• facebook
  • whatsapp
  • telegram

విద్యా సంస్కరణలకు నిధులే ఆలంబన

ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల విద్యావ్యవస్థ భారత్‌లో ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 15లక్షల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 25కోట్ల మందికిపైగా విద్యార్థులకు 85లక్షల మంది ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. నాణ్యమైన చదువుల ద్వారా బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన అవసరముంది. ఈ దిశగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం (ఎన్‌సీఎఫ్‌) ఇటీవల తన ముసాయిదా నివేదికలో  ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసింది.

నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్‌ నిర్దేశకులూ వారే. జనాభాలో 27శాతానికి పైగా ఉన్న 14 ఏళ్లలోపు బాలలకు విద్యాబుద్ధులు చెప్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. విద్యాహక్కు చట్టంతో పాటు సర్వశిక్ష అభియాన్‌, బేటీ బచావో బేటీ పఢావో, మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. దాంతో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల నమోదు పెరిగింది. 6-14 ఏళ్ల వయసు చిన్నారుల్లో 29శాతం ప్రైవేటు బడుల్లో చదువుకుంటున్నారు. పాఠశాల విద్య విస్తరిస్తున్నా, అడుగడుగునా సవాళ్లు తప్పడంలేదు.

చదువులకు దూరంగా..

ప్రాథమిక స్థాయిలో ప్రతి వంద మంది విద్యార్థుల్లో 29 మంది మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే. ప్రపంచ సగటు అక్షరాస్యత 86.3శాతం. భారత్‌లో అది 74శాతమేనని యునెస్కో నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా మహిళల్లో అక్షరాస్యత మన దేశంలో తీసికట్టుగా ఉంది. జ్ఞాన సముపార్జనలో చాలామంది విద్యార్థులు వెనకబడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు- నాణ్యమైన చదువు అందకపోవడం, పాఠ్య ప్రణాళికలో లోపాలు, సుశిక్షితులైన ఉపాధ్యాయుల కొరత, మూస బోధన పద్ధతులు, కఠిన పాఠ్యాంశాలు, పరీక్షల భయం, మార్కుల ఒత్తిడి వంటివేనని విద్యారంగ నిపుణులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా పాఠశాల విద్యను తీర్చిదిద్దాలి. బాలబాలికలు ఆసక్తితో ఉత్సాహంగా చదువుకునేలా బోధన, పరీక్ష విధానాల్లో మార్పులు తీసుకురావాలి. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం (ఎన్‌సీఎఫ్‌) ఉపయోగపడుతుంది. దీనిపై సమీక్షించిన కస్తూరి రంగన్‌ కమిటీ- మేలిమి ప్రతిపాదనలతో ఇటీవల ప్రభుత్వానికి ఒక ముసాయిదా నివేదికను అందించింది. నూతన జాతీయ విద్యావిధానం-2020లో భాగంగా 3-18 ఏళ్ల పిల్లల విద్యార్జన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ నివేదిక దోహదపడుతుంది. ప్రాచీన తాత్విక మూలాలకు ప్రాధాన్యమిస్తూ- జ్ఞాన సముపార్జనకు జ్ఞానేంద్రియాలను వినియోగించడం, పరిస్థితులను అవగాహన చేసుకోవడం వంటి ఆరు విధానాలను విద్యార్థులకు నేర్పించాలని ఇది నిర్దేశిస్తోంది. పంచ కోశ వికాసం ద్వారా పిల్లల్లో వివేకాన్ని, నైతికతను పెంపొందించాలని సూచించింది.

పాఠశాల విద్యారంగంలో పాఠ్యాంశాలు, బోధన పద్ధతులు, పరీక్షా విధానాల్లో విప్లవాత్మక మార్పులను కస్తూరి రంగన్‌ కమిటీ ముసాయిదా నివేదికలో ప్రతిపాదించింది. పాఠశాల విద్యలో ప్రస్తుతమున్న మూడు దశలను నాలుగు దశలుగా పునర్‌ వ్యవస్థీకరించాలని సిఫారసు చేసింది. మొదటి దశ (ఫండమెంటల్‌ స్టేజ్‌)లో మూడేళ్ల పిల్లలను చేర్చుకుంటారు. ఇది అంగన్‌వాడిలో చేర్చుకోవడం నుంచి రెండో తరగతి వరకు మొత్తం అయిదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ దశలో ఆటపాటలతో చదువు సాగుతుంది. లిఖిత పరీక్షలు ఉండవు. రెండోది సిద్ధపరచే దశ (ప్రీ-ప్రిపరేటరీ స్టేజ్‌). ఇది మూడో తరగతి నుంచి అయిదో తరగతి వరకు ఉంటుంది. ఈ తరగతుల్లో పుస్తక పఠనం, లిఖిత పరీక్షలు ఉంటాయి. తరవాత మధ్య దశ (మిడిల్‌ స్టేజ్‌)లో విద్యార్థులు ఆరు నుంచి ఎనిమిది తరగతులు చదువుతారు. ప్రయోగాత్మక బోధన పద్ధతుల్లో సైన్స్‌, గణితం, సామాజిక శాస్త్రాలు, మానవ శాస్త్రాలు, కళలను అభ్యసిస్తారు. తద్వారా అనుభవపూర్వకంగా లౌకిక జ్ఞానాన్ని సముపార్జించే అవకాశం ఉంటుంది. ఈ దశలో పుస్తక పఠనమూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక చివరిదైన సెకండరీ దశలో విద్యార్థులు తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతారు. ఇది రెండు స్థాయుల్లో జరగాలని ముసాయిదా నివేదిక పేర్కొంది. మొదటి స్థాయిలో 9, 10 తరగతులు; రెండో స్థాయిలో 11, 12 తరగతులు ఉంటాయి.

నాణ్యత పెంపు..

కస్తూరి రంగన్‌ కమిటీ ప్రతిపాదనలు పాఠశాల విద్య నాణ్యతను పెంపొందిస్తాయనడంలో సందేహం లేదు. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలుచేసి, మంచి ఫలితాలు రాబట్టడానికి పెద్దమొత్తంలో నిధులు అవసరం. విద్యారంగంపై చేసే ఖర్చును ప్రభుత్వాలు దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించాలి. ఈ నిధులతో బడుల్లో వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకం వంటి చర్యలను వేగవంతంగా చేపట్టాలి. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల్లో వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు డిజిటల్‌ విద్యకు అవసరమైన సదుపాయాలను సమకూర్చాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పాఠశాల విద్యను విస్తృతపరచాలి. చదువుల నాణ్యతను మదింపు వేసేందుకు శాస్త్రీయంగా ప్రమాణాలను నిర్దేశించుకోవాలి. విద్యాహక్కు చట్టం, నూతన విద్యావిధానం, జాతీయ పాఠ్య ప్రణాళిక వ్యవస్థలు అత్యుత్తమంగా ఉన్నా- వాటి ప్రతిపాదనల అమలుకు నిధులు విదపకపోతే ‘నాణ్యమైన విద్య’ సుదూర స్వప్నంగానే మిగిలిపోతుంది!

పరీక్షల భయం పోగొట్టాలని..

సెకండరీ దశలో అధ్యయనానికి కస్తూరి రంగన్‌ కమిటీ మొత్తం ఎనిమిది అంశాలను ప్రతిపాదించింది. అవి: మానవశాస్త్రం, గణితం-కంప్యూటర్‌ విద్య, వృత్తి విద్య, వ్యాయామ విద్య, కళలు, సాంఘిక శాస్త్రాలు, సైన్స్‌, బహుళ శాస్త్రాల అధ్యయనం. వీటిని తప్పక చదవాల్సిన కోర్సులు; ఎంపిక చేసుకునే కోర్సులు; కళలు, వృత్తి, వ్యాయామ విద్యా కోర్సులుగా వర్గీకరించింది. 11-12 తరగతుల్లో సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కమిటీ ప్రతిపాదించింది. ఆ సమయంలో ఎంపిక చేసుకున్న కోర్సుల్లోని కొన్ని అంశాలకే పరీక్షలు పరిమితమవుతాయి. తద్వారా పరీక్షలంటే విద్యార్థుల్లో భయం, ఒత్తిడి తగ్గి... విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడం సాధ్యపడుతుందని ఎన్‌సీఎఫ్‌ ముసాయిదా నివేదిక పేర్కొంది. పాఠశాల విద్య సెకండరీ స్థాయిలో ఒక తరగతితో మరో తరగతి ముడివడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు 9-12 తరగతులను ఏకాగ్రతతో చదువుతారు. విద్యార్థులు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకుని చదవడం వల్ల వారిలో ఆసక్తి, ఉత్సాహం పెరుగుతాయి. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థులు సముపార్జించి, వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాల్సి ఉంది. ఈ లక్ష్యాలను చేరుకోవాలన్న ఉద్దేశంతోనే సెకండరీ దశలో మార్పులను ప్రతిపాదించారు. వీటి ద్వారా మంచి విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వం కలిగిన మానవ వనరులుగా విద్యార్థులను తీర్చిదిద్దవచ్చని కమిటీ యోచించింది.

- డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌ 

(విద్యారంగ నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మాల్దీవులతో పటిష్ఠ బంధం

‣ పశ్చిమాసియాలో డ్రాగన్‌ దూకుడుకు చెక్‌!

‣ నవీన సాంకేతికతతో సరికొత్త సేవలు

‣ సూడాన్‌ నుంచి.. ఆపరేషన్‌ కావేరి!

‣ కారడవులపై గొడ్డలి వేటు

‣ ముసురుతున్న మాంద్యం మబ్బులు

‣ సమర్థ నిర్వహణతోనే జల సంరక్షణ

Posted Date: 22-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం