• facebook
  • whatsapp
  • telegram

రక్షణ స్వావలంబనకు ప్రైవేటు బాసట

రక్షణ రంగంలో దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఎగుమతులను భారీగా పెంచాలని ఇండియా పరితపిస్తోంది. ఈ రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఆశించినంతగా లేదు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలన్న ఆకాంక్ష నెరవేరాలంటే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు పెంచడం తక్షణావసరం.

రక్షణ రంగంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దిగుమతిదారు స్థానంలో కొన్నేళ్లుగా ఇండియా కొనసాగుతోంది. నైపుణ్యమున్న మానవ వనరులు, తగినంత ముడి సరకు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయుధాలు, ఇతరత్రా సైనిక సామగ్రిని అవసరమైన స్థాయిలో దేశీయంగా ఉత్పత్తి చేసుకోలేకపోతుండటం ఒక రకంగా వైఫల్యమే. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడంపై గతంలో అంతగా దృష్టి సారించలేదు. ఈ రంగంలో ఎగుమతులకు సంబంధించి మన దేశానికి ప్రత్యేక వ్యూహమేదీ లేదంటే అతిశయోక్తి కాదు. 2014 సెప్టెంబరులో సంబంధిత విధానాన్ని మోదీ సర్కారు రూపొందించింది. మేకిన్‌ ఇండియాకూ ఊతమిచ్చేలా సైనిక ఉత్పత్తుల దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, ఎగుమతులను పెంచేందుకు తరవాత కూడా పలు ప్రణాళికలు రచించింది. వాటిలో ‘స్వదేశీకరణ సానుకూల జాబితా(పీఐఎల్‌)’ రూపకల్పన కీలకమైనది. నిర్దిష్ట రక్షణ ఉత్పత్తులు, విడిభాగాల దిగుమతిని దశలవారీగా నిషేధించి, దేశీయంగానే వాటిని సముపార్జించుకోవాల్సిన పరిస్థితిని కల్పించడం పీఐఎల్‌ ప్రధాన ఉద్దేశం. స్వదేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు అది దోహదం చేస్తుంది. 2021 డిసెంబరు నుంచి ఇప్పటివరకు రక్షణ శాఖ మొత్తం నాలుగు పీఐఎల్‌లను జారీ చేసింది. 928 రకాల ఉత్పత్తులను చేర్చిన నాలుగో జాబితా వల్ల ఏటా సుమారు రూ.715 కోట్ల దిగుమతుల భారం తగ్గుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల 2018-22 మధ్య రక్షణ రంగంలో భారత దిగుమతులు 11 శాతం మేర తగ్గాయి. ఎగుమతులు గత ఆరేళ్లలో పది రెట్లు పెరిగాయి. 2016-17లో మన ఎగుమతుల విలువ రూ.1,521 కోట్లు. 2022-23 కల్లా అవి రూ.15,921 కోట్లకు చేరుకుంది. అయితే ఇప్పటికీ ప్రపంచ రక్షణ ఉత్పత్తుల విపణిలో మన ఎగుమతుల విలువ 0.2శాతం మాత్రమే. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కలలుకంటున్న ఇండియా ఈ విషయంపై మరింతగా శ్రద్ధ పెట్టాలి.

ప్రపంచ రక్షణ ఉత్పత్తుల విపణిలో ఇండియా వెనకబడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి- దేశీయంగా ఈ రంగంలో ప్రైవేటు కంపెనీలకు తగినంత ప్రోత్సాహం లభించకపోవడం. రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మన దేశం 2001 నుంచి అనుమతిస్తోంది. ఆత్మనిర్భరత సాధనలో ప్రైవేటు కంపెనీల సహకారం ఆవశ్యకతను గుర్తించిన మోదీ సర్కారు- వాటిని ప్రోత్సహించడంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా- రక్షణ రంగంలో కొన్ని ప్రాజెక్టులను ప్రైవేటుకే కట్టబెట్టేలా ‘వ్యూహాత్మక భాగస్వామ్యం(ఎస్‌పీ)’ పేరుతో ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. అది ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. నావల్‌ యుటిలిటీ హెలికాప్టర్ల(ఎన్‌యూహెచ్‌) తయారీకి 2019లో ఆసక్తి అభివ్యక్తీకరణ(ఈఓఐ)లను ఆహ్వానించినప్పుడు అయిదు ప్రైవేటు కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. అయితే ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) కూడా రెండు బిడ్‌లతో అందులో ప్రవేశించింది. పీ75-ఐ జలాంతర్గాముల విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఎదురైంది. ఫలితంగా- ప్రభుత్వరంగ సంస్థల జోక్యంతో ఎస్‌పీ విధానం నిర్వీర్యమవుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. ప్రస్తుతం రక్షణ రంగ ఎగుమతుల్లో అమెరికాది ప్రపంచంలో అగ్రస్థానం. వాషింగ్టన్‌ ఆ స్థాయిలో ఉండటం వెనక లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌ వంటి ప్రముఖ ప్రైవేటు కంపెనీల పాత్ర కీలకమన్న సంగతిని గుర్తించాలి. రక్షణ రంగంలో ఇండియా ఎగుమతుల్లో ప్రైవేటు వాటా ఇప్పుడు కేవలం 21శాతం. దాన్ని భారీగా పెంచుకోవాలి. అందుకోసం డీఆర్‌డీఓ వంటి ప్రభుత్వరంగ సంస్థలతో ప్రైవేటు కంపెనీలు దీర్ఘకాలిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సహకరించాలి. రక్షణ రంగంలో ప్రైవేటుకు ప్రాధాన్యం పెంచితే- దేశీయంగా పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. పోటీతత్వం పెరుగుతుంది. కొత్త సాంకేతికతలు ఆవిష్కృతమవుతాయి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకొంటుంది. ప్రభుత్వరంగ సంస్థలపైనా భారం తగ్గుతుంది. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గుతుంది. రక్షణ రంగం ఆధునికీకరణ సులువవుతుంది. 2025 కల్లా ఈ రంగంలో ఏటా రూ.35 వేల కోట్ల ఎగుమతుల సామర్థ్యాన్ని సముపార్జించుకోవాలని ఇండియా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రైవేటుకు తోడ్పాటునందిస్తే దాన్ని చేరుకోవడం అంత కష్టమేమీ కాదు.

- ఎం. నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో సైన్యంలోకి..

‣ గ్రామర్‌ తెలిస్తే మార్కులు ఈజీ

‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

Posted Date: 22-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం