాపై చర్చ మొదలైంది. 1965లో రుతుపవనాల వైఫల్యంతో కరవు పరిస్థితులు నెలకొనడంతో అమెరికాతోపాటు అంతర్జాతీయ ఒత్తిడి వల్ల జనాభా నియంత్రణపై ఇందిర దృష్టి సారించారు. అధిక జనాభా అనర్థదాయకమనేది ఆమె విశ్వాసం. ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరునాడే ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేరును ఆరోగ్య, కుటుంబ నియంత్రణ శాఖగా మార్చేశారు. అధిక దిగుబడి వరి, గోధుమ వంగడాల సాగు, ఎరువులు, నీటిపారుదల వసతుల విస్తరణపై అధిక పెట్టుబడుల కారణంగా 1969కల్లా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అయినా ప్రభుత్వం కుటుంబ నియంత్రణకు అధిక ప్రాధాన్యం కొనసాగించింది. ఇందిర హయాములో అత్యవసర పరిస్థితి విధించాక ఈ విధానం ముమ్మరంగా అమలైంది. భారత్‌లో మొట్టమొదటి జాతీయ జనాభా విధానాన్ని 1976లో ప్రకటించారు. ఆపైన పురుషులకు నిర్బంధ వేసెక్టమీ చికిత్సా శిబిరాలను ఏర్పాటు చేశారు. గర్భనిరోధక పద్ధతులను బలవంతంగా అమలుచేశారు. ఇదంతా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసి, తరవాత వచ్చిన ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు వెనకాడాల్సిన పరిస్థితి నెలకొంది. 2000 సంవత్సరంలో ప్రకటితమైన కొత్త జాతీయ జనాభా విధానం స్వచ్ఛంద కుటుంబ నియంత్రణకు, జనన మరణాల మధ్య సమతుల్య రేటు సాధించడానికి ప్రాధాన్యం ఇచ్చింది.

అందరిమధ్యా సమతూకం

ప్రతి జంటా ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలన్న నియమాన్ని పాటించేలా చూడాలని 2018లో 125 మందికిపైగా పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతికి లేఖ రాశారు. జనాభా నియంత్రణకు పట్టుబట్టడం అంతర్యుద్ధం వంటి పరిస్థితికి దారితీస్తుందని అదే ఏడాది సుప్రీంకోర్టు హెచ్చరించింది. భాజపా ఏలుబడిలోని ఉత్తర్‌ ప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలు ఇటీవలి కాలంలో ఇద్దరు బిడ్డలు ముద్దు విధానాన్ని చురుగ్గా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వోద్యోగులు నిక్కచ్చిగా ఇద్దరు పిల్లల విధానం పాటించాలని 2017లో అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 2021లో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్న కుటుంబాలకు సంక్షేమ పథకాలను వర్తింపజేసేది లేదని, ప్రభుత్వ సబ్సిడీలు అందవని ప్రకటించింది. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలను కంటే ప్రభుత్వ ఉద్యోగానికి, పదోన్నతికి అనర్హులవుతారని తీర్మానించింది. అల్పసంఖ్యాకవర్గాల ప్రజలు కుటుంబ నియంత్రణ పాటించకపోతే పేదరికం నుంచి ఎన్నటికీ బయటపడలేరని యూపీ, అస్సాం ముఖ్యమంత్రులు హెచ్చరించారు. కర్ణాటక, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ఇలాంటి విధానాలనే చేపట్టాలని కొందరు భాజపా నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 2021-30 జనాభా విధానాన్ని ప్రకటిస్తూ అన్ని మతాల జనాభాల మధ్య సమతూకం ఉండాలన్నారు. ఏ మతంలోనైనా పేదలు, నిరక్షరాస్యులే అధిక సంతానం పొందుతున్నారన్న సంగతి గ్రహించాలి.

తగ్గిన వృద్ధిరేటు

గడచిన 50 ఏళ్లలో భారత జనాభా వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిన మాట నిజం. 1972లో వార్షిక జనాభా పెరుగుదల రేటు రెండు నుంచి మూడుశాతం వరకు ఉండగా, ఇప్పుడది ఒక శాతానికి తగ్గిపోయింది. జాతీయ సగటును పరిశీలిస్తే గతంలో ఒక మహిళ 5.4 మంది పిల్లలకు జన్మనిస్తే ఇప్పుడది 2.1కి తగ్గిపోయింది. ఇది రోజురోజుకీ తగ్గిపోతోంది. వచ్చే దశాబ్దంలో భారత జనాభా పెరుగుదలలో మూడో వంతు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలోనే సంభవించనున్నది. బిహార్‌ 2039 నాటికి ఒక మహిళకు 2.1 మంది పిల్లలనే ప్రమాణాన్ని అందుకొనే అవకాశం ఉంది. జననాలు, మరణాల మధ్య సమతూకం పాటిస్తూ జనాభాను స్థిరీకరించే రేటు అది. ఈ ప్రమాణాన్ని కేరళ 1998లోనే అందుకున్నది. దేశమంతా ఈ స్థిరీకరణ రేటును అందుకోవడానికి ఇంకా 40 ఏళ్లు పట్టవచ్చు. అప్పటికి భారత జనాభా స్థిరపడుతుంది. జనాభాలో పనిచేసే వయసులోనివారి సంఖ్య 2035నాటికి 57 శాతంగా ఉంటుంది. 1985-2015 మధ్య చైనా ఈ యువజనాభాను ఉపయోగించుకుని అత్యంత వేగంగా అభివృద్ధి సాధించి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. భారతదేశానికి కూడా యువజనాధిక్యత సిద్ధిస్తుంది. వారికి ఉపాధి అవకాశాలు చూపితే ప్రపంచంలో అగ్ర ఆర్థిక శక్తుల్లో ఒకటిగా వెలిగిపోతుంది. నిర్బంధ కుటుంబ నియంత్రణ బదులు యువతకు నైపుణ్య  శిక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి యువజనాధిక్యతను వరంగా మలచుకోవాలి.

భవిష్యత్తులో సవాళ్లు

నానాటికీ జనాభా పెరిగిపోతుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. జనాభా విస్ఫోటాన్ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని 2019లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ పిలుపిచ్చారు. అధిక జనాభా భవిష్యత్తులో తీవ్ర సవాళ్లు తెచ్చిపెడుతుందన్నారు. చిన్న కుటుంబాలు కలిగినవారిని అభినందిస్తూ కుటుంబ నియంత్రణ దేశభక్తికి చిహ్నమని మోదీ ఉద్ఘాటించారు. అయితే, అధిక జనాభా దేశార్థికంపై సానుకూల ప్రభావం చూపుతుందా, వినాశకర ఫలితాలకు దారితీస్తుందా అనే దిశగా అధ్యయనం సాగాలి. జనాభా వృద్ధిని అరికట్టడంలో చైనా నుంచి నేర్చుకోవలసింది ఏమైనా ఉందా అనేదీ పరిశీలించాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

‣ పొంచి ఉన్న ఆహార అభద్రత

‣ ప్రాబల్యం కోసం కోరిమరీ వైరం

‣ రైతుకేదీ...‘ఉత్సవం’?

‣ మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

Posted Date: 30-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం