• facebook
  • whatsapp
  • telegram

న్యాయవ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

సత్వర న్యాయం అందించడానికి సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఇటీవల ఉద్ఘాటించారు. కోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ ఇందులో కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. దేశీయంగా న్యాయ వ్యవస్థలో ఊపందుకొంటున్న డిజిటల్‌ సాంకేతికతలు పౌరులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

రాజ్యాంగ స్ఫూర్తిని, పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించే బాధ్యతను మన న్యాయవ్యవస్థ సమర్థంగా నిర్వహిస్తోంది. అధునాతన సాంకేతికతలతో మారుతున్న కాలానికి తగినట్లు తానూ మారాలని గ్రహించింది. అందుకే సుప్రీంకోర్టు మొదలుకొని దిగువ కోర్టుల విచారణ కార్యకలాపాలను వీడియో రూపంలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని 2018నాటి స్వప్నిల్‌ త్రిపాఠి వర్సెస్‌ సుప్రీంకోర్టు కేసులో గుర్తించారు. నిజానికి 2003లోనే స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వర్సెస్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ కేసులో వర్చువల్‌ కోర్టు సూత్రాన్ని సమర్థించారు. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సాక్ష్యాధారాలను నమోదు చేయడం చట్టసమ్మతమని ఆ కేసులో నిర్ధారించారు. అప్పటి నుంచి దేశంలో పలు కోర్టులు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ కొనసాగిస్తున్నాయి.

ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

పౌరుల సాధికారత సాధనకు, హక్కుల రక్షణకు ప్రస్తుతం ప్రపంచమంతటా సాంకేతిక పరిజ్ఞానం గొప్ప సాధనమైంది. భారత ప్రభుత్వం సైతం డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా న్యాయవ్యవస్థలో సాంకేతికత వినియోగానికి ఏర్పాట్లు చేసింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికతలను శాసన, న్యాయ, ప్రభుత్వ వ్యవస్థల దైనందిన కార్యకలాపాల్లో క్రమంగా విస్తరిస్తోంది. మెషీన్‌ లెర్నింగ్‌, ఏఐల వంటి అత్యధునాతన సాంకేతికతలు కోర్టుల్లో కొన్నేళ్లుగా పేరుకుపోయిన పెండింగ్‌ కేసుల పరిష్కారానికి, సత్వర న్యాయానికి సాయపడతాయి. జిల్లా, తాలూకా స్థాయి కోర్టుల్లో నాలుగు కోట్లకు పైగా కేసులు, హైకోర్టుల్లో దాదాపు 59 లక్షలకుపైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. కేసు రికార్డులను వేగంగా పరిశీలించి న్యాయం అందించడానికి బిగ్‌ డేటా తోడ్పడుతుంది.

న్యాయ సాధనలో మెషీన్‌ లెర్నింగ్‌, ఏఐ, సహజ భాషా విశ్లేషణ, డిజిటల్‌ షేరింగ్‌, రికార్డుల నిర్వహణ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సాంకేతికతలతో పూర్వ తీర్పులను వేగంగా పరిశీలించి తమ వాదనలను సిద్ధం చేసుకోవడానికి అనేక న్యాయ సేవా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కృత్రిమ మేధా అన్వయ సంఘం కోర్టు రికార్డుల అనువాదం, చట్టపరమైన పరిశోధనలో సహకారం, న్యాయ ప్రక్రియల ఆటొమేషన్‌కు ఏఐ తోడ్పడుతుందని గుర్తించినట్లు కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవల పార్లమెంటుకు తెలిపారు. ఎలెక్ట్రానిక్‌ కోర్టుల (ఈ-కోర్టు) స్థాపనలో రెండో దశను అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏఐ ఆధారిత పరిశోధన పోర్టల్‌ సుపేస్‌ను నిరుడు రిజిజు ప్రారంభించారు. ఇది మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో కేసుల సమాచార రాశిని విశ్లేషించడానికి తోడ్పడుతుంది.

ఎలెక్ట్రానిక్‌ రికార్డులను వేగంగా, భద్రంగా ప్రసారం చేయడానికి ఫాస్టర్‌ అనే డిజిటల్‌ వేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఏర్పరచారు. కోర్టు అధికారులు సంబంధిత సంస్థలు, వ్యక్తులకు కోర్టు తీర్పుల ఎలెక్ట్రానిక్‌ ప్రతులను వేగంగా పంపడానికి ఇది తోడ్పడుతోంది. న్యాయ శాఖ చేపట్టిన డిజిటల్‌ పథకాల గురించి దివ్యాంగులు సైతం తెలుసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి వాటి వల్ల పౌరులు హైకోర్టు తీర్పులు, ఆదేశాలను ఆన్‌లైన్‌లో వీక్షించగలుగుతున్నారు. గుజరాత్‌, ఒడిశా, కర్ణాటక, ఝార్ఖండ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టుల కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. ఈ-కోర్టుల పథకం, న్యాయమూర్తుల నియామకం, ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టులు, న్యాయ బంధు, గ్రామ న్యాయాలయ, దిశా, టెలీ లా వంటి పథకాల గురించి పౌరులు ఆన్‌లైన్‌లో తెలుసుకోగలుగుతున్నారు. ఆంగ్లంతోపాటు కన్నడ, తమిళం, గుజరాతీ వంటి భాషల్లోనూ కోర్టు కార్యకలాపాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటం న్యాయవాదులకు, వ్యాజ్యదారులకు, సామాన్య పౌరులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కోర్టు ప్రక్రియ, న్యాయ సాధన గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. నిరుడు రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఈ-కోర్టు ప్రాజెక్టు కింద వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. వాటిలో వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌ పథకం- కోర్టుల్లో ఎన్ని కేసులు దాఖలయ్యాయి, ఎన్నింటిని పరిష్కరించారు, ఎన్ని పెండింగులో ఉన్నాయనే గణాంకాలను అందుబాటులో ఉంచుతుంది. జస్టిస్‌ మొబైల్‌ యాప్‌ 2.0 సాయంతో న్యాయమూర్తులు పెండింగు కేసులు, వాటి పరిష్కారం గురించి తెలుసుకోవచ్చు. ఎస్‌3వాస్‌ వెబ్‌సైట్‌ అనేది ఒక క్లౌడ్‌ సర్వీసు. ఇది జిల్లా కోర్టుల సమాచార ప్రచురణకు ఉపకరిస్తుంది. పలు భాషల్లో కొనసాగే ఈ వెబ్‌సైట్‌ ప్రభుత్వ విభాగాలకే కాకుండా పౌరులకూ అందుబాటులో ఉంటుంది. ఈ పథకాలు న్యాయవ్యవస్థలో ఆటొమేషన్‌ను ప్రవేశపెడుతున్నాయి.

మధ్యవర్తిత్వంతో మేలు

భారత్‌లో ప్రస్తుతం దాదాపు నాలుగు లక్షల ఖైదీలు విచారణ కోసం ఎదురుచూస్తూ జైళ్లలో మగ్గిపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలే. వీరి కేసులను వేగంగా విచారించి పరిష్కరించడానికి డిజిటల్‌ సాంకేతికతలను వినియోగించాలి. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించి పెండింగు కేసుల కొండను కరిగించవచ్చు. న్యాయ విద్యా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత, ఏఐ, సైబర్‌ భద్రత, బయో ఎథిక్స్‌లను సైతం బోధించాలి. కోర్టులు కేసులను వేగంగా పరిష్కరించలేకపోతే పౌరులకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుంది. ఆలస్యంగా న్యాయం జరిగితే... అసలు న్యాయం దక్కనట్లే. ఈ నానుడిని గుర్తుంచుకొని సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేగంగా న్యాయం అందించాలి.

రోబోల సాయం

ఇండియాలో ప్రభుత్వమే అతిపెద్ద వ్యాజ్యదారు. అందువల్ల వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు దాఖలు చేసిన కేసుల విచారణలో పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్వ కేసుల పురోగతిని తెలుసుకోవడానికి లింబ్స్‌ అనే వెబ్‌ ఆధారిత అప్లికేషన్‌ను కేంద్ర న్యాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. రెండు మూడేళ్ల క్రితం సాంకేతిక పరిజ్ఞానంతో న్యాయ ప్రక్రియను ముందుకు నడిపే విధానం ప్రపంచంలో ఎక్కడా లేనప్పుడే భారత్‌ ఆ విషయంలో పెద్ద ముందడుగు వేసింది. అప్పట్లో ఇతర దేశాల్లో కోర్టులకు చిన్న స్థాయి సాంకేతిక పరిష్కారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అమెరికాలో ప్రస్తుతం చాలా కోర్టులు ఆన్‌లైన్‌ వివాద పరిష్కార ప్రక్రియను చేపడుతున్నాయి. లాస్‌ఏంజెల్స్‌ ఉన్నత న్యాయస్థానం- పౌరులు ట్రాఫిక్‌ కేసులను పరిష్కరించుకోవడానికి గినా అనే ఆన్‌లైన్‌ సహాయక వ్యవస్థను అందుబాటులో ఉంచింది. ఎస్తోనియా చిన్న కేసుల పరిష్కారానికి రోబో జడ్జిని రూపొందించే పనిలో ఉంది. చైనాలో 100 రోబోలు కేసుల వివరాలను కోర్టులకు అందించే పనిలో నిమగ్నమయ్యాయి.

- పీవీఎస్‌ శైలజ 

(సహాయ ఆచార్యులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పొంచి ఉన్న ఆహార అభద్రత

‣ ప్రాబల్యం కోసం కోరిమరీ వైరం

‣ రైతుకేదీ...‘ఉత్సవం’?

‣ మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

Posted Date: 07-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం