• facebook
  • whatsapp
  • telegram

సామాజిక న్యాయమే ప్రపంచ గమ్యం

సామాజిక న్యాయం లేనిదే సాంఘిక ప్రగతి సాధ్యపడదు. సర్వజన సమానత్వం, మానవ హక్కుల రక్షణ, దారిద్య్ర నిర్మూలన ద్వారానే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. దీనిపై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఏటా ఫిబ్రవరి 20ని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరపాలని 2007లో ప్రకటించింది. సామాజిక న్యాయం ద్వారా సరైన ప్రపంచీకరణ సాధించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2008లో తీర్మానించింది. 2009 నుంచి ఏటా అధికారికంగా సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

అత్యధిక దేశాల్లో చిరకాలం నుంచి ఉన్న అసమానతలు, పేదరికం స్థాయులు కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల మరింత పెరిగిపోయాయి. వాతావరణ మార్పులు ఈ అసమానతా అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఒక చోట సంభవించే పరిణామాలు మిగతా దేశాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల సామాజిక న్యాయ సాధన అనేది ఏ ఒక్క దేశానికో లేదంటే కొన్ని రాజ్యాలకో మాత్రమే పరిమితం కాదని, అది ప్రపంచమంతా ఏకతాటిపై నిలిచి సాధించాల్సిన లక్ష్యమని స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వివిధ సామాజిక న్యాయ సాధన పథకాలను అమలులోకి తెచ్చాయి. అమెరికాలో పోలీసు సంస్కరణలు, ఓటింగ్‌ హక్కుల రక్షణ, ఆర్థిక సమానత్వ సాధనకు ఇటీవల సముచిత విధానాలను చేపట్టారు. జాత్యహంకార నిరోధానికి అధ్యక్షుడు జో బైడెన్‌ పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలు తమ సొంత పౌరులకే కాకుండా వలసదారులకూ సామాజిక న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నాయి.

రాజ్యాంగమే రక్ష

సామాజిక, ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సమాన అవకాశాలు, వనరులు అందాలని ఉద్ఘాటిస్తూ భారత రాజ్యాంగం సామాజిక న్యాయానికి పట్టం కట్టింది. సామాజిక న్యాయ సాధనకు చేసే చట్టాలన్నింటికీ రాజ్యాంగమే మూలాధారం. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయి. విద్యా ఉద్యోగాల్లో బడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై అత్యాచారాల నిరోధానికి 1989లో చట్టం చేయడం సామాజిక న్యాయ సాధనకు సోపానాలే. పౌర హక్కుల రక్షణ చట్టం (1955) మరో కీలక మలుపు. ఆరేళ్ల నుంచి 14 ఏళ్లలోపు బాలలకు తప్పనిసరిగా, ఉచితంగా చదువు నేర్పడానికి తెచ్చిన విద్యా హక్కు చట్టం (2009) సైతం సామాజిక న్యాయ సాధనలో భాగమే. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు 25శాతం సీట్లు కేటాయించాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. గర్భధారణ సమయంలోనే కాకుండా ప్రసవానంతరమూ మహిళల ఉద్యోగాలకు భరోసా ఇచ్చే మాతృత్వ ప్రయోజన చట్టం (1961) లింగ భేదాల వల్ల సామాజిక న్యాయం దెబ్బతినకుండా చూస్తోంది. ముస్లిములలో మూడుసార్లు తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ఆచారాన్ని నేరంగా పరిగణిస్తూ 2019లో తెచ్చిన ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టమూ సామాజిక న్యాయానికి తోడ్పడేదే. 2016నాటి దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టం సైతం సమానత్వం, సామాజిక న్యాయ సాధనకు దోహదం చేసేదే. పౌరులకు పని హక్కు, సామాజిక భద్రత పొందే హక్కు ఉన్నాయని రాజ్యాంగం ఉద్ఘాటిస్తోంది.

వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులు సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. కేరళలోని శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలూ దర్శనం చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం ద్వారా మత స్థలాల్లో లింగ సమానత్వానికి సుప్రీం కోర్టు బాటలు వేసింది. 2018లో భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 377వ సెక్షన్‌ను కొట్టివేయడం ద్వారా స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం తీర్పు చెప్పింది. లింగ పరమైన దుర్విచక్షణ నిర్మూలనలో ఇది ముఖ్యమైన ముందడుగు. న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటుకు సర్వోన్నత న్యాయస్థానం ఊతమిచ్చింది. కోర్టుల వెలుపల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తద్వారా అందరికీ సులభంగా న్యాయం అందే వెసులుబాటు కల్పించింది. సామాజిక న్యాయ సాధనలో ఇది ముఖ్యమైన ముందడుగు. మానవులతో పారిశుద్ధ్య పనులు చేయించడం మాన్పించి, వారికి పునరావాసం కల్పించాలని 2021లో ఇచ్చిన తీర్పు బడుగు వర్గాలకు సామాజిక న్యాయం అందించడానికి ఎంతగానో దోహద పడుతుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్‌, బేటీ బచావో బేటీ పఢావో వంటి కార్యక్రమాలతో భారత ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనకు కృషి చేస్తోంది.

సమన్వయంతో సాగితేనే...

ప్రాదేశిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అసమానతలకు తావు లేకుండా చూస్తూ సమానావకాశాలు కల్పించడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలి. అందుకోసం ప్రభుత్వ, న్యాయ వ్యవస్థలు సమష్టిగా పాటుపడాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా దాని పరిష్కారం కోసమని హడావుడిగా చట్టాలు చేయడం, ఆ తరవాత వాటి గురించి మరచిపోవడం ఆనవాయితీగా మారింది. ఫలితంగా జన బాహుళ్యానికి ఆశించిన ప్రయోజనాలు అందడం లేదు. న్యాయస్థానాల్లో జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండటమూ సామాజిక న్యాయ సాధన లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. అదే సమయంలో కేవలం చట్టాలు, కోర్టుల ద్వారానే సామాజిక న్యాయం చేకూరదని గ్రహించాలి. శాసన, ప్రభుత్వ, న్యాయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడం అత్యావశ్యకం. కోర్టులు ఇచ్చే తీర్పులు, శాసన వ్యవస్థ చేసే చట్టాలు సామాజిక న్యాయానికి చోదక శక్తులవుతాయి. వాటిని పకడ్బందీగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వ వ్యవస్థ తీసుకోవాలి. ఆధునిక అవసరాలకు అనుగుణమైన సామాజిక న్యాయ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి.

కీలక తీర్పులు

మహిళా హక్కులను రక్షిస్తూ లింగ సమానత్వాన్ని నెలకొల్పడానికి సర్వోన్నత న్యాయస్థానం పలు తీర్పులు ఇచ్చింది. విశాఖ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసులో మహిళలకు పని స్థలాల్లో లైంగిక వేధింపులు ఎదురు కాకుండా చూడటానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. షయారా బాను వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో తలాక్‌ త్రయం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. అది ముస్లిం మహిళా హక్కుల రక్షణలో పెద్ద ముందడుగు. హుసేనారా ఖాటూన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు పౌరులందరికీ ఉచితంగా న్యాయం పొందే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టీకరించింది. పౌరులకు గోప్యతా హక్కు ఉందని, అది ప్రాథమిక హక్కు అని కె.ఎస్‌.పుట్టస్వామి వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

- పీవీఎస్‌ శైలజ,

(సహాయ ఆచార్యులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూమి ఎందుకు కుంగిపోతుంది?

‣ భూ ఫలకాల మహా ఉత్పాతం

‣ ఒక అభ్యర్థి.. ఒక్కచోటే పోటీ!

‣ భయపెడుతున్న ఎల్‌ నినో

Posted Date: 20-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం