• facebook
  • whatsapp
  • telegram

భారత భాగ్య విధాత డాక్టర్‌ అంబేడ్కర్‌

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి నేడు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడే మనుషులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో మహోన్నతుడు అంబేడ్కర్‌. పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం, తద్వారా దేశాభ్యుదయం కోసం జీవితాన్నిఅంకితం చేశారాయన.

ప్రతి పౌరుడికీ హక్కులతో పాటు విధులు, బాధ్యతలు ఉంటాయి. చాలామంది హక్కుల కోసం డిమాండ్‌ చేస్తారుగానీ విధుల గురించి పట్టించుకోరు. అర్హత, అవసరం ఉన్నా లేకున్నా అందరూ అధికారం, డబ్బు, సుఖాలను అందుకోవాలని వెంపర్లాడతారు. ఫోర్బ్స్‌ వంటి పత్రికలు ఏటా ప్రపంచంలో అపర కుబేరుల జాబితాలను ప్రచురిస్తుంటాయి. ప్రపంచ జనాభాలోని 10శాతం అతి సంపన్నుల వద్ద అట్టడుగు 40శాతం బడుగు ప్రజలకన్నా ఆరు రెట్లు ఎక్కువ సంపద పోగుపడిందని ఆక్స్‌ఫామ్‌-దావోస్‌ నివేదిక నిరుడు వెల్లడించింది. ఏటా సంపన్నుల జాబితాలను ప్రకటిస్తూ ఉంటే ఐశ్వర్యంలో ఇతరులను మించిపోవాలన్న ఆరాటంలో అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం అలవాటైపోతుంది. మొదట తన దేశంలో, తరవాత యావత్‌ ప్రపంచంలో నంబర్‌ ఒన్‌ శ్రీమంతుడిగా నిలవాలని తహతహలాడతారు. ఈ అనారోగ్యకర, అవాంఛనీయ పోటీని నిలువరించడానికి ఫోర్బ్స్‌ తదితర పత్రికలు ఏటా అతి సంపన్నుల జాబితాలను, ర్యాంకులను ప్రచురించకుండా నిషేధించాలి. దానికి బదులు సంపద, ఆదాయాల్లో అసమానతలను వెల్లడిస్తూ, అత్యధిక ప్రజానీకం ఆదాయాలు పెంచి మేలు చేసే మార్గాల గురించి నివేదించాలి. 18వ శతాబ్ది నాటి బ్రిటిష్‌ తత్వవేత్త బెంథమ్‌ ప్రబోధించిన సూత్రమిదే. మానవుడు స్వతహాగా స్వార్థపరుడు, ధూర్తుడు, హ్రస్వదృష్టి గలవాడని బ్రిటిష్‌ మేధావి థామస్‌ హాబ్స్‌ ఎన్నడో సూత్రీకరించాడు. అయితే బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే తన ధ్యేయంగా, వారి అభ్యున్నతే తన కర్తవ్యంగా నిస్వార్థంగా కృషి చేసిన మహామనీషి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌.

పేద కార్మికుల పెన్నిధి

బ్రిటిష్‌ ఇండియాలో రాష్ట్రాల స్థితిగతులపై అంబేడ్కర్‌ పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. అది భారత ఫైనాన్స్‌ కమిషన్‌ ఏర్పాటుకు, 280వ రాజ్యాంగ అధికరణకు ప్రాతిపదికగా నిలిచింది. అంబేడ్కర్‌ రూపాయి సమస్య అనే సిద్ధాంత గ్రంథం ద్వారా భారతీయ కరెన్సీ, ఆర్థిక రంగంపై బ్రిటిష్‌ రాయల్‌ కమిషన్‌కు మార్గదర్శక సూత్రాలను అందించారు. వాటి ఆధారంగా 1935లో భారతీయ రిజర్వు బ్యాంకు ఏర్పాటైంది. 1942-46 మధ్య కాలంలో నీటిపారుదల, విద్యుత్‌, కార్మిక శాఖల మంత్రిగా ఉన్నప్పుడు నీటి వినియోగం, జలవిద్యుచ్ఛక్తిపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చేసిన ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ విధానం రూపుదిద్దుకొంది. ఆయన దార్శనికత కేంద్ర జల సంఘం, కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంఘాల ఆవిర్భావానికి బీజం వేసింది. దామోదర్‌ వ్యాలీ, హిరాకుడ్‌ ప్రాజెక్టులు అంబేడ్కర్‌ ప్రతిపాదనల నుంచి ఆవిర్భవించాయి. న్యాయమైన వేతనం, హుందాగా పనిచేసే హక్కు, అనారోగ్య కారణంపై సెలవులు, ఏటా నిర్ణీత రోజులపాటు సెలవు తీసుకునే అవకాశం, వైద్య సేవలు పొందే హక్కు, నిర్దిష్ట పని గంటలు, కార్మిక సంఘాలకు గుర్తింపు వంటి చర్యలతో పేద కార్మికులకు అనుకూలమైన విధానాన్ని అంబేడ్కర్‌ రూపొందించారు. మహిళా సాధికారత కోసం ఆయన పాటుపడ్డారు. న్యాయమంత్రిగా పార్లమెంటులో హిందూ కోడ్‌ బిల్లును అంబేడ్కర్‌ ప్రవేశపెట్టారు. అత్యధిక ఎంపీలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. దాన్ని నిరసిస్తూ మంత్రి పదవికి అంబేడ్కర్‌ రాజీనామా చేశారు. శతాబ్దాలుగా పురుషాధిక్య సమాజంలో నలిగిపోయిన స్త్రీ జనోద్ధరణ పట్ల ఆయన అంకిత భావానికి అది నిదర్శనం. రాజకీయాధికారం లేనిదే షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు సామాజిక, ఆర్థిక హక్కులు సిద్ధించవని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భావించారు. ఈ రెండు వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించాలని బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కోరారు. మొదటి, రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొని నాటి బ్రిటిష్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ద్వారా కమ్యూనల్‌ అవార్డును ప్రకటింపజేశారు. దానివల్ల షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ప్రత్యేక ఓటర్లుగా పరిగణన లభించింది. దానిపై మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో పూనా ఒప్పందం ద్వారా కమ్యూనల్‌ అవార్డును సవరించారు. 330, 332 రాజ్యాంగ అధికరణల ద్వారా షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ప్రత్యేక ఓటింగ్‌ హక్కులు సాధించడంలో అంబేడ్కర్‌ సఫలుడయ్యారు. పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల్లో కొన్ని సీట్లను ఈ రెండు వర్గాలకు కేటాయిస్తున్నారు.

కీలక పాత్ర

సామాజిక అణచివేత, దోపిడి నుంచి షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం, వారి విద్యా, ఆర్థిక పరమైన హక్కులకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా 46వ రాజ్యాంగ అధికరణను రూపుదిద్దడంలో అంబేడ్కర్‌ కీలక పాత్ర పోషించారు. దేశ సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నివారించడానికి 38(1), 38(2), 39(బి) రాజ్యాంగ అధికరణల రూపకల్పనకు చోదక శక్తిగా నిలిచారు. వీటన్నింటినీ పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసి ఉంటే- షెడ్యూల్డ్‌ కులాలు, తెగల స్థితిగతులు ఎంతగానో మెరుగుపడి ఉండేవి. అంబేడ్కర్‌ భారత రాజ్యాంగ నిర్మాతగా చిరఖ్యాతిని ఆర్జించారు. నేడు దేశమంతటా గాంధీజీ, ఇతర నేతల విగ్రహాలకన్నా అంబేడ్కర్‌ విగ్రహాలే ఎక్కువ. రిలయన్స్‌ మొబైల్‌ ప్రాయోజకత్వంలో ఔట్‌లుక్‌ పత్రిక, సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌, హిస్టరీ ఛానళ్లు 2012 జూన్‌-ఆగస్టు కాలంలో నిర్వహించిన జాతీయ సర్వేలో బీఆర్‌ అంబేడ్కర్‌ మహోన్నత భారతీయుడిగా గుర్తింపు పొందారు. జయహో అంబేడ్కర్‌!

నిర్మూలనే మార్గం

షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర వెనకబడిన వర్గాల అభ్యున్నతికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చేసిన నిర్విరామ కృషి జగద్విదితం. ఒకప్పుడు అస్పృశ్యులుగా పరిగణన పొందిన దళితులు సాధికారత సాధించడానికి జీవితాంతం కట్టుబడిన నాయకుడు అంబేడ్కర్‌. తన బాల్యంలో దారుణమైన కుల దుర్విచక్షణను ఆయన ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఇతర కులాల విద్యార్థులతో ఆయన్ను కూర్చోనిచ్చేవారు కాదు. నీళ్లు తాగడానికి వేరే పాత్రను వాడాల్సి వచ్చేది. కోరేగావ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఎడ్లబండ్లవారు ఆయన్ను ఎక్కించుకునేవారు కారు. గాయక్వాడ్‌ మహారాజా వద్ద పనిచేస్తున్నప్పుడు అంబేడ్కర్‌ను కింది ఉద్యోగులు సైతం అవమానించేవారు. పార్సీ వర్గం నడిపే హాస్టల్‌ నుంచి ఆయన్ను బయటకు గెంటివేశారు. దాంతో కుల వ్యవస్థ పునాదులను పెకలించాలని ఆయన కృతనిశ్చయానికి వచ్చారు. కులం పుట్టుపూర్వోత్తరాల గురించి లోతుగా అధ్యయనం చేశారు. భారత్‌లో కుల వ్యవస్థను సంస్కరించలేమని, దాన్ని నిర్మూలించడమే ఏకైక మార్గమని ఉద్ఘాటిస్తూ ఒక గ్రంథం రాశారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూటాన్‌తో బంధం భద్రం

‣ న్యాయవాద వృత్తిలో విదేశీ వకీళ్లు

‣ కృత్రిమ మేధ కొత్తపుంతలు

‣ గెలుపు కోసం సామాజిక ఎత్తుగడలు

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం