• facebook
  • whatsapp
  • telegram

తృణధాన్యాలతోనే పోషక భద్రత

భారత్‌లో ఆహార భద్రత వైపు అడుగులు పడుతున్నా పోషకాహార లోపాలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. దానికితోడు జీవనశైలి వ్యాధులు, అంతుచిక్కని రోగాలు ప్రజల కష్టార్జితాన్ని స్వాహా చేస్తున్నాయి. ఆహార అలవాట్లకు అనుగుణంగా అందరికీ పౌష్టికాహారం అందించేలా కార్యాచరణను రూపొందించడం ప్రస్తుతం అత్యవసరం. ముఖ్యంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తృణధాన్యాలు సులువుగా, చౌకగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

పౌష్టికాహార లోపంతో భారత్‌లో ఏటా పెద్ద సంఖ్యలో పేదలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక అంచనా ప్రకారం ఇండియాలో సుమారు 15శాతం ప్రజలు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో మూడింట ఒక వంతు భారత్‌లోనే ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తెలిపింది. సరైన ఆహారం దక్కని కారణంగా తలెత్తే వ్యాధులతో భారత్‌లో నిత్యం మూడు వేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు గతంలోనే పరిశీలనలు వెల్లడించాయి. భారత్‌లో దశాబ్దాలుగా అధిక శాతం ప్రజలు పాలిష్‌ చేసిన బియ్యం, గోధుమల వాడకానికే పరిమితమయ్యారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం తక్కువవుతోంది. ఫలితంగా రోగనిరోధక శక్తి క్షీణించి వ్యాధులు దాడి చేస్తున్నాయి. పోషకాహార ప్రాముఖ్యంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.

దక్కని మద్దతు ధర

భారత్‌లో పోషకాల సమస్య ఇంతగా పెరిగిపోవడానికి చాలా కారణాలున్నాయి. గత రెండు మూడు దశాబ్దాలుగా పోషకాలున్న ఆహార పంటల రకాలు దేశీయంగా అందుబాటులోకి రాలేదు. నేలలోని పోషకాలను గుర్తించి దానికి అనుగుణంగా ఎరువులను ఉపయోగించే విధానాల ఆచరణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. పండించిన పంటలకు విలువ జోడించడం ద్వారా పోషకాల స్థాయిని పెంచే పరిస్థితులు సైతం ఆశించిన మేర మెరుగుపడటం లేదు. ఉత్పత్తికి విలువ జోడించిన రూపంలో ఆహారంగా తీసుకోవడం ద్వారా పోషకాలను గణనీయంగా పొందే వీలుంది. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోలేకపోతుండటం మరో సమస్య. ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంచలేకపోవడం, పండించిన ఆహార ధాన్యాలు నిల్వ దశలో భారీగా వృథా అవుతుండటం వంటివన్నీ పౌష్టికాహార సమస్యకు కారణమవుతున్నాయి. ఫలితంగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినా అనారోగ్యాలతో అర్ధాంతర మరణాలు అధికమవుతున్నాయి.

జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, వరిగెలు వంటి వాటిని చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కొర్రలు, సామలు వంటివాటిని శుద్ధి చేసే యంత్రాలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఆరోగ్య రీత్యా చాలా మంది వాటి వాడకం పట్ల మొగ్గు చూపుతున్నారు. అయితే, వాటిని పండిస్తున్న రైతులకు మద్దతు ధరలు దక్కడంలేదు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొర్రలు, సామల ధరలు సామాన్యులు భరించలేనంత ఎక్కువగా ఉంటున్నాయి. జాతీయ ఆహార భద్రతా మిషన్‌ కింద తృణధాన్యాలను విస్తృతంగా సాగు చేసేందుకు దశాబ్ద కాలంగా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో కొంత పెరుగుదల నెలకొంది. అయినా, దేశీయంగా పోషకాహార పరిస్థితి చాలా మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా తృణధాన్యాల రైతులకు ఆశించిన మద్దతు దక్కడం లేదు. జొన్న, సజ్జ, రాగి వంటివాటికి మద్దతు ధరలు అధికంగా ప్రకటిస్తున్నా, అదే రేటుకు కొనుగోలు చేయడంలో రైతులకు భరోసా దక్కడంలేదు. దాంతో వ్యాపారులు ఇచ్చిన ధరకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరమైన ఈ ఏడాది నుంచి అయినా ఈ పంటల సాగును ఇతోధికంగా పెంపొందించాలంటే కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలి. పంపిణీపై దృష్టి సారించాలి.

పరిశోధనలు అవసరం

దేశీయంగా పోషకాహార భద్రత సాధించాలంటే తృణధాన్య పంటల ఉత్పత్తిని పెంచినంత మాత్రాన సరిపోదు. అవి పేదలకు సులభంగా దొరికేలా చూడటం ఎంతో కీలకం. రోజుకు 100 గ్రాముల చొప్పున చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో స్థానిక ఆహార అలవాట్లకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ తృణధాన్యాలు అందేలా ఉత్పత్తి, పంపిణీలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఈ పంటల ఉత్పాదకతను పెంచేందుకు పరిశోధనలను ప్రోత్సహించాలి. వరి, గోధుమ పంటలను తగ్గించి, తక్కువ నీటి వినియోగం అవసరమయ్యే చిరుధాన్యాల సాగును విస్తృతం చేయాలి. సిరిధాన్యాల సరఫరా పెరిగేకొద్దీ అవి చౌకగా అందరికీ అందుబాటులోకి వస్తాయి. తృణధాన్యాల కొనుగోలు విధానాల్లో కేంద్రం నుంచి నిర్దిష్టమైన హామీలు లేక రైతులు వాటి సాగుకు మొగ్గు చూపడం లేదు. అందువల్ల మద్దతు ధరల జాబితాలో అన్ని చిరుధాన్య పంటలకూ చోటు కల్పించి అవి కచ్చితంగా అమలయ్యేలా చూస్తే అన్నదాతలకు ఎంతో మేలు కలుగుతుంది. చౌక ధరల దుకాణాల్లో వరి, గోధుమలతో పాటు తృణధాన్యాలనూ పంపిణీ చేసేలా చూడాలి. ఆహార వృథాను కనిష్ఠ స్థాయికి పరిమితం చేయడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఎంతో అవసరం. అందుకోసం మేలైన వంగడాల రూపకల్పనపై దృష్టి సారించాలి. పంట కోత అనంతర నిల్వ, శీతలీకరణ సదుపాయాలను ఇతోధికం చేయడం ద్వారా ఆహార వృథాను నివారించవచ్చు. అప్పుడే అసలైన పోషకాహార భద్రత సాధ్యమవుతుంది.

పెరగాల్సిన అవగాహన

దేశీయంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల ఆదాయం పెరిగింది. అయితే, వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా చుట్టుముడుతున్న రోగాలతో ఆ సంపాదనలో అధిక భాగం ఊడ్చుకుపోతోంది. కరోనా మహమ్మారి విజృంభణ తరవాత అంతుచిక్కని రోగాలతో ప్రజలు నిత్యం భయపడాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా సరైన ఆహారం తీసుకోవడం పట్ల ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సి ఉంది. ఒకప్పుడు పేదల ఆహారంగా పేరొందిన తృణధాన్యాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పప్పుధాన్యాలు, చిరుధాన్య పంటలను విరివిగా సాగు చేయడం, అవి అందరికీ అందేలా చూడటం నేడు ఎంతో కీలకం. ఇండియాలో ఆశించిన స్థాయిలో పంటలు పండుతున్నా, అవి అందరికీ సరిగ్గా అందుబాటులో ఉండటంలేదు. ముఖ్యంగా చిరుధాన్యాలు సామాన్యులకు అందనంత దూరంలోనే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో వాటి వినియోగం కొంత పెరుగుతున్నా అది ఆరోగ్య స్పృహ ఉన్నవారికే పరిమితమవుతోంది. తృణధాన్యాలను విస్తృతంగా సాగుచేసే విషయంలో ఇండియాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోవాలి. పంట కొనుగోలు విధానాలు సైతం మారాలి.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూతాపం.. మానవాళికి శాపం!

‣ ఈ ఏడాదైనా రూపాయి బలపడుతుందా?

‣ అక్షరాస్యతే అభివృద్ధి అస్త్రం

‣ అధిక జనాభా వరమా.. భారమా?

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం