• facebook
  • whatsapp
  • telegram

బొగ్గు దిగుమతితో విద్యుత్‌ ఖరీదు

దేశంలో విద్యుత్‌ డిమాండు పెరుగుతోంది. మరోవైపు బొగ్గు కొరత విస్తరిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా సరిపోవడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో బొగ్గు ధరలు ఎప్పుడెలా పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. విదేశీ బొగ్గు దిగుమతులు పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు చెబుతోంది.  ఇలా చేయడం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమవుతుందని, దాంతో విద్యుత్‌ ఛార్జీలను పెంచాల్సి వస్తుందని పలు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి.

దేశంలో పరిశ్రమలు, వ్యవసాయంతో పాటు ఇళ్లలో కరెంటు వాడకం పెరుగుతున్నందువల్ల నెలవారీ వినియోగం అధికమైనట్లు కేంద్ర విద్యుత్‌శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. జనవరిలో భారతదేశ గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 2.10 లక్షల మెగావాట్లకు పైగా నమోదైంది. ఇందులో తెలంగాణలో 15,675, ఏపీలో 12,293 మెగావాట్లుంది. డిమాండుకు అనుగుణంగా థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి పెరగాలి. కానీ పలు కేంద్రాల్లో బొగ్గుకు తీవ్ర కొరత నెలకొంది. సౌర, పవన విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన(ఆర్‌ఈ) ఉత్పత్తి దిశగాసాగాలని కేంద్రం పదేపదే చెబుతోంది. కొత్తగా థర్మల్‌ కేంద్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించవద్దని అంటోంది. వీటికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయేతర విద్యుదుత్పత్తి అవసరమైన స్థాయిలో పెరుగుతుందా, నిరంతర విద్యుత్‌ సరఫరా నిమిత్తం దేశానికి పూచీకత్తు ఎలా ఇస్తారు అన్నవి కీలక ప్రశ్నలుగా మారాయి.  

ఉత్పత్తి పెరిగితేనే..

ఉత్పత్తి చేసిన కరెంటును నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ప్రజలకు సరఫరా చేసే సాంకేతికత ఇంకా అందుబాటులోకి రాలేదు. అది పూర్తిగా వచ్చేదాకా థర్మల్‌ కేంద్రాల కరెంటే దేశానికి కీలకం. అవి నడవాలంటే బొగ్గు గనుల్లో ఉత్పత్తి పెంచాలి. కానీ ప్రభుత్వం బొగ్గు గనుల్లో పెట్టుబడులు పెట్టలేక ప్రైవేటుపరం చేయడానికి శరవేగంగా వేలం పాటలు నిర్వహిస్తోంది. తాజాగా 17వ విడత వేలంపాటల నోటిఫికేషన్‌లో 101 బొగ్గు గనులను కేంద్ర బొగ్గుశాఖ అమ్మకానికి పెట్టింది. వీటిలో తెలంగాణలో సింగరేణి ప్రాంతంలోని నాలుగు గనులు కూడా ఉన్నాయి. వీటిని దక్కించుకోవాలంటే సింగరేణి సంస్థ వేలంపాటల్లో పాల్గొని టెండర్లు వేయాలి. కానీ బొగ్గు గనుల వేలాన్ని, ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు వేయవద్దని సింగరేణిని ఆదేశించడంతో ఈ నాలుగు గనులు ఇప్పుడిక ప్రైవేటుపరమయ్యే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో థర్మల్‌ కేంద్రాలు ప్రైవేటు గనులపై ఆధారపడాల్సి వస్తుంది. దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండు, బొగ్గు కొరతతో థర్మల్‌ కేంద్రాలు మూతపడుతున్న తీరును గమనిస్తున్న ఇతరదేశాల బొగ్గు గనుల యాజమాన్యాలు- అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఉదాహరణకు, తెలంగాణలో సింగరేణి గనుల నుంచి ఇక్కడి థర్మల్‌ కేంద్రాలకు కేవలం నాలుగు వేల రూపాయలకే టన్ను బొగ్గు లభిస్తుంటే- పక్కనున్న ఏపీలో అదే టన్ను బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి రూ.12 వేలు చెల్లిస్తున్నారు. గతంలో ఒకదశలో అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ధర రూ.20 వేలు దాటడంతో అంత చెల్లించి కొనలేక పలు థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించేశారు.

అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండును తీర్చేందుకు థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది. విదేశీ బొగ్గు ఖరీదు ఎక్కువైనందు వల్ల ఈ థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. దాంతో ఇక్కడి కరెంటును యూనిట్‌ను రూ.50కి బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకు ప్రభుత్వం తొలుత వెసులుబాటు కల్పించింది. ఇంత ధర పెట్టి కరెంటు కొని ప్రజలకు సరఫరాచేస్తే విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు ఆ సొమ్మును సామాన్య ప్రజల నుంచి వసూలు చేసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో, ఈ ధర గరిష్ఠ పరిమితిని రూ.50 నుంచి రూ.20కి తగ్గిస్తూ కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సగటు విద్యుత్‌ కొనుగోలు ధర అయిదారు రూపాయల మేర ఉంటేనే కరెంటు బిల్లుల భారం భరించలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.20 పెట్టి కొంటే అంత సొమ్మును కరెంటు బిల్లులపై వసూలు చేస్తే ప్రజలు భరించగలరా అనేది ప్రశ్నార్థకమే.

పర్యవసానాలపై దృష్టి ఏదీ?

వేలంలో బొగ్గు గనులను చేజిక్కించుకుంటున్న ప్రైవేటు కంపెనీలు భవిష్యత్తులో ఉత్పత్తి వ్యయం పెరిగిందనే పేరిట బొగ్గు ధరలను అమాంతం పెంచేస్తే దాన్ని కొనలేక థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి తగ్గితే ఇబ్బందికరమే. ఒకవేళ అధిక ధరలకు బొగ్గు కొన్న థర్మల్‌ కేంద్రాల్లో కరెంటు యూనిట్‌ను రూ.20 లేదా రూ.30 చొప్పున అమ్మితే అదంతా కరెంటు బిల్లుల రూపంలో ప్రజలు కట్టాల్సిందే. పెట్టుబడులకు నిధులు లేవన్న సాకుతో బొగ్గు గనులను వేలంపాటలు పెట్టి అమ్మేస్తున్న కేంద్రం ఇలాంటి పర్యవసానాలపై దృష్టి పెట్టడం లేదు. ప్రతి ఇంటిపై సౌరవిద్యుత్‌ ఏర్పాటుకు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తే బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. జర్మనీ, బ్రిటన్‌, అమెరికా వంటి పలు దేశాలు గృహ తదితర అన్ని అవసరాలకు పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా కాలుష్యాన్ని ఆర్థికభారాన్ని తగ్గిస్తూ, పర్యావరణాన్ని, ప్రజలను రక్షిస్తున్నాయి. మనదేశంలోనూ అలాంటి విధానాలు సత్వరమే పట్టాలెక్కాలి.

మరింత వ్యయభారం

దేశంలో ప్రస్తుతం ఏటా వందకోట్ల టన్నుల బొగ్గు అవసరం. కానీ ఉత్పత్తి 80 కోట్ల టన్నులలోపే ఉంటోంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఏటా 10 కోట్ల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి సంస్థను అడుగుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలతో గత నెలతో ముగిసిన 2022-23 సంవత్సరంలో 6.7 కోట్ల టన్నులే సింగరేణి గనుల్లో తవ్వగలిగింది. మరో మూడేళ్లకుగాని 10 కోట్ల టన్నులకు చేరే అవకాశాలు లేవని సంస్థ లెక్కలే చెబుతున్నాయి. దేశంలో కేంద్రానికి చెందిన కోల్‌ ఇండియా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి సంస్థలే ప్రభుత్వ ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ సంస్థల్లో మానవ వనరులు, ఇతర నిర్వహణ వ్యయం అధికంగా ఉంటోందని, పెట్టుబడులకు నిధుల్లేవని, కొత్త గనుల అమ్మకానికి ఆరు నెలలకోసారి వేలంపాట పెట్టి ప్రైవేటు కంపెనీలకు కేంద్రం అప్పగిస్తోంది. భవిష్యత్తులో బొగ్గు గనులన్నీ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళిన తరవాత అవి ఉత్పత్తిని నియంత్రించి ధరలు పెంచితే... థర్మల్‌ కేంద్రాలకు సరఫరా నిలిచిపోయి, లేదంటే ఆర్థిక భారం పెరిగి విద్యుదుత్పత్తి వ్యయం ఆకాశాన్నంటే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు కరెంటు బిల్లులు కట్టలేక సామాన్య ప్రజలు అల్లాడతారు.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తైవాన్‌పై చైనా దూకుడు

‣ కదలని పట్టణ ప్రగతిరథం

‣ కృత్రిమ మేధ ఎంత లాభం.. ఎంత నష్టం?

‣ వాణిజ్య ఒప్పందంలో చిక్కుముళ్లు

‣ పుడమి తల్లికి గర్భశోకం

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం