• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రాలతో సఖ్యత.. అభివృద్ధికి రాచబాట

అంతర్జాతీయంగా పలు దేశాలతో సత్సంబంధాలు సాగిస్తూ భారత్‌ ముందడుగు వేస్తోంది. దేశీయంగానూ పలు భిన్న వైఖరులపై ఏకాభిప్రాయ సాధన ద్వారా అడుగులు పడాలి. దేశానికి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి.

ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించి పరస్పర సోదర భావంతో ఐక్యంగా అభివృద్ధి సాధించాలంటూ జీ-20 నాయకత్వాన్ని స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాలకు పిలుపిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అలీన దేశంగా నిలిచిన భారత్‌ ఇటీవలి కాలంలో పొరుగు దేశాలకే ప్రాధాన్యం పేరుతో ముందడుగు వేస్తోంది. తూర్పు వైపు చూపు పేరుతో ప్రాచ్య దేశాలతో సంబంధాలు బలపరచుకొంటోంది. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలలో కీలకంగా వ్యవహరిస్తోంది. బ్రిక్స్‌ గ్రూపులో సభ్యురాలిగా ఆర్థిక సంబంధాలను బలపరచుకొంటోంది. వ్యూహాత్మక ప్రయోజనాల కోసం క్వాడ్‌ కూటమిలో భాగస్వామిగా నిలిచింది. నాటో, జీ-7 దేశాలు భారత్‌ను మిత్రదేశంగా, ఆర్థికాభివృద్ధి పథంలో దూసుకెళుతున్న దేశంగా పరిగణిస్తున్నాయి. కొవిడ్‌  చెలరేగుతున్నప్పుడు భారత్‌ పేద దేశాలకు టీకాలు ఇచ్చి లక్షలమంది ప్రాణాలను కాపాడిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రశంసించింది. అఫ్గానిస్థాన్‌, ఉక్రెయిన్‌లతోపాటు పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు మందులు, ఆహారం, ఇతర సహాయ సామగ్రిని అందించి ఆదుకోవడంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటోంది. తుర్కియే, సిరియాల్లో భూకంపాలు సంభవించినప్పుడూ సాయపడింది. ఇలా వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో ప్రపంచ దేశాల మధ్య సోదరభావం కోసం పాటుపడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పలు విజయాలు సాధించిన భారత్‌- స్వదేశంలో రాష్ట్రాల మధ్య ఎంతవరకు ఐక్యతను, ఇచ్చిపుచ్చుకొనే ధోరణిని సాధించిందనేది కీలక ప్రశ్న.

సమస్త జీవజాలానికి ప్రాణాధారమైన నీటి కోసం జాతీయ, అంతర్జాతీయ వివాదాలు పెరిగిపోతున్నాయి. బ్రహ్మపుత్ర నీటిని భారత్‌కు అందకుండా చేయాలని చైనా పన్నాగాలు పన్నుతోంది. వాటిని భగ్నం చేయడానికి జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక దేశీయంగా వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకూ అంతులేదు. నదులపై ఎగువ రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టేసి దిగువ రాష్ట్రాలకు నీరు అందకుండా చేయాలని చూస్తున్నాయనే ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. వరదలు, అనావృష్టి సంభవించినప్పుడు దిగువ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కర్ణాటక, తమిళనాడు మధ్య, ఆంధ్ర, తెలంగాణ మధ్య జల వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. సంకుచితత్వాన్ని విడనాడి సర్దుబాటు ధోరణితో సమస్యను పరిష్కరించుకోవాలనే చొరవ, చైతన్యం కొరవడటం విచారకరం. నదులపై ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం, తాగు నీరు, విద్యుదుత్పాదనకు నీరు అందించడమనేది శాస్త్రీయ దృక్పథంతో దేశ ప్రయోజనాల కోసం జరగాలి తప్ప- రాజకీయ పక్షాల ఇష్టాయిష్టాల మేరకు కాకూడదు. 75ఏళ్ల స్వతంత్ర భారతం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో, మౌలిక వసతుల్లో, సాంకేతికతల్లో, విద్యావైద్యం, వాణిజ్యం, అంతరిక్ష రంగాల్లో, ఇంకా ఇతరత్రా గణనీయ ప్రగతి సాధించింది. అయినా కుల, మత, ప్రాంతీయ తత్వాలు, రాజకీయ అసహనం దేశానికి చీడలా పరిణమించాయి. ఈ పెడ ధోరణులకు పాల్పడేవారు ఏలినవారి అనుయాయులైతే శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నారు. దేశంలో న్యాయపాలనే సాగాలి తప్ప పాలకుల న్యాయం కాదని, పశ్చిమ్‌ బెంగాల్‌లో ఎన్నికల తరవాత జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వ్యాఖ్యానించడాన్ని బట్టి- పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కేంద్రంలో రాష్ట్రాల్లో అధికారం పార్టీల చేతులు మారినప్పుడల్లా జాతీయ, ప్రాంతీయ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపడం తగదు. విద్య, వైద్యం, న్యాయం అందరికీ సమానంగా, ఉచితంగా లభించినప్పుడే దేశం నిజంగా అభివృద్ధి చెందగలుగుతుంది. రాజకీయ పార్టీలు పోటీపడి ఉచిత వరాలిస్తే చివరకు దేశ ఆర్థిక పునాదులు కదిలిపోతాయి. ప్రజాస్వామ్య మూలస్తంభాలు మూడూ నిజాయతీగా, ఔచిత్యమెరిగి ప్రవర్తించాలి. ప్రాంతీయ పార్టీలు జాతీయ ప్రయోజనాలను దెబ్బతీయకుండా జాగ్రత్త పాటించాలి. కులమత తత్వాలను బలహీనపరచి లౌకికవాదాన్ని పటిష్ఠపరచాలి. రాజ్యాంగబద్ధ సంస్థలకు రాజ్యాంగంలో ఉల్లేఖించిన ప్రకారం పూర్తి కార్యనిర్వహణ స్వేచ్ఛ ఉండాలి. రాజకీయ పార్టీలు భిన్నత్వంలో ఏకత్వ సాధనకు కట్టుబడి ఉండాలి. దేశం లోపల, వెలుపల ఎదురవుతున్న సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవడానికి ప్రజలు, పార్టీలు సదా సన్నద్ధంగా ఉండాలి.

- ఎం.రామరాజు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మూలధన వ్యయం.. లొసుగుల మయం!

‣ ఇరాన్‌ సౌదీల కొత్త నెయ్యం

‣ వనాలు.. మానవాళికి రక్షా కవచాలు!

‣ ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఉగ్రమూకల ఊతం

‣ కాలుష్య కట్టడికి సౌరశక్తి

‣ సముద్ర జీవులకు శబ్దకాలుష్యం ముప్పు

‣ తృణధాన్యాలతోనే పోషక భద్రత

Posted Date: 25-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం